‘అయ్యో’ర్లు!

ABN , First Publish Date - 2022-08-17T05:51:43+05:30 IST

స్మార్ట్‌ ఫోన్‌లోని యాప్‌ ద్వారా ముఖహాజరు వేయాల్సి రావడం టీచర్లకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

‘అయ్యో’ర్లు!

టీచర్లకు ముఖ హాజరు కష్టాలు

తొలిరోజు చుక్కలు చూపించిన యాప్‌

సక్రమంగా పనిచేయని సర్వర్‌

 సిగ్నల్‌ అందక నమోదు కాని హాజరు

 ఆందోళనలో  ఉపాధ్యాయులు

 బయోమెట్రిక్‌ అమలుకు డిమాండ్‌

స్మార్ట్‌ ఫోన్‌లోని యాప్‌ ద్వారా ముఖహాజరు వేయాల్సి రావడం టీచర్లకు పెద్ద తలనొప్పిగా తయారైంది. గతంలో బయోమెట్రిక్‌ విధానంలో టీచర్లు హాజరు వేసేవారు. తాజాగా టీచర్లు తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ముఖ హాజరు వేయాలనే నిబంధన ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని కోసం ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. మంగళవారం నుంచి ఉదయం 9 గంటల్లోపు సెల్‌ఫోన్‌ ద్వారా ముఖ హాజరు వేస్తేనే పాఠశాలకు వచ్చినట్లుగా పరిగణిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.  టీచర్లు ఉదయం 9 గంటల కన్నా ముందుగానే వచ్చి ముఖ హాజరు వేసేందుకు ప్రయత్నిస్తే సంబంధిత యాప్‌ పని చేయలేదు. ఉదయం 10.30, 11 గంటలకు హాజరైనట్లు టీచర్ల సెల్‌ఫోన్‌లకు మెస్సేజ్‌ లు వచ్చాయి. దీంతో  మంగళవారం తాము విధులకు హాజరైనట్టా? లేక  గైర్హాజరైనట్టా? తెలియక టీచర్లు అయోమయంలో ఉన్నారు. 

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ప్రభుత్వం టీచర్ల హాజరు, విద్యార్థుల హాజరు, మరుగుదొడ్ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం పెడుతున్న తీరు తదితర అంశాలను నమోదు చేసేందుకు తీసుకువచ్చిన యాప్‌లు టీచర్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం పాఠశాలల్లో  ఐఎంఎంఎస్‌, స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌, అకడమిక్‌ మానిటరింగ్‌ యాప్‌లతోపాటు మరో 11 యాప్‌లలో పాఠశాలకు సంబంధించిన వివరాలు పంపాల్సి ఉంది. తాజాగా స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ యాప్‌లోనే టీచర్ల హాజరు  యాప్‌ను అనుసంధానం చేసి దాని ద్వారానే టీచర్లు ఉదయం 9 గంటలకు తప్పనిసరిగా పాఠశాలకు హాజరైనట్లుగా నమోదు చేయాలనే నిబంధన పెట్టారు. ఒక్క నిముషం ఆలస్యమైనా ఆరోజు జీతం ఇచ్చేది లేదనే నిబంధన అమలు చేస్తామని స్పష్టం చేశారు. యాప్‌ సక్రమంగా పనిచేయకుంటే తాము ఎలా బాధ్యత వహిస్తామని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయ సంఘాల నాయకుల అనుమతితోనే ఈ యాప్‌ను  అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. పాఠశాల ప్రారంభమైన తరువాత  ఇన్ని యాప్‌ల ద్వారా సమాచారాన్ని పంపాల్సి రావడంతో టీచర్లకు గంట, గ ంటన్నర సమయం పడుతుంది. దీంతో టీచర్లు పాఠ్యాంశాలు బోధించే విలువైన సమయం వృఽథా అవుతోంది. ఇదే విషయాన్ని టీచర్లు విద్యా శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసినా వారు పట్టించుకున్న దాఖలాల్లేవు

తొలిరోజు పరిస్థితి ఇలా ..

