అన్నదాతకు కన్నీళ్లే!

ABN , First Publish Date - 2022-05-06T05:13:58+05:30 IST

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి వేలాది క్వింటాళ్ల ధాన్యం నీళ్ల పాలైంది. సుమారు 5వేల ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. యాసంగి సీజన్‌లో వరి పంట వేయాలా? లేదా ప్రత్యామ్నాయ పంట సాగు చేయాలా? అనే ఊగిసలాటలోనే రైతులు ఈ వరి పంటకే మొగ్గు చూపారు. కొందరు ముందుగానే మిల్లర్లకు విక్రయించగా.. చాలా మంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆశలు పెట్టుకున్నారు. ధాన్యం కాంటాలకు చేరే లోగానే అకాల వర్షానికి నష్టం వాటిల్లింది.

అన్నదాతకు కన్నీళ్లే!
సిద్దిపేట మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతు

దుఃఖాన్ని మిగిల్చిన అకాల వర్షం

తడిసిన ధాన్యం.. నేలవాలిన వరి

కొనుగోళ్లు ఆలస్యం కావడమే కారణం

ఆదుకోవాలంటున్న అన్నదాతలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 5 : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి వేలాది క్వింటాళ్ల ధాన్యం నీళ్ల పాలైంది. సుమారు 5వేల ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. యాసంగి సీజన్‌లో వరి పంట వేయాలా? లేదా ప్రత్యామ్నాయ పంట సాగు చేయాలా? అనే ఊగిసలాటలోనే రైతులు ఈ వరి పంటకే మొగ్గు చూపారు. కొందరు ముందుగానే మిల్లర్లకు విక్రయించగా.. చాలా మంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆశలు పెట్టుకున్నారు. ధాన్యం కాంటాలకు చేరే లోగానే అకాల వర్షానికి నష్టం వాటిల్లింది. 


ప్రారంభాలు సరే.. కొనుగోళ్లేవి ?

జిల్లాలో 412 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సుమారు 300 కేంద్రాలను ప్రారంభించారు. వీటిని కూడా ఆలస్యంగానే తెరిచారు. ఈ ప్రారంభించిన అన్ని చోటుల్లోనూ కొనుగోళ్లు మొదలుకాలేవు. టార్పాలిన్లు, గోనె సంచులు లేక రైతులు ఎదురుచూశారు. ఒక్కో రైతు వారం, పది రోజుల పాటు ఎదురు చూశారు. ఇంతలోనే వర్షం రావడంతో తెచ్చిన ధాన్యం కాస్తా నీటి పాలైంది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన దాదాపు 40శాతం ధాన్యం తడిసినట్లుగా తెలుస్తోంది. వెనువెంటనే ధాన్యం కొనుగోలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అంటున్నారు. 


సమన్వయ లోపం

అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నడుమ సమన్వయం లేకనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేవని తెలుస్తోంది. పేరుకే కేంద్రాలను ప్రారంభించారే తప్ప అక్కడ ఎలాంటి వసతులు కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆయా కేంద్రాలకు చెందిన ధాన్యాన్ని ఏయే మిల్లుల్లోకి తరలించాలనే విషయంపై కూడా స్పష్టత లేదు. పక్క జిల్లాల్లో ఇప్పటికే 30 శాతానికిపైగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించారు. కానీ మన జిల్లాలో ఆ పరిస్థితి లేదు. దీనికి తోడు మిల్లుల్లో ఎఫ్‌సీఐ తనిఖీలు చేపడుతున్నందున కేంద్రాల నుంచి ధాన్యం నిల్వ చేసుకునేందుకు మిల్లర్లు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తక్కువ ధరకు ముందుగానే మిల్లుల్లోకి ధాన్యం విక్రయించిన రైతులు సేఫ్‌గా ఉన్నారు. 


గుండెలు అవిసిపోతున్నాయి

పెట్టుబడి లేక అప్పు తెచ్చి కష్టపడి పండిస్తే వర్షం వచ్చి నేలకొరిగింది. వరి గెలలంతా రాలిపోయాయి. పంటను చూస్తుంటే గుండెలు అవిసిపోతున్నాయి. ఇప్పుడేం చెయ్యాలో అర్థం అయితలేదు. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకుంటే తప్ప బతికే పరిస్థితి లేదు. 

- అయిల అర్జున్‌, రైతు, గజ్వేల్‌


కొనమంటే కొనడంలేదు..

నేను పది రోజుల కిందటే కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చిన. ఏప్రిల్‌ 27న సాయంత్రం కురిసిన చిన్న వర్షానికి వడ్లు తడిసినయి. వడ్లను ఆరబోసిన. మూడు రోజుల కింద కేంద్రాన్ని ప్రారంభించారు. కాంటా మిషన్‌ లేదు. ప్యాడీ క్లీనర్‌ తెచ్చినా కరెంటు కనెక్షన్‌ ఇవ్వలేదు. రైతులే పరదాలు తెచ్చుకున్నారు. కొనమంటే ధాన్యం కొనలేదు. వర్షానికి మొత్తం తడిసింది. 

- బూర్గు సాయిలు, రైతు, మద్దూరు


10 రోజుల కింద కేంద్రానికి తెచ్చాం

ఆరు నెలలు కష్టపడి ఆరు ఎకరాల్లో వరి పండించాం. చేతికందడంతో కొద్దిరోజుల్లో కష్టాలు పోతాయనుకున్నాం. 10 రోజులక్రితం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చాం. ఇంకా కొనకపోవడంతో ఆరబెట్టుకున్నాం. ఇంట్లో ఎవరో ఒకరం ఇక్కడే కాపలాకాయాల్సి వస్తుంది. కానీ అకాలవర్షం రావడంతో మొత్తం ధాన్యం తడిసిపోయింది. 

-ఉడుత సత్యనారాయణ, రైతు, ఆకునూరు


లక్ష రూపాయల నష్టం

నాకున్న 8 ఎకరాల్లో 3 ఎకరాలు వరి సాగు చేశాను. పంట కోసే సమయంలో ఈదురుగాలులతో వచ్చిన వర్షానికి పంటంతా నేలవాలింది. సుమారుగా లక్ష రూపాయలుపైగానే నాకు నష్టం వాటిల్లింది. వ్యవసాయంపైనే ఆధారపడి నా కుటుంబం బతుకుతుంది. మాకు భరోసా కల్పించాలి. 

- బట్ట పర్శరాములు, రైతు, బందారం


పెట్టుబడి కూడా వచ్చేట్టులేదు

నా రెండు ఎకరాల పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. బుధవారం తెల్లవారుజామున కురిసిన గాలివానకు రెండు ఎకరాలకుపైగా వరి చేను నేలవాలి వడ్లన్నీ రాలిపోయాయి. అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. అది కూడా వచ్చేట్లు లేదు.

- తిరుపతి, రైతు, విఠలాపూర్‌


వడ్లన్నీ కొట్టుకుపోయినయి

తొగుట మార్కెట్లకు వడ్లు తెచ్చి వారం రోజులైతాంది. కాంట స్టార్ట్‌ చేసినమని చెప్పిండ్రు. ఇంత వరకు గింజ కూడా సంచి నింపలే. వానొచ్చి మార్కెట్ల పోసిన నా వడ్లు కొట్టుకుపోయి మోరిల పడ్డాయి. వానకు నాని ఉన్న వడ్లు కూడా నల్లగ అయినాయి. మా వడ్లు ఎవరు కొంటరు.. మాకు దిక్కేది. 

- గోడుడు పోచయ్య, రైతు, లింగంపేట




Read more