Abn logo
Sep 26 2021 @ 00:40AM

బోధన, అభ్యసన ఆసక్తిదాయకంగా సాగాలి

వర్చువల్‌ విధానంలో మాట్లాడుతున్న వీసీ ప్రసాదరెడ్డి

ఎఫ్‌డీపీ ముగింపు సమావేశంలో ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి

ఏయూ క్యాంపస్‌, సెప్టెంబరు 25: విద్యార్థులకు బోధన, అభ్యసన విధానాలు ఆసక్తిదాయంగా సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు. ఏయూ ఫార్మశీ కళాశాలలో  శనివారం ఏఐసీటీఈ అటల్‌ పథకంలో భాగంగా ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌-రివల్యూషనరీ ఇంపాక్ట్‌ ఆన్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇండస్ర్టీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌డీపీ) ముగింపు సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వర్చువల్‌ విధానంలో పాల్గొన్న వీసీ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల శ్రద్ధ, సంరక్షణ బాధ్యతలను అధ్యాపకులు తీసుకోవాలన్నారు. విద్యార్థుల వికాసానికి మార్గం చూపే విధంగా అధ్యాపకుల బోధన సాగాలని సూచించారు. విద్యతో పాటు వ్యక్తిత్వం ఎంతో ప్రధానమన్నారు. ఏయూలో ఐవోటీ, మెషిన్‌ లెర్నింగ్‌పై సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ను నాస్‌కామ్‌ సహకారంతో ఏర్పాటు చేశామని, ఇప్పటికే ఇది తమ సేవలను ఆరంభించడానికి సిద్ధమైందని ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేంద్రప్రసాద్‌, సదస్సు కన్వీనర్‌ కృష్ణమంజరి పవర్‌, తదితరులు పాల్గొన్నారు.