టీచర్లు ముఖ హాజరు ద్వారా తాము పాఠశాలకు హాజరైనట్లు యాప్‌లో నమోదు చేసుకునే విధానాన్ని మంగళవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం టీచర్లు ఈ యాప్‌ ద్వారా హాజరును వేసేందుకు ప్రయత్నిస్తే సర్వర్‌ సక్రమంగా పనిచేయక ఇబ్బందులు ఎదురయ్యాయి. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సక్రమంగా లేని పాఠశాలల్లో ఈ యాప్‌ అసలు పని చేయలేదు. గతంలో పాఠశాలల గదిలో టీచర్లు ఎక్కడి నుంచి తమ ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేశారో, అదే ప్రాంతంలో కచ్చితంగా నిలబడి ముఖ హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ఫొటోను నమోదు చేసే సమయంలో నుదిటిపై బొట్టు ఉన్నపుడు ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే, ప్రస్తుతం బొట్టు లేదు కాబట్టి ఫొటోను తీసుకునే అవకాశం లేదని, గతంలో ఉన్న ఫొటోలో గోడపై జాతీయ నాయకుల ఫొటోలు ఉన్నాయని, ప్రస్తుతం అవి కనిపించడం లేదనే మెస్సేజ్‌లు వస్తున్నాయి. ఎవరైనా టీచర్లు పుణ్యక్షేత్రానికి వెళ్లి తలనీలాలు సమర్పిస్తే తలపై జుట్టు లేదు కాబట్టి ఆ ఫొటో మీది కాదనే  సమాచారం వస్తుంది.  బయోమెట్రిక్‌ విధానంలో టీచర్లు హాజరు వేశారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బయోమెట్రిక్‌ విధానంలో హాజరు వేసే ట్యాబ్‌లను మూలన పెట్టేశారు. తాజాగా ముఖహాజరు అమలులోకి తీసుకురావడం, అందుకు అనుగుణంగా సర్వర్‌ పనిచేయకపోవడంతో గందరగోళం నెలకొంది.

హాజరు పడకుంటే పని చేస్తారా?

టీచర్లు ముఖ హాజరు ద్వారా కచ్చితంగా పాఠశాలకు హారైనట్లుగా యాప్‌లో నమోదు చేయాలనే నిబంధన పెట్టారు. ఉమ్మడి  కృష్ణా జిల్లాలో 650కుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ఉదయం 9 గంటలకు కచ్చితంగా ముఖహాజరు వేయకుంటే సంబంధిత టీచరు ఆ రోజు సెలవు తీసుకోవాల్సిందే. అది కూడా జీతం ఇవ్వని సెలవుగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా  ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్ల హాజరు నమోదు కాకుంటే ఎంతమేర పాఠశాలలో ఉంటారనేది ప్రశ్నార్ధకమే. హాజరు పడలేదని టీచర్లు పాఠశాలను విడిచి వెళితే  ఏకోపాధ్యాయ పాఠశాల్లోని విద్యార్థులకు పాఠాలు ఎవరు భోధిస్తారు? మధ్యాహ్న భోజనం ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తమకు జీతం నిలుపుదలతో కూడిన సెలవుగా ప్రకటిస్తే తామెందుకు ఆ రోజు పాఠశాలలో పనిచేయాలని టీచర్లు అంటున్నారు.

సెల్‌ఫోన్లు తీసుకు వెళ్లవద్దని గతంలో ఉత్తర్వులు 

టీచర్లు సెల్‌ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకువెళ్లడానికి వీలులేదని ఈనెల 4వ తేదీన డీఈవో తాహెరాసుల్తానా జారీ చేసిన ఉత్తర్వులను టీచర్లు తెరపైకి తీసుకువచ్చారు.  డీఈవోనే సెల్‌ఫోన్లను తీసుకువెళ్లవద్దని ఉత్తర్వులు జారీ చేశారని, ఈ నేపథ్యంలో తాము హాజరు ఎలా వేయాలని, పాఠశాలలకు సంబంధించిన ఇతరత్రా అంశాలను ఎలా ఆన్‌లైన్‌లో పంపాలని టీచర్ల ప్రశ్నిస్తున్నారు. 



Updated Date - 2022-08-17T05:51:43+05:30 IST