Sri Lanka Women vs India Women: తొలి టీ20లో లంకను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన

ABN , First Publish Date - 2022-06-24T00:19:27+05:30 IST

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో జరిగిన తొలి టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత

Sri Lanka Women vs India Women: తొలి టీ20లో లంకను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన

దంబుల్లా: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో నేడు జరిగిన తొలి టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. దంబుల్లాలోని రణగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.


139 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చమరి అటపట్టు సారథ్యంలోని శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో పరుగులు రాబట్టడంలో శ్రీలంక బ్యాటర్లు విఫలమయ్యారు. ఆ జట్టులో కవిష దిల్హరి అజేయంగా చేసిన 47 పరుగులే అత్యధికం. మిగతా వారిలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కెప్టెన్ చమరి 16, హర్షిత మాధవి 10, నీలాక్షి డి సిల్వా 8, అమా కాంచన 11, అనుష్క సంజీవని 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా, దీప్తిశర్మ, పూజా వస్త్రాకర్, షెఫాలీ వర్మ చెరో వికెట్  పడగొట్టారు. 


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 17 పరుగుల వద్దే స్మృతి మంధాన (1), సాభినేని మేఘన (0) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌తో కలిసి  షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఇద్దరూ కలిసి సమయోచితంగా ఆడుతూ పరుగులు పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలో 56 పరుగుల వద్ద 4 ఫోర్లలో 31 పరుగులు చేసిన షెఫాలీ అవుటైంది.


అనంతరం క్రీజులోకి వచ్చిన రోడ్రిగ్స్ బ్యాట్‌తో చెలరేగిపోయింది. 27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్లతో 36 పరుగులు పిండుకుని నాటౌట్‌గా నిలిచింది. హర్మన్ ప్రీత్ 22, రిచా ఘోష్ 11, పూజా వస్త్రాకర్ 14, దీప్తి శర్మ 17 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో రణవీర 3 వికెట్లు తీసుకోగా అమా కాంచన 2, కెప్టెన్ అటపట్టు ఒక వికెట్ తీసుకున్నారు. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


Updated Date - 2022-06-24T00:19:27+05:30 IST