పట్టు చిక్కినట్టే!

ABN , First Publish Date - 2022-07-04T10:07:19+05:30 IST

తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన చటేశ్వర్‌ పుజార.. తనదైన మార్క్‌ అర్ధ శతకంతో ఆదుకోవడంతో ఇంగ్లండ్‌తో 5వ టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది.

పట్టు చిక్కినట్టే!

 టీమిండియా ఆధిక్యం 257

భారత్‌ 125/3

పుజార అజేయ  అర్ధ శతకం 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 284 ఆలౌట్‌

బెయిర్‌స్టో సెంచరీ 

ఐదో టెస్ట్‌

ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌ రెండో రోజు ఆటలో పైచేయి సాధించిన భారత్‌.. మూడో రోజూ ఆధిపత్యాన్ని చెలాయించింది. తొలి సెషన్‌లో బెయిర్‌స్టో దూకుడుతో వెనుకబడినా.. రెండో సెషన్‌లో సిరాజ్‌ టపటపా వికెట్లు పడగొట్టడంతో కీలక ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పుజార ఓపికతో కూడిన ఇన్నింగ్స్‌కు పంత్‌ జోరు తోడవడంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా సాగుతోంది. బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవుతున్న నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌ కత్తిమీద సామే!


బర్మింగ్‌హామ్‌: తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన చటేశ్వర్‌ పుజార.. తనదైన మార్క్‌ అర్ధ శతకంతో ఆదుకోవడంతో ఇంగ్లండ్‌తో 5వ టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. 132 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో.. ఆటకు మూడో రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన టీమిండియా ఆట ముగిసేసరికి 125/3 స్కోరు  చేసింది. పుజార (50 బ్యాటింగ్‌), రిషభ్‌ పంత్‌ (30 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కోహ్లీ (20), హనుమ విహారి (11), శుభ్‌మన్‌ గిల్‌ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. మొత్తంగా 257 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచే దిశగా సాగుతోంది.


అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 84/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొసాగించిన ఇంగ్లండ్‌ 284 పరుగులకు ఆలౌటైంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 106) శతకంతోపాటు.. స్టోక్స్‌ (25), బిల్లింగ్స్‌ (36)తో కలసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. సిరాజ్‌ 4, బుమ్రా 3, షమి 2 వికెట్లు పడగొట్టారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. 


కోహ్లీ విఫలం:

వందకుపైగా పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ గిల్‌ వికెట్‌ను చేజార్చుకోగా.. టీ తర్వాత విహారిని కోల్పోయింది. మరో ఓపెనర్‌ పుజారతో కలసి మూడో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. మరోసారి నిరాశపరిచాడు. డిఫెన్స్‌ ఆడే క్రమంలో కోహ్లీ అవుటయ్యాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో విరాట్‌ గ్లౌజ్‌లను తాకిన బంతిని కీపర్‌ బిల్లింగ్స్‌ సరిగ్గా అందుకోలేక పోయినా.. రీబౌండ్‌ అయిన బంతిని ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న రూట్‌ ఒడిసిపట్టడంతో భారత్‌ 75/3తో నిలిచింది.


ఆ దశలో పంత్‌ క్రీజులోకి రావడంతో స్కోరు వేగం పెరిగింది. పుజారతో కలసి సంయమనంతో ఆడిన రిషభ్‌.. నాలుగో వికెట్‌కు అభేద్యంగా 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా, రూట్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో పుజార అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా వీరిద్దరూ మరో వికెట్‌ ఇవ్వకుండా రోజును ముగించారు. 


ఆదుకొన్న బెయిర్‌స్టో

ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ బెయిర్‌స్టో బ్యాట్‌ ఝుళిపించడంతో.. తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది. షాట్లు ఆడడానికి ప్రయత్నించి విఫలమవుతున్న బెయిర్‌స్టోను కోహ్లీ మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి అతడు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. కెప్టెన్‌ స్టోక్స్‌ నుంచి సహకారం అందడంతో.. బౌండ్రీలతోనే విరుచుకుపడిన జానీ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.


