Abn logo
Apr 10 2020 @ 03:01AM

బ్రాండ్‌ మోదీ కాదు, టీమ్‌ఇండియా ముఖ్యం

నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయినప్పుడు తనను తాను ‘టీమ్ ఇండియా’ కెప్టెన్‌గా చెప్పుకున్నారు. అధికారాల కేంద్రీకరణను అరికట్టి ‘సహకార సమాఖ్య పద్ధతి’ని సువ్యవస్థితం చేయాలని ఆయన నొక్కి చెప్పారు. కరోనా మహమ్మారిపై జాతి సమష్టి సమరం సాగించేందుకు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రాకృతిక విపత్తులు, సామాజిక సంక్షోభాల నెదుర్కోవడంలో అనుభవమూ, అవగాహన వున్న సమర్థులతో ‘జాతీయ కార్యాచరణ బృందం’నొకదాన్ని తక్షణమే ఏర్పాటుచేసేందుకు ప్రధానమంత్రి పూనుకోవాలి.


నరేంద్ర మోదీ ఉన్నప్పుడు ప్రజలు మరో నేతకు నీరాజనాలు పడతారా? పట్టరు, పట్టబోరనే ప్రగాఢ విశ్వాసం తోనే భారతీయ జనతా పార్టీ 2019 సార్వత్రక ఎన్నికలలో ఓటర్లపై నేరుగా ‘మోదీకి సాటి రాగల మేటి ఎవరు?’ అనే ప్రశ్నాస్త్రాన్ని సంధించింది. అలా నాయకత్వ అంశానికి అమిత ప్రాధాన్యాన్ని సంతరింపచేయడం ద్వారా ఆ ప్రజాస్వామ్య పోరా టాన్ని ఇంచుమించు అధ్యక్ష తరహా ఎన్నికల పోరాటంగా బీజేపీ మార్చి వేసింది. ఐక్యత నామ మాత్రంగాకూడా లేని ప్రతిపక్షాలు ‘మహాబలుడు’ మోదీని సమర్థంగా ఎలా ఎదుర్కోగలుగుతాయి? బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. మోదీ రెండో ప్రభుత్వం పెనుమార్పులకు ఉపక్రమించింది. ఇంతలోనే కొవిడ్-19 సంక్షోభం ముంచుకొచ్చింది. 29 రాష్ట్రాల ముఖ్య మంత్రులు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మొక్కవోని దీక్షతో కరోనా వైరస్ పై మహా పోరాటం చేస్తున్నారు. భవిష్యత్తులో నాయకత్వ ప్రత్యామ్నాయాల సంగ్రహావలోకానికి కరోనా కల్లోలం ఎంతైనా పురిగొల్పుతోంది.


స్వతంత్ర భారత దేశ చరిత్రలో కొవిడ్ -19 సంక్షోభం లాంటి విషమ పరిస్థితి ఇంతకుముందెన్నడూ నెలకొనలేదు. ఒకటి రెండు రాష్ట్రాలలోగాక ఆసేతు హిమా చలం ఈ ఆత్యయిక స్థితి ఏర్పడ్డది. కరోనాపై ఈ మహా సమరంలో అగ్రగామిగా పరిగణన పొందేందుకు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. గతంలో రాష్ట్రాలు వేర్వేరుగా వరదలు, కరువులు, సునామీ లాంటి ప్రాకృతిక విపత్తులు, సామాజిక దుర్ఘటనల బారిన పడ్డాయి. వాటినవి చాలవరకు సొంతంగా ఎదుర్కొని కష్టాలను అధిగమించాయి. అయితే యావద్భారత రాష్ట్రాల సంయుక్త సంకల్పం ఒక మహా విషమ పరీక్షకు గురికావడం ఇదే మొదటిసారి. ఒక విధంగా నిజమైన అధికారాలు, బాధ్యతలు ఢిల్లీలో కాక, రాష్ట్ర రాజధానులలో వున్నాయనే విషయాన్ని ఈ దేశ పాలకులకు, ప్రజలకు కరోనా సంక్షోభం తిరుగులేని విధంగా గుర్తు చేసింది. ‘ఢిల్లీ రాజే’ కాకుండా ఎంతో విభిన్న నాయకులు ఈ దేశంలో వున్నారని, విలక్షణ నాయకత్వ శైలులు వర్థిల్లుతున్నాయనే సత్యాన్ని మోదీ కేంద్రిత రాజకీయ విశ్వం ఎట్టకేలకు గుర్తించి, అంగీకరించడం అనివార్యమయింది.


