కూల్చేసి.. వదిలేసి!

ABN , First Publish Date - 2022-07-28T05:02:35+05:30 IST

రాజాం నగర నడిబొడ్డున కోట్లాది రూపాయలు విలువ చేసే పోలీస్‌ క్వార్టర్స్‌ స్థలం నిరుపయోగంగా మారింది. పాత భవన సముదాయాన్ని కూలదోసి రెండేళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. స్థలంపై అనేక అనుమానాలు షికారు చేస్తున్నాయి.

కూల్చేసి.. వదిలేసి!
శిథిల భవనాలను ఎక్సకవేటర్‌తో కూల్చుతున్న దృశ్యం


పోలీస్‌ క్వార్టర్స్‌ నిర్మాణంపై వెనకడుగు
స్థలంపై అనుమానాలు
అద్దెకొంపల్లో పోలీస్‌ యంత్రాంగం
పక్కా భవనాలు నిర్మించాలని ఏళ్లుగా డిమాండ్‌

రాజాం రూరల్‌, జూలై 27:
రాజాం నగర నడిబొడ్డున కోట్లాది రూపాయలు విలువ చేసే పోలీస్‌ క్వార్టర్స్‌ స్థలం నిరుపయోగంగా మారింది. పాత భవన సముదాయాన్ని కూలదోసి రెండేళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. స్థలంపై అనేక అనుమానాలు షికారు చేస్తున్నాయి. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 1996లో అప్పటి హోం మినిస్టర్‌ ఎలిమినేటి మాధవరెడ్డి ఈ పోలీస్‌ క్వార్టర్స్‌ సముదాయాన్ని ప్రారంభించారు. కాలక్రమంలో భవన సముదాయం శిథిలావస్థకు చేరింది. కొత్త నిర్మాణం చేపట్టేందుకు రెండేళ్ల కిందట భవనాలను పూర్తిగా కూల్చారు. ఎందుకు నేటికీ కొత్త భవనాల నిర్మాణానికి పూనుకోవడం లేదు. చేసేదిలేక ఎస్‌ఐతో పాటు పోలీస్‌ సిబ్బంది అంతా అద్దె కొంపల్లో ఉండాల్సి వస్తోంది. అయితే కోట్లాది రూపాయలు విలువచేసే ఈ స్థలంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థలాన్ని ఓ పారిశ్రామికవేత్తకు అప్పగిస్తారన్న ప్రచారం పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వినిపిస్తోంది. గతంలో ఈ స్థలానికి కొలత వేసే సమయంలో ఆ పారిశ్రామికవేత్త వర్గానికి చెందిన వ్యక్తులు రావడం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది.

 రాజాం పట్టణానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో పోలీస్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి ఉమ్మడి శ్రీకాకుళం ఎస్పీ గతంలో స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీతో పాటు స్థలాన్ని రెవెన్యూ, పోలీస్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు. అయితే కనీస సౌకర్యాలు లేని ఈ ప్రాంతంలో క్వార్టర్స్‌ నిర్మాణానికి పోలీస్‌ యంత్రాంగం వ్యతిరేకించింది. పాత స్థలంలోనే నూతన భవన సముదాయం నిర్మించాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఎటువంటి అడుగూ పడలేదు. విశాలమైన స్థలం మెయిన్‌రోడ్‌లో ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది.

 రాజాం టౌన్‌, రూరల్‌ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు అద్దె ఇళ్లల్లోనే నివశిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉంటున్నారు. పాత భవన సముదాయ ప్రాంతంలోనే క్వార్టర్స్‌ను మళ్లీ నిర్మించాలని ఎక్కువ మంది కోరుతున్నారు.


Updated Date - 2022-07-28T05:02:35+05:30 IST