మరోవైపు శార్దూల్‌ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకొన్న స్టోక్స్‌.. తర్వాతి బంతికి బుమ్రా డైవ్‌ చేస్తూ అందుకొన్న అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. దీంతో ఆరో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కీలక వికెట్‌ కోల్పోయినా బిల్లింగ్స్‌ సహకారంతో.. బెయిర్‌స్టో స్కోరును డబుల్‌ సెంచరీ మార్క్‌కు చేర్చాడు. ఈ దశలో చిన్నపాటి వర్షం కురవడంతో.. ఇంగ్లండ్‌ 200/6తో ముందుగానే లంచ్‌కు వెళ్లింది.


తోక తెంచిన సిరాజ్‌:

రెండో సెషన్‌లో డేంజర్‌మెన్‌ బెయిన్‌స్టోను షమి పెవిలియన్‌ చేర్చగా.. సిరాజ్‌ టెయిలెండర్ల పనిబట్టాడు. రెండు ఫోర్లు బాదిన బెయిర్‌స్టో.. కెరీర్‌లో 11వ శతకంతో సంబరాలు చేసుకున్నాడు. అయితే, జోరు మీదున్న జానీని షమి క్యాచవుట్‌ చేయడంతో.. ఇంగ్లండ్‌ పోరాటం ముగిసింది. బిల్లింగ్స్‌తో కలసి బెయిర్‌స్టో ఏడో వికెట్‌కు 92 పరుగులు జోడించాడు. బ్రాడ్‌ (1), బిల్లింగ్స్‌, పాట్స్‌ (19)ను అవుట్‌ చేసిన సిరాజ్‌.. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. 


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:

416;  ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లీస్‌ (బి) బుమ్రా 6, క్రాలే (సి) గిల్‌ (బి) బుమ్రా 9, పోప్‌ (సి) శ్రేయాస్‌ (బి) బుమ్రా 10, రూట్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 31, బెయిర్‌స్టో (సి) కోహ్లీ (బి) షమి 106, లీచ్‌ (సి) పంత్‌ (బి) షమి 0, బెన్‌ స్టోక్స్‌ (సి) బుమ్రా (బి) శార్దూల్‌ 25, బిల్లింగ్స్‌ (బి) సిరాజ్‌ 36, బ్రాడ్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 1, పాట్స్‌ (సి) శ్రేయాస్‌ (బి) సిరాజ్‌ 19, అండర్సన్‌ (నాటౌట్‌) 6, ఎక్స్‌ట్రాలు: 35; మొత్తం: 61.3 ఓవర్లలో 284 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-16, 2-27, 3-44, 4-78, 5-83, 6-149, 7-241 8-248 9-267, 10-284; బౌలింగ్‌: బుమ్రా 19-3-68-3, షమి 22-4-78-2, సిరాజ్‌ 11.3-2-66-4, శార్దూల్‌ 7-0-48-1, జడేజా 2-0-3-0.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌:

గిల్‌ (సి) క్రాలే (బి) అండర్సన్‌ 4, పుజార (బ్యాటింగ్‌) 50, విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్‌ 11, విరాట్‌ కోహ్లీ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 20, రిషభ్‌ పంత్‌ (బ్యాటింగ్‌) 30, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 45 ఓవర్లలో 125/3; వికెట్లపతనం: 1-4, 2-43, 3-75; బౌలింగ్‌: అండర్సన్‌ 14-5-26-1, బ్రాడ్‌ 12-1-38-1, మాథ్యూ పాట్స్‌ 8-2-20-0, లీచ్‌ 1-0-5-0, స్టోక్స్‌ 7-0-22-1, రూట్‌ 3-1-7-0.

Updated Date - 2022-07-04T10:07:19+05:30 IST