టేకు చెట్ల నరివేతపై ఆరా

ABN , First Publish Date - 2022-05-29T06:05:09+05:30 IST

దబ్బకోట టేకు ప్లాంటేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేసిన టేకు చెట్లను నర్సీపట్నం డీఎఫ్‌వో సీహెచ్‌ సూర్యనారాయణ పడాల్‌ శనివారం పరిశీలించారు.

టేకు చెట్ల నరివేతపై ఆరా
నరికి వేసిన టేకు చెట్లను పరిశీలిస్తున్న నర్సీపట్నం డీఎఫ్‌వో సూర్యనారాయణ పడాల్‌

- ప్లాంటేషన్‌ను పరిశీలించిన డీఎఫ్‌వో

- బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి


సీలేరు, మే 28: దబ్బకోట టేకు ప్లాంటేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేసిన టేకు చెట్లను నర్సీపట్నం డీఎఫ్‌వో సీహెచ్‌ సూర్యనారాయణ పడాల్‌ శనివారం పరిశీలించారు. జీకేవీధి మండలం సీలేరు రేంజ్‌ పరిధిలోని ధారకొండ సెక్షన్‌కు చెందిన దబ్బకోట టేకు ప్లాంటేషన్‌లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 100 టేకు చెట్లను నరికి వేశారని సీలేరు రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలించారు. టేకు చెట్ల నరివేతకు గల కారణాలపై సీలేరు రేంజ్‌ సిబ్బందిని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దబ్బకోట టేకు ప్లాంటేషన్‌ 1984 లో వేశామని, ఈ టేకు ప్లాంటేషన్‌ను పరిశీలించగా 100 చెట్లు నరికివేసినట్టు గుర్తించామన్నారు. దీనిపై సీసీఎఫ్‌కు నివేదిక అందిస్తామన్నారు. సీసీఎఫ్‌ నుంచి అనుమతులు రాగానే నరికివేతకు గురైన చెట్లను సైజులుగా కోయించి సీలేరు కలప డిపోకు తరలించి వేలం పాటకు సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ సంఘటనకు పాల్పడిన వారి కోసం తమ సిబ్బంది విచారణ కొనసాగిస్తున్నారని, ప్రస్తుతానికి తమకు ఉన్న సమాచారం మేరకు కొంత మంది అనుమానితులపై సీలేరు ఎస్‌ఐ రవికుమార్‌కు  ఫిర్యాదు చేశామన్నారు. దబ్బకోట టేకు ప్లాంటేషన్‌లో చెట్లు ఆశించిన స్థాయిలో ఎదగలేదన్నారు. 2022- 23 సంవత్సరంలో కూడా ఇక్కడ ప్లాంటేషన్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అయితే ఈ పరిసర ప్రాంతాల గిరిజనులు ఈ ప్రాంతాన్ని ఆర్వోఎఫ్‌ పట్టాల కోసం గతంలో దరఖాస్తులు చేసుకున్నారని, ఇది ప్లాంటేషన్‌ కావడంతో నిరాకరించామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్లాంటేషన్‌ పరిసర ప్రాంతాల గిరిజనులు ఈ చర్యలకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. వంద టేకు చెట్లను నరికివేయడం వల్ల సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని డీఎఫ్‌వో వెల్లడించారు.

Updated Date - 2022-05-29T06:05:09+05:30 IST