ఆ సత్యానికి ఒక తార్కాణం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధావ్ ఠాక్రే. కీర్తి శేషుడైన తండ్రి బాల్ ఠాక్రే ‘ఛరిష్మా’ (జన సమ్మోహన శక్తి) ఏమాత్రం లేక పోవడంతో పాటు ఎలాంటి పాలనానుభవం కూడాలేని ఉద్ధావ్ ఒక ‘యాదృచ్ఛిక’ ముఖ్యమంత్రి మాత్రమేనన్న భావన ప్రజలలో విస్తృతంగా వున్నది. గత నవంబర్‌లో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఉద్ధావ్ తొమ్మిది నెలలైనా గడవక ముందే కరోనా వైరస్‌పై మహారాష్ట్ర పోరాటానికి ఒక ‘ప్రతీక’గా భాసిల్లుతున్నారు. మరాఠీ న్యూస్ టెలివిజన్‌లో ఉద్ధావ్ ప్రతిరోజూ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కరోనాపై యుద్ధాన్ని నిర్దేశిస్తున్నారు. ఆయన రోజువారీ ప్రసంగాలు మహారాష్ట్ర ప్రజలకు ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయనడం సత్య దూరం కాదు. వైరస్ వ్యాప్తిని నిర్దిష్ట కుల మతాలకు అంటగంటే ప్రయత్నాలను ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అటువంటి కుత్సిత ప్రయత్నాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని ఉద్ధావ్ హెచ్చరిస్తున్నారు. కరోనాపై ఉద్ధావ్ సాగిస్తున్న పోరు ఆయన నేతృత్వంలో శివసేన, తన మౌలిక వైఖరుల నుంచి ఎంత దూరం ప్రయాణించిందో స్పష్టం చేసింది. మార్చి తొలినాళ్ళలో ముంబైలో తబ్లీఘ్ జమాత్ మత సమ్మేళనానికి మహారాష్ట్ర పోలీసులు అనుమతినివ్వడానికి ససేమిరా అన్నారన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. ముంబై పోలీసులకు భిన్నంగా ఢిల్లీ పోలీసులు తమ విధ్యుక్తధర్మ నిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించడం ఎటువంటి ఉత్పాతానికి దారి తీసిందో మరి చెప్పనవసరం లేదు. 


కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ఆ సత్యానికి ఒక నిండు తార్కాణమే. దేశంలో వామపక్షాలు అధికారంలో వున్న ఏకైక రాష్ట్రం కేరళ. విజయన్ ఇంతవరకు కేరళకే పరిమితమైన ఒక స్థానిక రాజకీయనాయకుడుగా మాత్రమే సుపరిచితుడు. కరోనా సంక్షోభం ఆయన ఒక విభిన్న, విలక్షణ నాయకుడు అనే విషయాన్ని దేశానికి చాటిచెప్పింది. కరోనా బాధితులైన పేదలకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం గానివ్వండి, వైరస్ బాధితులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాల నేర్పాటు చేయడం గానివ్వండి, మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌ను అమలుపరచడంలో గానివ్వండి కేరళ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. ప్రజారోగ్య వ్యవస్థకు అత్యధిక స్థాయిలో నిధులు కేటాయించే సంప్రదాయం కేరళకు మొదటి నుంచీ వున్నది. ఇది, నిస్సందేహంగా ఒక సానుకూల అంశమే అయినప్పటికీ కరోనాపై పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్ళడంలో విజయన్ పాత్ర విస్మరించలేనిది. 


కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో పలు రాజకీయ పార్టీల నేతృత్వంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సమర్థంగా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు పంజాబ్‌లో వలసకూలీలు పంటకోతల తరుణం ముగిసేవరకు వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉండిపోయేందుకు ప్రోద్భలంగా వారికి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని సమకూర్చడానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెనుకాడలేదు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దినసరి కూలీలకు, సన్నకారు రైతులకు ఆదాయ భరోసా కల్పించారు. ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కరోనా రోగుల చికిత్సకు శీఘ్రగతిన ఒక అధునాతన ఆస్పత్రిని నిర్మించారు. ఛత్తీస్ గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేస్ బాఘెల్ ప్రతి ఒక్కరికీ నిత్యావసర సరుకులను అదనంగా సరఫరా చేసేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం భిల్వారా నగరంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అనుసరించిన పద్ధతులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం విస్తృతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పత్రులకు నాణ్యమైన వైద్య పరికరాలను సమకూర్చింది. అసోంలో సోనోవాల్ ప్రభుత్వం కరోనా నెదుర్కొనేందుకు తన వైద్య పరమైన సంసిద్ధతను ప్రశస్తంగా మెరుగుపరచుకున్నది. బెంగాల్‌లో మమతా బెనర్జీ ‘సఫల్ బంగ్లా’ పథకం కూరగాయల ధరలను అదుపులో ఉంచింది. 


