పదోన్నతుల కోసం..

ABN , First Publish Date - 2022-08-08T05:38:03+05:30 IST

జిల్లాలో 3,4,5 తరగతుల విలీనం అనంతరం ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల పోస్టుల భర్తీ కోసం సీనియర్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్లు... గ్రేడ్‌ 2 హెచ్‌ఎం పోస్టుల కోసం సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లు ఎదురు చూస్తున్నారు.

పదోన్నతుల కోసం..

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం సెకండరీ గ్రేడ్‌ టీచర్లు...

 గ్రేడ్‌2 హెచ్‌ఎం పోస్టుల కోసం స్కూల్‌ అసిస్టెంట్ల ఎదురుచూపులు

మచిలీపట్నం టౌన్‌ : జిల్లాలో 3,4,5 తరగతుల విలీనం అనంతరం ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల పోస్టుల భర్తీ కోసం సీనియర్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్లు... గ్రేడ్‌ 2 హెచ్‌ఎం పోస్టుల కోసం సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లు ఎదురు చూస్తున్నారు. వీరికి పదోన్నతులు కల్పించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లను ఉద్యమం నుంచి దృష్టి మళ్లించేందుకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లు 31 మందికి గ్రేడ్‌ 2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల నియామకాలు జరపాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తుండటంతో అర్హత గల 60 మంది సీనియర్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశాలు ఏర్పడ్డాయి. కృష్ణాజిల్లాలో మోడల్‌ స్కూళ్లు లేవు. ఎన్టీఆర్‌ జిల్లాలోని మోడల్‌ స్కూళ్లలో కాంట్రాక్టు పద్ధతిలో టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈనెల 17 వరకు దరఖాస్తులు తీసుకుంటున్నట్టు ఎన్టీఆర్‌ జిల్లా డీఈవో తెలిపారు. ఆగస్టు 30న ఈ కాంట్రాక్టు టీచర్లకు డెమో క్లాసులు నిర్వహించి ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలా టీచర్ల ఉద్యమాలపై నీళ్లు చల్లేందుకు, టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 10లోగా సీనియారిటీ జాబితాలు ప్రకటించేందుకు డీఈవో తాహెరా సుల్తానా రంగం సిద్ధం చేస్తున్నారు.  

 సంఘాలతో చర్చించాలి

పదోన్నతులు కల్పించేందుకు వెంటనే సీనియారిటీ జాబితాను ప్రకటించాలి. గతంలో పదోన్నతులు వదులుకున్న టీచర్లకు మళ్లీ పదోన్నతులు కల్పించాలి. దీనిపై విద్యాశాఖ మంత్రి అన్ని సంఘాలతో ముందస్తుగా సమావేశం ఏర్పాటు చేయాలి. 3,4,5 తరగతుల విలీనాన్ని వ్యతిరేకించినప్పటికీ విలీన ప్రక్రియ జరుగుతూనే ఉంది. అయితే పదోన్నతుల ప్రక్రియ అయినా సక్రమంగా జరిగితే ఉపాధ్యాయులకు కొంత మేలు చేకూరుతుంది.

- కొమ్ము ప్రసాద్‌, ఎస్టీయూ జిల్లా నాయకుడు 

పాత జిల్లాల ప్రాతిపదికన జాబితా రూపొందించాలి 

కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన సీనియారిటీ జాబితాలను రూపొందించాలి. ఆగస్టు 10లోగా సీనియారిటీ జాబితాలు ప్రకటించి వాటిపై అభ్యంతరాలను స్వీకరించాలి. జిల్లాలో వాస్తవంగా ఉండే క్యాడర్‌ స్ర్టెంత్‌, ఉపాధ్యాయుల పోస్టులను తక్షణం వెబ్‌సైట్‌లో ప్రకటించాలి. గతంలో పదోన్నతులు 18 వేల మందికి ఇస్తామన్నారు. ఇప్పుడు 8 వేల మందికి తగ్గించారు. ఇది దారుణం.  

- తమ్ము నాగరాజు, ఏపీటీఎఫ్‌ నాయకుడు



Updated Date - 2022-08-08T05:38:03+05:30 IST