ఆన్‌లైన్‌ అడకత్తెరలో టీచర్లు

ABN , First Publish Date - 2020-09-05T06:17:30+05:30 IST

‘‘నాలుగు గోడల మధ్య పౌరసమాజాన్ని తీర్చిదిద్దే రూపశిల్పి గురువు’’ – ఇవి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మాటలు.

ఆన్‌లైన్‌ అడకత్తెరలో టీచర్లు

‘‘నాలుగు గోడల మధ్య పౌరసమాజాన్ని తీర్చిదిద్దే రూపశిల్పి గురువు’’ – ఇవి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మాటలు. ఆ మహనీయుడి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో ప్రస్తుత పరిస్థితికి కూడా వర్తించే ఆ మాటల్ని తప్పక మననం చేసుకోవాలి. కొవిడ్‌ సృష్టిస్తున్న విలయానికి పౌరసమాజమే స్తంభించిపోయిన సందర్భంలో విద్యారంగం--–అభ్యసనం-– టీచర్ల బోధన అనివార్యంగా తరగతి గది నుంచి అరచేతిలోకి మారిపోయాయి. అన్‌లాక్‌-–4లో సెప్టెంబర్‌ 20 తర్వాత యాభై శాతం టీచర్లతో విద్యాసంస్థలు నడపాలని సూచించిన కేంద్రం తగిన మార్గదర్శకాలు ఇవ్వకముందే, తెలంగాణలో పాఠశాలల్ని టీచర్లతో తెరిచి ఆన్‌లైన్‌ తరగతులను కొనసాగిస్తున్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి కొంతమేరకు సఫలీకృతం అవుతున్నా విద్యార్థులు-–టీచర్లు అలవాటు లేని ఆన్‌లైన్‌ తరగతుల్లో నలిగిపోతున్నారు.. 


కొవిడ్‌ కారణంగా విద్యారంగం స్తంభించిపోయినా ప్రైవేట్‌-–కార్పొరేట్‌ పాఠశాలలు ఫీజులు కోల్పోవడం ఇష్టం లేక విద్యా సంవత్సరం నష్టపోవడం జరగవద్దన్న సాకుతో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించడమే కాక, అడ్మిషన్లు చేపట్టాయి. శానిటైజేషన్‌, భౌతిక దూరం, కనీస వసతుల గురించి పట్టించుకోకుండా, వేలాది మంది టీచర్లకు కనీస జీతాలు ఇవ్వకుండా విద్యార్థుల భవితవ్యం మీద ఎంతో శ్రద్ధ ఉన్నట్లు నటిస్తున్నాయి. దీని పర్యవసానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల చదువు పట్ల వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడం, బడులు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారంటూ కొన్ని సంఘాలు విద్యాసంవత్సరం కొనసాగించాలని డిమాండ్‌ చేయడంతో ప్రభుత్వం పాఠశాలల్ని తెరిచింది. పారిశుధ్య వ్యవస్థను కూడా మెరుగు పరచకుండా, విద్యార్థుల్ని ప్రత్యక్షంగా పాఠశాలలకు రప్పించే పరిస్థితులు కల్పించకుండా, ఆన్‌లైన్‌ తరగతులకు టీచర్లను సిద్ధం చేయడం కోసం ఆగస్టు 27 నుంచి పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించింది. బడుల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని గ్రామ పంచాయితీ సిబ్బందికి అప్పగించినా, అది అదనపు బాధ్యత కావడంతో వాళ్లు నిరాకరిస్తున్నారు. దాంతో కొన్నిచోట్ల టీచర్లే పారిశుధ్య కార్యక్రమాల్ని చేసుకోవాల్సి వస్తోంది. పాఠశాలలకు భౌతికంగా టీచర్లు హాజరుకావడం వల్ల కరోనా మహమ్మారి బారిన పడుతున్న టీచర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. కరోనా సోకిన టీచర్లకు కనీసం సెలవు గానీ, సరియైన చికిత్సకు భరోసా కానీ లేవు. ప్రైవేట్‌ ఆస్పత్రులలో టీచర్ల హెల్త్‌కార్డులు కానీ, ఇన్సూరెన్స్‌ పాలసీలను కానీ పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంతోషం మాటేమో కానీ ఏ టీచర్‌ను కదిలించినా ఇదే  ఆవేదన వినిపిస్తుంది.


