మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని టీచర్లను బదిలీ చేయాల్సిందే!

ABN , First Publish Date - 2020-11-16T07:34:52+05:30 IST

జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా విలీనమైన గ్రామాల్లోని పాఠశాలల్లో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిందేనని పాఠశాలల విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశించారు.

మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని   టీచర్లను బదిలీ చేయాల్సిందే!

కలికిరి, నవంబరు 15: జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా విలీనమైన గ్రామాల్లోని పాఠశాలల్లో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను  బదిలీ చేయాల్సిందేనని పాఠశాలల విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశించారు. విజయనగరం, ప్రకాశం, అనంతపురంతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది ఉపా ధ్యాయుల విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. తాము పనిచేస్తున్న పాఠశాలలున్న గ్రామాలు మున్సిపాలిటీల్లో కొత్తగా విలీనమయ్యాయని, దీంతో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయినా ఎంపీపీ, జడ్పీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులతోపాటు తమను బదిలీ చేయకుండా మినహాయించాలని కోరారు. 2011లో కడప మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ బదిలీలను ఆపాలంటూ ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిం చారు. అక్కడ ఉపాధ్యాయుల వాదనను ఏపీటీఏ తోసిపుచ్చింది. దీనిపై హైకోర్టులో అప్పీలు చేశారు. అక్కడ కూడా ఉపాధ్యాయుల వాదనకు చుక్కెదురైంది. పాఠశాల విద్యా శాఖ ఆదేశాలకు కట్టుబడాల్సిందేనంటూ హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. తొమ్మిదేళ్ల కిందటి ఈ ఉదంతాన్ని ఉటంకిస్తూ విలీనమైన గ్రామాల్లోని పాఠశాలలను, ఉపాధ్యాయులను కూడా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తే తప్ప అంత వరకూ వీరంతా ఎంపీపీ, జడ్పీపీ, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులుగానే పరిగణింపబడుతారని డైరెక్టర్‌ ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం మినహాయింపు కోరుకుంటున్న ఉపాధ్యాయులను కూడా ఎంపీపీ, జడ్పీపీ, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఒకే యూనిట్‌గా పరిగణించి బదిలీలు చేపట్టాలని డీఈవోను ఆదేశించారు.

Updated Date - 2020-11-16T07:34:52+05:30 IST