20 నామినేషన్లకు ఆమోదం

ABN , First Publish Date - 2021-02-25T06:37:29+05:30 IST

కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు దాఖలైన 20 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో ఆమోదం పొందాయి.

20 నామినేషన్లకు ఆమోదం
ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలనలో మాట్లాడుతున్న ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌

గుంటూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు దాఖలైన 20 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో ఆమోదం పొందాయి. బుధవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి వివేక్‌యాదవ్‌, ఎన్నికల పరిశీలకుడు రమణ, ఏఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరిగింది. దీనికి అభ్యర్థులు, వారి ప్రతినిధులు హాజరయ్యారు. అందరి నామినేషన్‌ పత్రాలు సక్రమంగా ఉండటంతో వాటిని ఆమోదిస్తున్నట్లు వివేక్‌యాదవ్‌ ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. నేషనల్‌ నవ క్రాంతి పార్టీ తరపున గురజాల మండలానికి చెందిన కనకం శ్రీనివాసరావు ఒక్కరే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరపున నామినేషన్‌ వేశారు. టీడీపీ, ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, వైసీపీ మద్దతుతో టీ కల్పలత, జనసేన మద్దతుతో గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ మద్దతుతో కోట సాయికృష్ణ ఎన్నికల బరిలో నిలిచారు. యూటీఎఫ్‌ మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, ఎస్‌టీయూ ఏపీ మద్దతుతో పీవీ మల్లికార్జునరావు, ఏపీటీఎఫ్‌ మద్దతుతో పాండురంగ వరప్రసాదరావుల నామినేషన్లు కూడా ఆమోదం పొందాయి. వీరు కాకుండా బీ ఓంకారమయ్య, కన్నెబోయిన వంశీకృష్ణ, చందూ రామారావు, చందూ విజయలక్ష్మి, తులసీరామ్‌ యర్రాకుల, ప్రొఫెసర్‌ దారా విక్రయమ్‌, నాగస్వరం నరసింహం, బట్టు శ్యాంప్రసాద్‌, మత్తి కమలాకరరావు, రాంబాబు చెన్నకేశవులు, డాక్టర్‌ రామకోటయ్య, సాగర్‌బాబు సూరె నామినేషన్లు కూడా ఆమోదం పొందాయి. 

26న అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం

ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాని ప్రకటిస్తామని వివేక్‌యాదవ్‌ తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల కోడ్‌ అమలుపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. 

Updated Date - 2021-02-25T06:37:29+05:30 IST