MS Dhoni: మారుమూల గ్రామంలో.. రూ.40తో నాటువైద్యం.. అసలు మహీకి ఏమైంది..?

ABN , First Publish Date - 2022-07-02T17:48:22+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

MS Dhoni: మారుమూల గ్రామంలో.. రూ.40తో నాటువైద్యం.. అసలు మహీకి ఏమైంది..?

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది కూడా నాటు వైద్యానికి సంబంధించింది కావడం గమనార్హం. అందులోనూ జార్ఖండ్ రాజధాని నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామానికి వెళ్లి మరీ ఆయన చికిత్స తీసుకోవడం, దానికి కేవలం రూ.40 చెల్లిస్తున్నట్లు వార్త బయటకు రావడంతో అది మరింత సెన్సెషన్‌గా మారింది. శ్రీమంతుడైన ధోనీ ఇలా రూ.40తో నాటు వైద్యం చేయించుకోవడం ఏంటి? అసలు ధోనీకి ఏమైందంటూ ఆయన అభిమానులు ఆరా తీస్తున్నారు. 


రూ.40లకే ఈ చికిత్స.. 

కొంతకాలంగా ఈ జార్ఖండ్ డైనమైట్ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం. దాంతో చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్న ధోనీకి.. రాంచీకి సుమారు 70కిలోమీటర్ల దూరంలో ఉండే మారుమూల గ్రామం లాపంగ్​లో ఉన్న నాటు వైద్యుడు భందన్​ సింగ్​ ఖర్వార్​ గురించి తెలిసింది. ఆయనకు స్థానికంగా మంచి పేరు ఉండడంతో మహీ ఆయన దగ్గరకు వెళ్లాలని నిర్ణయించకున్నారు. దీనిలో భాగంగానే కొన్ని రోజులుగా దశల వారిగా భందన్ సింగ్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడట. వెళ్లిన ప్రతిసారి చికిత్స కోసం కేవలం రూ. 40 మాత్రమే చెల్లిస్తున్నాడు. గతంలో ధోని తల్లిదండ్రులకు కూడా మోకాళ్ల నొప్పులు వచ్చిన సమయంలో వారు కూడా ఈ నాటు వైద్యుడి దగ్గరే చికిత్స తీసుకున్నారు. వారికి నయం కావడంతో ధోని కూడా అదే ఆయన వద్దే నాటు వైద్యం చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా చికిత్స కోసం వెళ్లిన సమయంలో ఆ ఊరి వాళ్లతో ఫొటోలు కూడా దిగారు. అవి కాస్తా బయటకు రావడంతో వైరల్‌గా మారాయి. 


ధోనీకి చికిత్స అందిస్తున్న వైద్యుడు ఏమన్నాడంటే..

"ధోనీ ఓ సాధరణమైన వ్యక్తిలా ఇక్కడికి వచ్చాడు. గొప్ప ఆటగాడు అయినప్పటికీ అతడిలో ఎటువంటి గర్వం లేదు. నాలుగు రోజులకు ఓ సారి వచ్చి చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయం కాస్తా అభిమానులకు తెలియడంతో వారు భారీగా ఇక్కడికి వస్తున్నారు. దీంతో అతడు కారులోనే కూర్చుని మందు తీసుకుని వెళ్లిపోతున్నాడు." అని డాక్టర్​ భందన్​ సింగ్​ చెప్పుకొచ్చారు. ఇక ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతూ తన అభిమానులను అలరిస్తున్నాడు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్​-2022లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్​ కింగ్స్ పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. సీజన్​ ఆరంభంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించిన సీఎస్​కేకు వరుస పరాజయాలు పలకరించాయి. దాంతో మళ్లీ ధోనీకే సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో సీజన్​ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. 




Updated Date - 2022-07-02T17:48:22+05:30 IST