టీచర్స్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2021-01-16T05:47:06+05:30 IST

నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోషల్‌ స్టడీస్‌కు సంబంధించి స్కూలు అసిస్టెంట్‌ పోస్టు ఒకటి ఖాళీ ఉంది. అయితే ఇద్దరికి అక్కడ పోస్టింగ్‌ ఇచ్చారు.

టీచర్స్‌ టెన్షన్‌

బదిలీల్లో గందరగోళం

ఒక్కో పోస్టుకు ఇద్దరు నియామకం!

మూడు ఖాళీలు ఉన్నచోట మాత్రం ఒక్కరినీ నియమించలేదు

ఆదేశాలు వచ్చిన వెంటనే కొత్త చోట చేరాల్సిందేనంటూ విద్యా శాఖ ఆదేశాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోషల్‌ స్టడీస్‌కు సంబంధించి స్కూలు అసిస్టెంట్‌ పోస్టు ఒకటి ఖాళీ ఉంది. అయితే ఇద్దరికి అక్కడ పోస్టింగ్‌ ఇచ్చారు. 

రోలుగుంట మండలం బీబీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ సైన్స్‌ టీచర్‌ పోస్టు ఒకటి ఖాళీ వుండగా...ఇద్దరికి పోస్టింగ్‌ ఇచ్చారు. ఇదే మండలం బెన్నభూపాలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ, బయాలజీ సైన్స్‌లో ఒక్కొక్క స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు ఖాళీగా వుండగా...ఇద్దరేసి టీచర్లకు పోస్టింగ్‌ ఇచ్చారు. 

నక్కపల్లి మండలం గొడిచెర్ల ఉన్నత పాఠశాలలో మూడు బయాలజీ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా వుండగా...ఒక్కరికి కూడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. 

...ఉపాధ్యాయుల బదిలీలు గందరగోళంగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల ఒక పోస్టుకు ఇద్దరిని నియమించారు. మరికొన్నిచోట్ల రెండు, మూడు ఖాళీగా వుంటే అసలు ఎవరినీ నియమించలేదు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో కొన్ని వివరాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు శుక్రవారం రాత్రి నుంచి బదిలీ ఉత్తర్వులు అందుతున్నాయి. జిల్లాలో అన్ని కేటగిరీలకు బదిలీలు పూర్తయుతే పరిస్థితి ఎలా వుంటుందోనని టీచర్లు అంటున్నారు. మాన్యువల్‌ విధానంలో కౌన్సెలింగ్‌ నిర్వహించే పాఠశాల విద్యా శాఖ...ఈ ఏడాది తొలిసారిగా వెబ్‌ ఆప్షన్లు విధానం అమలుచేసింది. ఇందులో ఇబ్బందులను ముందే గ్రహించిన ఉపాధ్యాయులు...‘వెబ్‌ కౌన్సెలింగ్‌ వద్దు మొర్రో’ అంటూ మొరపెట్టుకున్నా పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం మూడు నెలలపాటు సాగింది. అయినా బదిలీల్లో గందరగోళం నెలకొందనే విమర్శలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పైగా సంక్రాంతి సెలవుల్లో బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదమైంది. 

ఉపాధ్యాయ బదిలీలను సరిగ్గా సంక్రాంతి ముందు రోజు నుంచి ప్రారంభించారు. ఈనెల 13న ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు, 14న స్కూలు అసిస్టెంట్లను బదిలీ చేశారు. శుక్రవారం రాత్రి నుంచి సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు బదిలీ ఉత్తర్వులు అందుతున్నాయంటున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు వెంటనే ప్రస్తుతం తాము పనిచేసే పాఠశాల నుంచి రిలీవ్‌ అయి కొత్తగా పోస్టింగ్‌ వచ్చిన చోట చేరాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. నాడు-నేడు పనులు నిర్వహించే చోట సంబంధిత ప్రధానోపాధ్యాయుడు, పనుల లెక్కలను ఈనెల 25లోగా అందజేయాలని ఆదేశించింది. కాగా బదిలీల్లో ఏర్పడిన సమస్యలను విద్యా శాఖ ఎలా పరిష్కరించబోతోంది?, ఒకే పోస్టుకు ఇద్దరిని నియమించిన చోట ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


నేడు పండిట్లకు కౌన్సెలింగ్‌

డీఈవో పూల్‌లో వున్న తెలుగు, హిందీ పండిట్లకు శని వారం విద్యాశాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించ నున్నారు. ఇంకా గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులుగా అర్హత పొందిన టీచర్లకు పదోన్నతి కౌన్సెలింగ్‌ డీఈవో కార్యాలయంలోనే చేపడతారు.

Updated Date - 2021-01-16T05:47:06+05:30 IST