కన్నీటి కష్టాలు

ABN , First Publish Date - 2022-05-04T06:34:58+05:30 IST

ఓవైపు ఎండలు మండుతున్నాయి.

కన్నీటి కష్టాలు
ఆదోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాలనీలో తాగునీటి ట్యాంకర్‌ వద్ద నీటి కోసం క్యూలో నీటి బిందెలతో కాలనీవాసులు

  1.   కర్నూలు పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి
  2.  ఆదోనిలోనూ అదే దుస్థితి
  3.   ఐదు రోజులకోసారి సరఫరా
  4. శివారు ప్రాంతాల్లో పది రోజులకు..  
  5. ట్యాంకర్‌ వచ్చినా పది బిందెలకే అనుమతి
  6.   సరఫరాలో యంత్రాంగం విఫలం
  7.  అల్లాడిపోతున్న జనం


 ఓవైపు ఎండలు మండుతున్నాయి.  మరోవైపు ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. కర్నూలు జిల్లా కేంద్రం సహా అనేక పట్టణాలు...పల్లెల్లో ఇదే దుస్థితి. పడమర ప్రాంతంలో   పరిస్థితి దారుణంగా ఉంటోంది.  పట్టించుకోవాల్సిన  ప్రజాప్రతినిధులు...అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆదోని, ఆలూరు పట్టణాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.  శివారు ప్రాంతాలకు పది రోజులకోసారి నీరు సరఫరా అవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తోపుడు బండ్లు, సైకిళ్లపై దూరప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు.  వారానికో...పది రోజులకో వచ్చే ట్యాంకర్ల  దగ్గర యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. 

ఆదో ని (అగ్రి కల్చర్‌), మే 3: ఆదోని పట్టణ ప్రజలను తాగునీటి సమస్య వేధిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. బసాపురం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిండుగా నీటితో తొణికిసలాడుతున్నా వార్డులో ప్రజలకు మాత్రం నీరందడం లేదు. పట్టణంలో 41 వార్డులతో పాటు 2.10 లక్షల జనాభా ఉంది. ఏ వార్డులో చూసినా నీటి కష్టాలే కనిపిస్తున్నాయి. ఐదు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  60-70 వేలకు పైగా జనాభా ఉన్న శివారు ప్రాంతాల్లో పది రోజులైనా తాగునీరు అందని పరిస్థితి ఉంది. పైప్‌లైన్లు మరమ్మతులకు గురైనా ఏళ్ల తరబడి పట్టించుకునే నాథుడు లేడు. 

ఆదోని శివారు కాలనీల్లో  ఇలా...

శివారు ప్రాంతాలైన కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కాలనీ, వైఎస్సార్‌ కాలనీ, భీమ్‌రెడ్డినగర్‌, ప్రకాష్‌నగర్‌, కల్లుబావి, విజయనగర్‌ కాలనీ, అమరావతినగర్‌, న్యూగాంధీనగర్‌, క్రాంతినగర్‌, రాయనగర్‌, పైకొట్టాల, కిందికొట్టాల, పర్వతాపురం, దివాకర్‌నగర్‌, అరుణ్‌జ్యోతినగర్‌ తదితర ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. మున్సిపాలిటీ సరఫరా చేసే తాగునీటి ట్యాంక ర్ల కోసం శివారు కాలనీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ట్యాంకర్లు వస్తే ఒక్కో కుటుంబానికి 10 బిందెల నీరు మాత్రమే దొరుకుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లి తోపుడు బండ్లు, సైకిళ్లు, ఆటోలలో నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నామని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


.నిద్ర  మానుకొని..

కోసిగి:   తాగునీటి కోసం కోసిగి మండల పరిధిలోని చాలా గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వందగల్లు గ్రామంలో తాగునీటి కోసం పనులు మానుకుని అర్ధరాత్రి వరకు వేచిచూడాల్సిందే. రాత్రంతా నిద్ర లేకుండా మేల్కొంటేనే నాలుగు బిందెలు నీరు దొరికే పరిస్థితి ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. విద్యుత కోతల కారణంగా తమ గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడిందని సర్పంచ, అధికారులు తెలుపుతున్నారు.  కారణమేదైనా సుమారు మూడు నెలలుగా తాగునీటి కోసం ప్రజలు నిద్రకు దూరమవుతున్నారు. 

