Team Thackeray: ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాలు

ABN , First Publish Date - 2022-07-25T20:48:14+05:30 IST

శివసేనపై ఆధిపత్యం ఎవరిదనే అంశంపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా..

Team Thackeray: ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాలు

న్యూఢిల్లీ: శివసేనపై ఆధిపత్యం ఎవరిదనే అంశంపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని ఉద్ధవ్‌ థాకరే శివసేన వర్గం సుప్రీంకోర్టును కోరింది. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిందని, దానిపై ఒక నిర్ణయం తీసుకునేంత వరకూ ఈసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్‌నాథ్ షిండే ఆ వెనువెంటనే తమదే అసలు సిసలైన శివసేన అంటూ క్లెయిమ్ చేశారు.


ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ (ఈసీ) ఇటీవల రెండు వర్గాలకు ఆదేశాలు ఇస్తూ, మహారాష్ట్ర పార్టీకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారనే దానిని రుజువు చేసుకునేందుకు తగిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ (Document evidence) ఆగస్టు 8లోగా తమకు అందజేయాలని అదేశించింది. ఆ తర్వాతే ఈ అంశంపై విచారణ జరుపుతామని చెప్పింది. దీనిని థాకరే శివసేన టీమ్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. థాకరేను గద్దె దింపేందుకు గుజరాత్‌ నుంచి అసోం, గోవా వరకూ గతనెలలో పొలిటకల్ ఆపరేషన్ నిర్వహించిన రెబల్ శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఉందని, దానిపై ఒక స్పష్టత వచ్చేంత వరకూ శివసేన గ్రూప్ ప్రాతినిధ్యంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోకుండా చూడాలని ఆ పిటిషన్‌లో కోరింది. పార్టీ గుర్తు కేటాయించడం, ఎన్నికలు నిర్వహించడం వంటి రాజ్యాంగ బాధ్యతలే ఈసీకి ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది.


కాగా, టీమ్ థాకరేను అనర్హులుగా ప్రకటించాలని షిండే వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఇప్పటికే కోరింది. ట్రస్టు ఓటు, స్పీకర్ ఎన్నికపై ఇచ్చిన విప్‌ను శివసేన రైవల్ గ్రూప్ ధిక్కరించిందని పేర్కొంది. అయితే, టీమ్ థాకరే‌పై అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను ముందుకు వెళ్లవద్దని జూలై 11న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై ఆగస్టు 1న సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Updated Date - 2022-07-25T20:48:14+05:30 IST