అసలు ‘ఈ-మెయిల్‌’ క్రియేట్‌ చేసుకోవడం, ఫేస్‌బుక్‌ చూడడం తెలియని టీచర్లతో ‘జూమ్‌’ మీటింగుల్లో ఆన్‌లైన్‌ బోధన ఎట్లా చేయాలో, విద్యార్థులు ఇంటిపట్టునే ఉంటే ‘గూగుల్‌ ఫామ్స్‌’లో ఎట్లా అసెస్‌ చేయాలో శిక్షణ ఇస్తూ వివిధ చానెళ్ల ద్వారా విద్యాబోధన ప్రారంభించింది విద్యాశాఖ. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో కొద్దిమందికే స్మార్ట్‌ఫోన్లు- – అదీ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటేనే అందుబాటులో ఉంటాయి. తమ పిల్లలు టీవీల్లో చూడాలన్నా సెట్‌టాప్‌ బాక్స్‌లు, ఇంటర్నెట్‌ కనెక్షన్లు లేవంటూ ఎన్నో కుటుంబాలు వాపోతున్నాయి. ఈ నేపధ్యంలో టీచర్ల ప్రచారం, ప్రభుత్వ, అధికార యంత్రాంగం ప్రయత్నం కొంత మేరకు సఫలీకృతమైనట్టు కనిపిస్తున్నా, టీచర్ల స్థితి అటు ఆన్‌లైన్‌ -– ఇటు ఆఫ్‌లైన్‌ సమస్యలతో అరచేతిలో నలిగిపోతున్నట్లున్నది. అన్ని ప్రక్రియలను అదిమిపెట్టి, విద్యార్థులను టీవీల ముందో, సెల్‌ఫోన్లలోనో కనెక్ట్‌ చేసి ప్రత్యక్ష బోధనలోని అనుభూతుల్ని, ఆడి పాడే ఆత్మీయ సంబంధాల తరగతి గదిని దూరం చేసి ఇటు టీచర్లను, అటు విద్యార్థులను అయోమయంలోకి నెట్టివేస్తున్నట్లుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్‌ ప్రక్రియ నిర్వహించడానికి స్వీపర్‌, స్కావెంజర్లతో పాటు హెల్త్‌ వర్కర్లను నియమించాలి. భౌతిక దూరానికి అనుగుణంగా తరగతి గదుల్లో ఫర్నిచర్‌ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల నిర్వహణ ఉండాలి. టీచర్ల –విద్యార్థుల హాజరు విషయంలో సడలింపులివ్వాలి. మాస్క్‌లు, దుస్తులు, పుస్తకాలు, ట్యాబ్‌లు ఉచితంగా ఇవ్వడంతో పాటు సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని (ICT) అందించడానికి అవసరమైన విద్యుత్, కంప్యూటర్లు, స్ర్కీన్లు, నెట్‌ సౌకర్యం అన్ని పాఠశాలలకూ కల్పించాలి. ఉచితంగా కరోనా పరీక్షలు, ఔషధాలు టీచర్లకు, పిల్లలకు అందుబాటులోకి తేవాలి. ఆ తరువాతే ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగించాలి.


‘ప్రత్యక్షంగా తరగతి గదిలో టీచర్లకు విద్యార్థులకు మధ్య జ్ఞాన ప్రసార సంబంధం ఉన్నతంగా ఉన్నప్పుడే దేశం విలువలతో విలసిల్లుతుంది’ అన్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మాటలను గుర్తించి పాటించకుండా, విద్యారంగం టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా, ఆయన జయంతి రోజున ఎన్ని ఉపాధ్యాయ దినోత్సవాలు జరిపినా ఫలితం లేదు. భవిష్యత్ తరాన్ని తీర్చి దిద్దాల్సిన టీచర్లు సమస్యల్లో విలవిల్లాడుతూ నలిగిపోయినంతకాలం తరగతి గదిలో దేశ భవిష్యత్తు నిర్మాణం కాదని అవగతం చేసుకోవాలి. సర్వేపల్లి అభిలషించినట్లుగా సంపూర్ణ వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా పాఠశాలలను సిద్ధం చేయడమే ఆయనకు నిజమైన నివాళి.


ప్రభాకర్‌ కస్తూరి 

కన్వీనర్‌, తెలంగాణ టీచర్స్‌ ఫోరం

Updated Date - 2020-09-05T06:17:30+05:30 IST