ఆంగ్లంపై పట్టు కోసం ఉపాధ్యాయుల కుస్తీ

ABN , First Publish Date - 2022-05-09T05:07:19+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు సర్కారు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నది.

ఆంగ్లంపై పట్టు కోసం ఉపాధ్యాయుల కుస్తీ
శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు

ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ఆంగ్ల బోధన

అజీమ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీ వారితో ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో శిక్షణ 


కొండపాక, మే 8: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు సర్కారు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నది. మన ఊరు-మన బడితో ప్రభుత్వపాఠశాలలకు మహర్ధశ రానున్నది.  ఈ విద్యాసంవత్సరం నుంచి బడులను పటిష్టం చేయడం కోసం  కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల బోధనను అమలు చేయనున్నది. కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దడంతో పాటు గుణాత్మక విద్యను అందించే చర్యలను తీసుకుంటుంది. పాఠశాలల్లో ఆంగ్ల బోధన కోసం ఉపాధ్యాయులు ఇంగ్లీష్‌ మీద పట్టుసాధించడానికి వారికి ప్రభుత్వం శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. 

సిద్దిపేట జిల్లాలో సుమారు 3వేలకు పైగా ఉపాధ్యాయులు ఇంగ్లీ్‌షపై శిక్షణ పొందుతున్నారు. అజీమ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీ సహకారంతో ప్రభుత్వం ఉపాధ్యాయులకు మార్చి నుంచి శిక్షణ అందిస్తున్నారు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. వేసవిసెలవుల్లో ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ కొనసాగుతుంది. విద్యార్థులకు సరైన బోధన చేయాలనే తపనతో ఉపాధ్యాయులు ఆంగ్లంపై మరింత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం కృషి చేస్తున్నారు. ప్రభుత్వం అందించే శిక్షణతో పాటు ఆయా ఉపాధ్యాయ సంఘాలు కూడా టీచర్లకు శిక్షణ ఇస్తున్నాయి. ప్రస్తుతం సిద్దిపేటలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా శిబి రం కొనసాగుతున్నది. ప్రభుత్వం నిర్వహించే శిక్షణతరగతులపై నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై తగు చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి 

- రాకేష్‌, సిద్దిపేట, మెంటర్‌ (బోధకుడు)

ఉపాధ్యాయుడు నిత్యవిద్యార్థి. కాలానుగుణంగా మారుతూ విద్యార్థులకు గుణాత్మకమైన బోధన అందించడం కోసం పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అజీమ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీ సహకారంతో ఉపాధ్యాయులకు శిక్షణను అందిస్తున్నాము.


కార్పొరేట్‌కు దీటుగా తయారవుతాయి

- కత్తుల బాపురెడ్డి , పీఆర్‌టీయూ సిద్దిపేట అర్బన్‌ మండలం అధ్యక్షుడు 

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా  ఉన్నత చదువులు చదివిన వారే. మరింత పరిజ్ఞానం కోసం ప్రభుత్వం అందించే శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కార్పోరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతాయి. ఈ నేపథ్యంలో  పీఆర్‌టీయూ ఆధ్వర్యంలోవేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు ఉచిత శిక్షణ అందిస్తున్నాము.


Read more