రోశయ్యకు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-12-06T08:21:40+05:30 IST

రోశయ్యకు కన్నీటి వీడ్కోలు

రోశయ్యకు కన్నీటి వీడ్కోలు

పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, చిరంజీవి హాజరు

మంత్రులు బొత్స, పేర్ని, వెలంపల్లి, బాలినేని,

కాంగ్రెస్‌ నేతలు శైలజా, రఘువీరా కూడా

సోనియా తరఫున నివాళులర్పించిన ఖర్గే

పోలీస్‌ గౌరవ వందనంతో గాంధీభవన్‌కు పార్థివదేహం తరలింపు

12.30 గంటలకు దేవరయాంజల్‌కు..అధికార లాంఛనాలతో అంత్యక్రియలు


దాదాపు ఆరు దశాబ్దాల రాజకీయ జీవితం.. అజాతశత్రువుగా పేరు.. పార్టీలకతీతంగా నేతలతో సత్సంబంధాలు.. రాజకీయ కురువృద్ధుడు.. వివాదరహితుడు.. ఆర్థిక చాణక్యుడు.. పదవులకే వన్నె తెచ్చిన నేత.. కొణిజేటి రోశయ్యకు తెలుగు రాష్ట్రాల ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు కడసారి వీడ్కోలు పలికేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు అమీర్‌పేటలోని స్వగృహంలో రోశయ్య పార్థివదేహానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివా్‌సరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, చిరంజీవి, బీజేపీ నేత టీజీ వెంకటేష్‌, సీనియర్‌ పాత్రికేయులు ఐ.వెంకట్రావుతో పాటు పలువురు ప్రముఖులు పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం పోలీస్‌ గౌరవ వందనంతో ఉదయం 11.20 గంటలకు రోశయ్య పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో గాంధీభవన్‌కు తరలించారు.


గాంధీభవన్‌లో ఘనంగా నివాళులు..

రోశయ్య పార్థివదేహానికి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రత్యేక వాహనంలో గాంధీభవన్‌కు చేరుకోగానే ‘జోహార్‌ రోశయ్య, అమర్‌ రహే రోశయ్య’ అంటూ నినాదాలు చేశారు. పార్థివ దేహంపై పార్టీ జెండాను కప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశం మేరకు మల్లికార్జున ఖర్గే గాంధీభవన్‌కు వచ్చి రోశయ్యకు నివాళులర్పించారు. 12.30కు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, పార్టీ ఇతర నేతలు శవపేటికను మోసుకుంటూ వెళ్లి వ్యాన్‌లోకి ఎక్కించారు. అక్కడి నుంచి దేవరయాంజాల్‌లోని రోశయ్య వ్యవసాయ క్షేత్రానికి తరలించారు.


సొంత వ్యవసాయ క్షేత్రంలో..

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లోని రోశయ్య వ్యవసాయ క్షేత్రం లిటిల్‌ ఇంగ్లండ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు కవాతుతో రోశయ్య పార్థివ దేశాన్ని చితి వద్దకు తీసుకెళ్లారు. 2గంటల పాటు పూజాక్రతువు నిర్వహించిన అనంతరం పార్థివ దేహాన్ని చితి పైకి తీసుకెళ్లారు. పోలీసు వందనం, శ్రద్ధాంజలి, 2నిమిషాల మౌనం పాటించిన అనంతరం మూడుసార్లు తుపాకులతో గాల్లోకి కాల్చారు. చితికి పెద్ద కుమారుడు శివసుబ్బారావు నిప్పంటించారు. 


పార్టీ గొప్ప నేతను కోల్పోయింది: ఖర్గే 

రోశయ్య తనకు 50 ఏళ్లుగా తెలుసునని, ఆయన మరణంతో కాంగ్రెస్‌ పార్టీ గొప్ప నేతను కోల్పోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. రోశయ్యకు నివాళి అర్పించిన అనంతరం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసినంతవరకు దేశంలో 16 సార్లు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి రోశయ్య మాత్రమేనని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి బాలినేని తెలిపారు. రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ, తమిళనాడులో రోశయ్య పేరుమీద ఘాట్‌లను ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ, ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఏపీలో కూడా రోశయ్య స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 


హుస్సేన్‌సాగర్‌ సమీపంలోని సంజీవయ్య పార్కులో ఉన్న భారీ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. రోశయ్య మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. దీంతో భారీ జాతీయ పతాకాన్ని శనివారం నుంచి అవనతం చేసి ఉంచారు. సోమవారం వరకు ఇలాగే కొనసాగనుంది.


రోశయ్య భౌతికకాయాన్ని చూసే తీరికే లేదా?: డూండీ రాకేశ్‌

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించే తీరిక కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేదా? అని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్‌ ప్రశ్నించారు. వరదలొచ్చి జనాలు కొట్టుకుపోతున్నా పక్క రాష్ట్రంలో సొంత కులపు వాళ్ల పెళ్లిళ్లకు వెళ్లేందుకు సమయమున్న జగన్‌ రెడ్డికి రాజకీయ కురువృద్ధుడు రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించే తీరిక లేదా అని నిలదీశారు. వైఎస్‌ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్న రోశయ్యకు రాజశేఖరరెడ్డి ఎంతో విలువ ఇచ్చారన్నారు. తెలుగు రాష్ట్రాల వైశ్యుల్లో ప్రముఖుడైన రోశయ్య చనిపోతే, జగన్‌ స్వయంగా వెళ్లకపోవడం ఆర్య వైశ్యుల్ని అవమానించడమేనని ఓ ప్రకటనలో విమర్శించారు. 

Updated Date - 2021-12-06T08:21:40+05:30 IST