రాకేశ్‌కు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2022-06-19T09:03:47+05:30 IST

ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనాలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..

రాకేశ్‌కు కన్నీటి వీడ్కోలు

  • అంతిమ యాత్ర ఆసాంతం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలోనే
  • పాడె మోసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
  • ఉద్రిక్తతల నడుమ 53 కి.మీ. అంతిమ యాత్ర
  • దారి పొడవునా మోదీ దిష్టిబొమ్మల దహనాలు
  • బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లపై 
  • దాడికి యత్నించిన ఆందోళనకారులు
  • వరంగల్‌లో ఉద్రిక్తత.. నర్సంపేటలో బంద్‌
  • టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీ ర్యాలీలు
  • రాకేశ్‌ దహన సంస్కారాలకు భారీగా జనం


వరంగల్‌, వరంగల్‌ సిటీ, హనుమకొండ సిటీ, ఆంధ్రజ్యోతి, జూన్‌ 18: ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనాలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. వాటి ఆస్తులపై దాడికి యత్నాలు.. నేతల అరెస్టులు ఓవైపు..! వందల వాహనాలతో ర్యాలీ.. భారీగా తరలివచ్చిన ప్రజలు.. కుటుంబ సభ్యులు, మిత్రుల కన్నీటి ధారలు మరోవైపు..! సైన్యంలో అగ్నిపథ్‌ నియామక విధానానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నిర్వహించిన నిరసనలో కాల్పులు జరగ్గా, తూటా తగిలి మృతిచెందిన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేటకు చెందిన దామెర రాకేశ్‌ (22) అంతిమ యాత్ర సాగిన తీరిది. ఈ కమ్రంలో శనివారం వరంగల్‌ జిల్లా ఉద్రిక్తంగా మారింది. రాకేశ్‌ మృతదేహాన్ని ఉంచిన ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ వద్దకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉదయమే చేరుకున్నారు. కాసేపటికే నర్సంపేట, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌ వచ్చారు. ఆ ప్రాంతమంతా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలను మోహరించారు.టీఆర్‌ఎస్‌ పార్టీ, నల్లజెండాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇతర పార్టీల వారు రావడానికి సాహసించలేదు. ఉదయం పది గంటలకు ఎంజీఎం సర్కిల్‌ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర పోచమ్మ మైదాన్‌, నర్సంపేట, అశోక్‌ నగరం మీదుగా సాయంత్రం 4 గం.కు దబ్బీర్‌పేట చేరుకుంది. 6 గంటలకు రాకేశ్‌ దహన సంస్కారాలు జరిగాయి. వందకుమించిన వాహనాలతో 53 కి.మీ. మేర.. ర్యాలీ ఆద్యంతం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలోనే సాగింది. అంతకుముందు రాకేశ్‌ మృతదేహం ఉన్న పేటికను మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు మార్చురీ నుంచి డీసీఎంలోకి ఎక్కించారు. అక్కడినుంచి వెంకట్రామ కూడలి వరకు పది కిలోమీటర్లు ర్యాలీ జరగ్గా.. మంత్రులు, ఎమ్మెల్యేలు కాలినడకన పాల్గొన్నారు.

 

కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు

వరంగల్‌ నుంచి దబ్బీర్‌పేట వరకు కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎంజీఎం సెంటర్‌ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను ఎమ్మెల్యే నరేందర్‌, పోచమ్మ మైదాన్‌ చేరుకోగానే చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంతలో కొందరు బీఎ్‌సఎన్‌ఎల్‌ భవనం పైకి రాళ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. వినయ్‌ వారించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అదే సెంటర్‌లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాశీబుగ్గ సెంటర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కేయూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. 


నర్సంపేట బంద్‌, ఉద్రిక్తత

రాకేశ్‌ మృతికి నిరసనగా నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లో బంద్‌ పాటించారు. అంతిమయాత్ర మఽధ్యాహ్నం 2గంటలకు నర్సంపేట అమరవీరుల స్థూపం వద్దకు చేరింది. యాత్ర ముందుభాగంలో ఉన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీ కవిత ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడినుంచి దబ్బీర్‌పేటకు సాగింది. మరోవైపు రాకేశ్‌ మృతదేహం ఉన్న వ్యానుకు టీఆర్‌ఎస్‌ జెండాలను కట్టడంపై అతడి మిత్రులు, ఆర్మీ అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు. రాకేశ్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క దబ్బీర్‌పేటలోకి వచ్చే ప్రయత్నం చేయగా, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆమెను పోలీసులు  అక్కడినుంచి తరలించారు. చింతనెక్కొండలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తదితర నేతలను పోలీసులు అడ్డుకున్నారు.


దబ్బీర్‌పేట కన్నీరుమున్నీరు

రాకేశ్‌ మృతదేహం స్వగ్రామం దబ్బీర్‌పేట చేరగానే ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గ్రామమంతా కన్నీటిపర్యంతమైంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రాకేశ్‌ అంత్యక్రియలు జరిగాయి. కాగా, ఎంజీఎం మార్చురీకి ఉదయమే చేరుకున్న రాకేష్‌ తల్లిదండ్రులు, అక్కలు, అన్న గుండెలవిసేలా రోదించారు. దేశ సేవలో ఉంటాడనుకుంటే కానరాని లోకాలకు వెళ్లాడని తల్లి పూలమ్మ, తండ్రి కుమారస్వామి, అక్కలు ఉష, రాణి, అన్న రామరాజు విలపించారు.

Updated Date - 2022-06-19T09:03:47+05:30 IST