బడుల్లో బోధన!

ABN , First Publish Date - 2022-06-27T05:53:33+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సర్కారు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

బడుల్లో బోధన!
బుధవారం బోధన కార్యక్రమం పోస్టర్‌

వినూత్న కార్యక్రమానికి సర్కారు శ్రీకారం

ప్రతీ బుధవారం బోధన..పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

ఈ నెల 29న మెదక్‌లో ప్రారంభించనున్న కలెక్టర్‌ హరీశ్‌


మెదక్‌అర్బన్‌, జూన్‌ 26: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సర్కారు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రతి బుధవారం పాఠశాలల్లో బోధన పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నది. ఈనెల 29న బుధవారం మెదక్‌ జిల్లాలో కలెక్టర్‌ హరీశ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అం దించడంతో పాటు పఠనంలో దోషాలు నివారించడం ముఖ్య ఉద్దేశం.


పర్యవేక్షణకు అధికారులు

బోధన కార్యక్రమాన్ని కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, డీఈవో, ఎంఈవోలు, ఎంపీడీవోలు, సెక్టోరియల్‌ అధికారులు, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు, జిల్లా, మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తారు. విద్యార్థులు బిగ్గరగా చదివే అభ్యసాన్ని ప్రోత్సహిస్తారు. పఠనం, సంఖ్యా గణనలో పురోగతి వయస్సుకు తగిన గణిత శాస్త్ర కార్యకలాపాలను చేయడంతో విద్యార్థుల పురోగతిని పరిశీలిస్తారు.


ప్రతీ బుధవారం ‘బోధన’లో ఇలా

బుధవారం బోధనలో భాగంగా ఆ రోజు పాఠశాల్లో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలి. అక్షరదోషాలు లేకుండా రాయించడం, భాషదోషాలు లేకుండా గణితంలో పురోగతి సాధించే విధంగా చర్యలు చేపట్టాలి. కిచెన్‌గార్డెన్‌లో భాగంగా విద్యార్ధులు పాఠశాల ఆవరణలో కూరగాయ మొక్కలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తారు. 


చదువులో విద్యార్థులు పురోగతి సాధిస్తారు

- రమే్‌షకుమార్‌, డీఈవో మెదక్‌

జిల్లాలోని ప్రభుత్వపాఠశాలల్లో ప్రతి బుధవారం బోధన కార్యక్రమం అమలు చేయనున్నాం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెరుగుతుంది. బిగ్గరగా చదవడం ద్వారా దోషాలు తెలుస్తాయి. చదువులో విద్యార్థులు పురోగతి సాధిస్తారు.


నేడు విద్యార్థులకు, సైన్స్‌ ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్‌

 రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు, సైన్స్‌ ఉపాధ్యాయులకు సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు డీఈవో రమే్‌షకుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌స్పెయిర్‌ మనక్‌ జాతీయ స్థాయి విజేతలు, ఇస్రో యువికలో పాల్గొన్న యువ శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు. సమాచారం కోసం జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి 8328599157 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2022-06-27T05:53:33+05:30 IST