కన్నీటి ‘చెరువు’

ABN , First Publish Date - 2020-12-05T07:08:21+05:30 IST

గోదావరి ఏటిగట్టుపై వెళుతున్న ఆ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న మంచినీటి చెరువులోకి బోల్తా కొట్టింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు జలసమాధి అయ్యారు.

కన్నీటి ‘చెరువు’


అదుపుతప్పి చెరువులో దూసుకెళ్లిన కారు.. కోట ఏటిగట్టు వద్ద ప్రమాదం

శుభకార్యానికి వెళ్లి ఇంటికి వెళుతుండగా ఘటన.. యానాంలో తీవ్ర విషాదం 

విజయలక్ష్మి రచయిత్రి, వ్యాఖ్యాత.. కుమారుడు రాజోలులో బ్యాంకు అధికారి


యానాం, డిసెంబరు 4: రాజమహేంద్రవరంలో అప్పటిదాకా వారంతా ఎంతో సందడిగా చేశారు. తమ ఇంట శుభకార్యానికి శ్రీకారం చుట్టారు. బంధువులతో ఆనందంగా గడిపారు. అదే సమయంలో కొత్తగా కొనుకున్న కారులో ఇంటికి చేరేందుకు బయలుదేరారు. గోదావరి ఏటిగట్టుపై వెళుతున్న ఆ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న మంచినీటి చెరువులోకి బోల్తా కొట్టింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం గురువారం రాత్రి కె గంగవరం మండలం కోటిపల్లి సమీపంలోని కోట ఏటిగట్టుపై జరిగింది. మృతులు యానాంకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కామవరపు సత్యసీతరామ ప్రసాద్‌, విశ్రాంత అధ్యాపకురాలు విజయలక్ష్మి (61), చిన్న కుమారుడు సత్యసంతోష్‌ చంద్రప్రణీత్‌ (32). ఈ విషాద వార్త తెలిసిన వెంటనే యానాంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ముఖ్యంగా యానాంలో విజయలక్ష్మి అందరికీ సుపరిచితురాలు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా, వేడుక జరిగినా దానికి చాలాఏళ్ల నుంచి ఆమే వ్యాఖ్యాత. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా నిర్వహణ బాధ్యతలు తీసుకునేవారు. సాహితీ సభలు మొదలుకొని అన్ని కార్యక్రమాల్లో ఆమె ఉండేవారు. అంతేకాకుండా కవయిత్రిగా, రచయిత్రిగా ఆమెకు పేరుంది. మూడు నాలుగు పుస్తకాలు ఇప్పటిదాకా వెలువరించారు. అనువాదకురాలిగానూ వ్యవహరించేవారు. తెలుగు అధ్యాపకురాలిగా ఉద్యోగ విరమణ చేశారు. ఇక ప్రణీత్‌ రెండో కుమారుడుకాగా, ప్రస్తుతం రాజోలులో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అధికారిగా పనిచేస్తున్నాడు. అతని నిశ్చితార్థ వేడుక కోసమే వీరంతా రాజమహేంద్రవరం వెళ్లారు. పుదుచ్ఛేరిలో ఉన్న మంత్రి మల్లాడి రంగారావు వారి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడి ఓదార్చారు. రాత్రి బాగా పొద్దుపోయాక యానాంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో యానాం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి దాట్ల దేవ దానం రాజు మాట్లాడుతూ విజయలక్ష్మి తెలుగు అధ్యాపకురాలిగానే కాకుండా కవయిత్రిగా, రచయిత్రిగా తనదైన శైలిలో రచనలను అందించారని కొనియాడారు. ‘ఉయ్యాలలో సూర్యుడు’ రచనకు తాను ముందుమాట రాశానని గుర్తుచేసుకున్నారు. యానాంపై ఒక గీతం రాశారని, ఎస్పీ బాలు వచ్చినప్పుడు ఆయన ఆలపించారని అన్నారు. యానాంకు ఆమె లేనిలోటు తీరనిదని రాజు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-05T07:08:21+05:30 IST