టీచర్లే టార్గెట్‌

ABN , First Publish Date - 2022-06-13T05:30:00+05:30 IST

ప్రాఽథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను తొలిసారిగా సెక్షన్ల ఆధారంగా నిర్ధేశించారు.

టీచర్లే టార్గెట్‌
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న ఏపీటీఎఫ్‌ నేతలు

వారిపై పనిభారం పెంచేలా రేషనలైజేషన్‌ 

సెక్షన్ల ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్య

1:20ని 1:30గా నిష్పత్తిలో మార్పు

నూతన డీఎస్సీకి మంగళం పాడే దిశగా అడుగులు


ఉపాధ్యాయులనే లక్ష్యంగా చేసుకుని వారిపై పనిభారం పెంచేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ప్రభుత్వం తాజాగా హేతుబద్దీకరణ(రేషనలైజేషన్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని యథాతఽథంగా కొనసాగించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు ఉండగా, తాజా మార్గదర్శకాల ప్రకారం సెక్షన్లను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయులను నియమించనున్నారు. టీచర్‌, విద్యార్థుల నిష్పత్తిని ప్రాథమిక పాఠశాలల్లో 1:30గా నిర్ధారించి రేషనలైజేషన్‌ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఈ నిష్పత్తి 1:20గా ఉండగా దీనిలో మార్పు చేయడంతో ఉపాధ్యాయులపై పనిభారం పెరగనుంది. అంతేకాదు ప్రాథమిక పాఠశాలల్లో మిగులు ఎస్‌జీటీ పోస్టులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయనున్నారు. 


నెల్లూరు (విద్య), జూన్‌ 13  : ప్రాఽథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను తొలిసారిగా సెక్షన్ల ఆధారంగా నిర్ధేశించారు. మూడు నుంచి పదో తరగతి వరకు ఉండే హైస్కూల్స్‌లో ప్రతి ఎనిమిది సెక్షన్లకు ఒక హెచ్‌ఎం, 9 మంది టీచర్లు మాత్రమే ఉంటారు. గణితం లేదా ఇంగ్లీష్‌ సబ్జెక్టులకు మాత్రమే అదనంగా ఉపాధ్యాయులను ఇవ్వనున్నారు. విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నా అందరినీ ఒకే సెక్షన్‌లో కుక్కేసి సబ్జెక్ట్‌ను ఒక ఉపాధ్యాయుడితోనే బోధించనున్నారు. ఇలా మొత్తం ఎనిమిది సెక్షన్లు ఉంటే 10 మంది టీచర్లు, 9 ఉంటే 11 మంది, 10 ఉంటే 12 మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు. అలాగే 6 నుంచి 10వతరగతి వరకు ఉండే పాఠశాలలకు మాత్రం స్వల్ప ఊరట కలిగించేలా హైస్కూళ్ల మాదిరిగా కాకుండా సెక్షన్‌కు ఒక టీచర్‌ చొప్పున అదనంగా ఇస్తారు. మొత్తం మీద హైస్కూళ్లలో ఇప్పటి వరకు ఒక్కో సబ్జెక్ట్‌ ఉపాఽధ్యాయుడు గరిష్ఠంగా రోజుకు ఆరు చొప్పున వారానికి 36 పీరియడ్లు బోధిస్తుండగా, నూతన విద్యా విధానం ప్రకారం రోజుకు కనీసం ఏడు చొప్పున వారానికి 42 పీరియడ్లు తప్పనిసరిగా బోధించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా రేషనలైజేషన్‌ వల్ల హైస్కూళ్లలో సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోయి మిగిలిన టీచర్లపై భోదనాభారం పెరగనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 8వతరగతి వరకు కేవలం ఆంగ్లమాధ్యమమే ఉంటుంది. 9, 10 తరగతులకు మాత్రమే తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్‌ మీడియం నిర్వహణ కొంత కష్టతరంగానే మారనుంది. దీనికితోడు రేషనలైజేషన్‌ టీచర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 


తగ్గనున్న ఉపాధ్యాయుల పోస్టులు...

ఉపాధ్యాయ రేషనలైజేషన్‌కు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యకు శాపంగా మారనున్నాయి. ఇప్పటికే ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా ఉన్న పోస్టులను కత్తిరించేలా ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు గ్రామీణ విద్యపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అలాగే 30 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాఽథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయి. జిల్లాలో జడ్పీ ఉన్నత పాఠశాలలు 314, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 14 కలిపి మొత్తం 328 హైస్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో హెచ్‌ఎంలు 310, స్కూల్‌ అసిస్టెంట్‌ సబ్జెక్ట్‌ టీచర్లు 5,080, ఎస్‌జీటీలు 4,795లతోపాటు పీఎస్‌ హెచ్‌ఎంలు 253 కలిపి మొత్తం 10,128 మంది పనిచేస్తున్నారు. జిల్లాకు మొత్తం 12,244 పోస్టులు మంజూరు కాగా 10,128 మంది పనిచేస్తుండగా మరో 2,116 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ తాజా రేషనలైజేషన్‌ వల్ల కొత్తగా డీఎస్సీలో ఉపాధ్యాయ నిమామకాల సంఖ్య భారీగా తగ్గిపోవచ్చని, అసలు డీఎస్సీ అవసరమే ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రాథమిక సమాచారం ప్రభుత్వానికి పంపినా అధికారులు మాత్రం ఆ వివరాలు వెల్లడించడం లేదు. పోస్టుల రద్దు ప్రభావం బోధనపై పడనున్న దని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయిలో రేషనలైజేషన్‌ను కలెక్టర్‌ ఆధ్వర్యంలో పూర్తి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. 


పునర్విభజన జీవో రద్దు చేయాలి : ఏపీటీఎఫ్‌ 

పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే విధంగా, పాఠశాల విద్యకు వినాశకరంగా ఉన్న ఉపాధ్యాయుల పునర్విభజన జీవో 117ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి సురేంద్రరెడ్డి మాట్లాడుతూ 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌కు తరలించడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమవుతార న్నారు. 80శాతం బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదముందన్నారు. 3, 4, 5 తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లతో బోధన చేయిస్తామని ఓపైవు చెబుతూనే ప్రాఽథమికోన్నత పాఠశాలలకు ఎస్‌జీటీలను కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నత పాఠశాలల్లో రోల్‌ ప్రకారం కాకుండా సెక్షన్ల ప్రకారం పోస్టులు కేటాయించడం వల్ల చాలా పోస్టులు రద్దయి ఉపాధ్యాయుల మీద పనిభారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 98 రోల్‌ కన్నా తక్కువ ఉంటే హెచ్‌ఎం పోస్టు, పీఈటీ పోస్టు తొలగించడం, 600 మందికి ఒకే హిందీ ఉపాధ్యాయుడిని కేటాయించడం దుర్మార్గమ న్నారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవో 117ను రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం పిచ్చిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుల్ఫికర్‌ ఆలీ, కృష్ణారెడ్డి, ఎస్‌కే రియాజ్‌, సుబ్బారెడ్డి, ఏవీ రావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-13T05:30:00+05:30 IST