 పల్లెల్లో  నీటి కష్టాలు 

ఆలూరు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గంలో గుక్కెడు నీటి కోసం గ్రామీణ ప్రజలు అల్లాడిపోతున్నారు. పది రోజులైనా తాగునీరు సరఫరా కాకపోవడంతోవాటర్‌ క్యానల నీటిని కొని దాహం తీర్చుకుంటున్నారు. మండలానికి బాపురం రిజర్వాయర్‌ నుంచి తాగునీరు సరఫరా కావాల్సి ఉంది. విద్యుత కోతల సాకుతో పది రోజులు గడచినా నీరు అందని పరిస్థితి. దీంతో ఆలూరు పట్టణంతో పాటు కమ్మరచేడు, తుంబలబీడు, మొలగవల్లి, హత్తిబెలగల్‌ గ్రామాలకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.  

ఫ ఆస్పరి మండలంలో  బిల్లేకల్‌, తంగరడోన, డీకోటకొండ, జొహరాపురం గ్రామాల్లో నీటి  సమస్య తీవ్రంగా ఉంది. 

ఫహాలహర్వి మండలం గూళ్యం, సిద్ధాపురం, బల్లూర్‌, చాకిబండ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో జనసేన పార్టీ నాయకులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. 

ఫచిప్పగిరి  మండల కేంద్రంతో పాటు నేమకల్లు, నంచర్ల, నగరడోన, రామదుర్గం గ్రామాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉంది.

ఫహొళగుంద మండల కేంద్రంతో పాటు నెరనికి, కొత్తపేట, ఎల్లార్తి నెరనికితాండా, వన్నూర్‌క్యాంప్‌, పెద్దహ్యాట, చిన్నహ్యాట, బీజీహల్లి గ్రామాల ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

 కర్నూలులోదాహం..దాహం

కర్నూలు, మే 3 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర ప్రజలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బళ్లారి చౌరసాకు కార్పొరేషన ట్యాంకరు వచ్చింది. భగభగ మండే ఎండల్లో సైతం సంపత నగర్‌ కాలనీ జనం బిందెడు నీటి కోసం ట్యాంకరు వద్ద ఎగబడ్డారు. నగరపాలక సంస్థ పరిధిలో 52 వార్డులు ఉన్నాయి. ఆరు లక్షల జనాభా  ఉన్నారు. ప్రతి ఒక్కరికి రోజుకు 135 లీటర్లు తాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా.. 105 లీటర్లు ఇస్తున్నారు. శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తు న్నారు. ఇందుకోసం కార్పొరేషనకు చెందిన ఐదు ట్యాంకర్లు, అద్దెకు మరో ఐదు ట్యాంకర్లు తీసుకున్నారు. ఒక్కో ట్యాంకరు రోజుకు 6-8 ట్రిప్పులు నీరు సరఫరా చేస్తుంది. నగర వాసులకు రోజుకు 88 మిలియన లీటర్లు (ఎంఎల్‌డీ) సరఫరా చేయాల్సి ఉంటే.. 75 ఎంఎల్‌డీ ఇస్తున్నారు. ట్యాంకర్లు ఏ సమయంలో వస్తే ఆ సమయంలో బిందెలతో జనం నీటిని పట్టుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ట్యాంకరు నీరు అయిపోతే మళ్లీ ట్యాంకరు వచ్చే వరకు ఇబ్బందులు తప్పవు. లేదంటే రూ.10 నుంచి రూ.25  చెల్లించి క్యాన నీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రోజు కూలీపై ఆధారపడి జీవించే పేదలు నీటిని కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు.  నగరపాలక సంస్థ పరిధిలోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎలా ఉంటుందో  అర్థం చేసుకోవచ్చు.

మాలపల్లిలో ఇక్కట్లు

మంత్రాలయం:  మంత్రాలయం మండలంలోని మాలపల్లి గ్రామంలో తాగునీటికి కటకట ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాలపల్లి కొట్టాల కాలనీలో నీటి కోసం పాఠశాల దగ్గరలో ఉన్న బోరు దగ్గరికి వెళ్లి పట్టుకోవాల్సిందే. కరెంటు కోతల కారణంగా గంటల తరబడి వేచి ఉంటున్నామని మహిళలు వాపోతున్నారు. దగ్గరలో ఉన్న రెండు నీటి గుమ్ములు నిరూపయోగంగా మారాయి. పక్కనే ఉన్న చేతిబోర్లకు మరమ్మతులు చేసి మోటారు ద్వారా ఈ గుమ్మిలో నీరు నింపేవారు. సర్పంచ, గ్రామ కార్యదర్శి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి పథకాలకు మరమ్మతులు చేయించి దాహం తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.






Read more