కరోనా యుగంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు ఒక కొత్త రూపునివ్వాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఒక కొత్త పద్ధతిలో ఆ సంబంధాలను పునర్నిర్మించుకోవడం చాలా ముఖ్యం. ‘ఢిల్లీ పాలకులకు అన్ని తెలుసు’ అనే మనస్తత్వం ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థలోను విస్తృతంగా వుండేది. దీనివల్ల విధాన నిర్ణయాలుతీసుకునే అధికారాలన్నీ కేంద్రీకృతమైపోయాయి. మోదీ పాలనలో పెద్ద నోట్ల రద్దు, అధికరణ 370 రద్దు మొదలైన ప్రధాన నిర్ణయాలు అన్నిటినీ కనీస సంప్రదింపులతో మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎంతో విస్తృత చర్చ అవసరమైన ఆ నిర్ణయాలను దాదాపు ఏకపక్షంగా తీసుకోవడం వల్లే ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలలో గరిష్ఠ విధ్వంసానికి దారితీశాయి. విధాన నిర్ణయాలలో ‘ఆదేశించి, నియంత్రించే’ ధోరణి ప్రత్యామ్నాయ అభిప్రాయాలను సహించదని మరి చెప్పనవసరంలేదు. కరోనా వైరస్‌పై యుద్ధం లాంటి పరిస్థితులలో ఇటువంటి వ్యవహార శైలిలో మౌలిక మార్పులు చోటుచేసుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి స్వస్తిచెప్పి, సంబంధిత వ్యక్తులు, సంస్థలు విధాన నిర్ణయాలలో భాగస్వాములను చేయవలసివుంది మరింత స్పష్టంగా చెప్పాలంటే విధాన నిర్ణయాలను వైయక్తికంగా కాకుండా విస్తృత సమాలోచనలతో సమష్టిగా తీసుకోవాలి. కరోనాపై పోరులో దేశవ్యాప్తంగా అమలులో వుండేలా ఒకే నిబంధనావళిని రూపొందించుకోవల్సిన అవసరమున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత వైద్య పరిశోధనా మండలి, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలసికట్టుగా కృషి చేసేం దుకు జాతీయ నిబంధనావళి ఎంతైనా అవసరం. ప్రైవేట్ ల్యాబ్స్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణకు అనుమతినివ్వడం లేదా డాక్టర్లు, నర్సులకు వ్యక్తిగత పరిరక్షణ సామగ్రి సత్వర సరఫరా మొదలైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో అనవసర జాప్యం జరుగుతుందని పలు రాష్ట్ర ప్రభుత్వాలు వాపోతున్నాయి. కరోనాపై పోరులో శీఘ్ర నిర్ణయాలు తీసుకోవలసివున్నవేళ ఇటువంటి జాప్యం మేలు చేస్తుందా?


ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తీసుకోవల్సివుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన తరచు రాష్ట్ర స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని విమర్శిస్తుండేవారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసే విషయమై చర్చించేందుకు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ తొలిసారి మార్చి 20న మాత్రమే సమావేశమయ్యారు. అప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 200కి మించిపోయింది. ఐదు రోజుల అనంతరం కేవలం నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు పరచనున్న విషయాన్ని ప్రజలకు మోదీ తెలియజేశారు. అయితే ముఖ్య మంత్రులకు ఈ విషయాన్ని ఆయన ముందస్తుగా తెలియజేయలేదు. ‘తొమ్మిది నిమిషాలపాటు విద్యుత్ దీపాలు ఆర్పివేసి దివ్వెలు వెలిగించాలనే’ కార్యక్రమానికి పిలుపునిచ్చే ముందు కూడా ముఖ్యమంత్రులనుగానీ, రాష్ట్ర విద్యుత్ మంత్రులను గానీ ప్రధాని మోదీ విశ్వాసంలోకి తీసుకోలేదు. కరోనా బాధిత వర్గాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించే విషయంలో కూడా రాష్ట్రాల ఆర్థిక మంత్రులను ప్రధాని మోదీ సంప్రదించనేలేదు ఇటీవల మాత్రమే ఆయన కరోనా సమస్యపై ప్రతిపక్ష నేతలతో చర్చలు జరపడం ప్రారంభించారు. నిజానికి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే నెల రోజుల క్రితమే ఆయన ఈ చర్చలు, సంప్రదింపులను ప్రారంభించివుంటే బావుండేది. 


మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయినప్పుడు తననుతాను ‘టీమ్ ఇండియా’ కెప్టెన్‌గా చెప్పుకున్నారు. కేంద్రీకృత అధికార వ్యవస్థ స్థానంలో ‘సహకార సమాఖ్య పద్ధతి’ని సువ్యవస్థితం చేయాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు. తన ఈ స్ఫూర్తిదాయక మాటలను కార్యాచరణ లోకి తీసుకురావాల్సిన సమయమాసన్నమయింది. కరోనాపై సమష్టి సమరం సాగించేందుకు ముఖ్యమం త్రులు, ప్రతిపక్ష నాయకులు; ప్రాకృతిక విపత్తులు, సామాజిక సంక్షోభాల నెదుర్కోవడంలో అనుభవమూ, అవగాహన వున్న సమర్థులతో ఒక ‘జాతీయ కార్యాచరణ బృందం’ (నేషనల్ టాస్క్ ఫోర్స్)ను తక్షణమే నేర్పాటుచేసేందుకు ప్రధాని మోదీ పూనుకోవాలి. ఈ మహాయుద్ధానికి ‘జనరల్’ మోదీ నేతృత్వం వహించాలి. అయితే ప్రతి ‘బ్రిగేడ్’ కమాండర్ సమర సామర్థ్యాన్ని గుర్తించి, గౌరవించాలి. కరోనాపై యుద్ధంలో ‘టీమ్ ఇండియా’దే ప్రధాన పాత్ర కావాలి; ‘బ్రాండ్ మోదీ’ గౌణ పాత్ర వహించాలి.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Advertisement
Advertisement
Advertisement