జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2020-09-05T06:31:15+05:30 IST

తల్లీ, తండ్రీ, గురువు, దైవం అన్నీ తానై, స్నేహితడి వలె అభిమానంగా ఆదరిస్తూ, గురువుగా అజ్ఞాన తిమిరాన్ని తొలగించి, సరస్వతీపుత్రులుగా, మానవత్వం పరిమళించే విద్యాకుసుమాలుగా శిష్యులను తీర్చిదిద్ది,

జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు

తల్లీ, తండ్రీ, గురువు, దైవం అన్నీ తానై, స్నేహితడి వలె అభిమానంగా ఆదరిస్తూ, గురువుగా అజ్ఞాన తిమిరాన్ని తొలగించి, సరస్వతీపుత్రులుగా, మానవత్వం పరిమళించే విద్యాకుసుమాలుగా శిష్యులను తీర్చిదిద్ది, వారు జాతికి అందిన అమూల్య వరాలుగా, ఆభరణాలుగా పరిఢవిల్లాలని మనస్సు నిండుగా యువతను దీవించే, ప్రజ్వలించే దివ్వె ఉపాధ్యాయుడు!


జీవితంలో అంచెలంచెలుగా, ఎదుగుతూ గురువులందరికీ గురువుగా నిలిచి రాష్ట్రపతి పదవిని అధిష్టించిన గొప్ప తత్వవేత్త, విద్యావేత్త, వేదాంతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆ విశ్వగురువు పుట్టినరోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా – --అదీ గురు పూజోత్సవం వేడుకగా జరుపుకుంటున్నాం! వేదాల, ఉపనిషత్తుల సారాంశాన్ని బోధించడం ఒకప్పటి గురుకుల విద్యా విధానం! అలనాడు, ఏ రాజవంశీకులకో, ఏ కొద్ది మంది బ్రాహ్మణుల పిల్లలకో విద్య పరిమితమై ఉండేది! ఆ గురు శిష్యుల బంధమే వేరు, ఆ గురువు బాధ్యతే వేరు! మరి నేటి దేశకాల పరిస్థితుల్లో, సమాజంలో పిల్లలు అధిక మాత్రులు! వీరి ప్రతిభ, సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపాధ్యాయుడు ‘వజ్రాన్ని సాన బెట్టే ఒక సాధనం’ కావాలి! మారుతున్న పరిస్థితుల కనుగుణంగా, తగిన నూతన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో, తాను నిరంతర విద్యార్థిఆ ఉంటూ, సృజనాత్మక పద్ధతులతో యువతకు మార్గదర్శనం చేస్తూ, దేశ భవితను తీర్చి దిద్దాల్సిన గురువు బాధ్యత నేడు మరింత బృహత్తరమైనదని చెప్పక తప్పదు. అనూహ్యంగా వచ్చి పడిన కరోనా మహమ్మారి గండం వల్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, మన ఉపాధ్యాయులు ఆన్‌లైన్ విద్యాబోధనకు క్రమేణా అలవాటు పడుతున్నారు. అందులో సాధక బాధకాలు లేకపోలేదు. విద్యా సంస్థలు ఆన్‌లైన్ బోధన కోసం పరంగా ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో ఐసిటి సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ స్పష్టం చేసినప్పటికీ ఈ పరిస్థితులలోనూ వారిదే కీలక పాత్ర. 


నేటి కాల పరిస్థితులననుసరించి గురువులు బహుఅప్రమత్తులుగా ఉండాలి. అందుకు తల్లితండ్రులు కూడా సహకరించాలి. పుస్తకాల బరువు అంటూ వాళ్లు, సిలబస్ బరువు అంటూ ఉపాధ్యాయులు చిన్నారులకు లేని ఆలోచనలను రేకెత్తించకూడరు. ఉత్తమ విద్య అంటే మార్కులు, గ్రేడులు పనికి రాని పట్టాలు కావు నాణ్యమైన బోధనతో విద్యార్ధులని నిష్ణాతులుగా తీర్చిదిద్దటం, ఉత్తమ పౌరులుగా రూపొందించటం. ఈ క్రమంలో ముందుగా చిన్నారుల మనసుల్ని చల్లని, సుతిమెత్తని మాటలతో ముద్దుగా అలరిస్తూ Carrot Method వినియోగించి మంచిని పెంచి, శ్రద్దాసక్తులు కలిగించాలి. వారి బాల్యం వారికి దక్కనీయాలి. కరోనా విపత్తు వల్ల కొన్ని కార్పొరేట్, ప్రైవెట్ పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి. ఈ తరహా బోధనలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా తర్ఫీదు కావాలి. ముఖాముఖిగా, తరగతిలో ఇంటరాక్షన్ లేకుండా టీచర్లు స్మార్ట్ బోర్డుతో బోధించడం వల్ల వారికి బోధ పడిందో లేదో తెలియదు. పైగా విద్యార్ధులు ఒత్తిళ్లకు లోనైతే కొత్తసమస్యలు ఉద్భవిస్తాయి. ఈ తరహా బోధనలో ప్రత్యక్ష సంబంధం, సందేహాలు తీర్చుకునే మార్గమూ ఉండదు. దాంతో నిజమైన గురుశిష్య అనుబంధం కొరవడుతుంది. గురువు బోధించడమంటే సిలబస్ ముగించడం కాదు, విద్యార్ధులను, వారి గృహ, కుటుంబ వాతావరణాలను అర్ధం చేసుకుని వారితో కలిసి ముందుకు సాగడం. విద్యార్ధులలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాల్ని, నైపుణ్యాల్ని వెలికితీసి, బాంధవ్యాన్ని నెలకొల్పుకుంటూ గురువులు వారికి బంగారు భవితను అందించడం. ప్రస్తుత పరిస్థితులలో దీనికి పెద్దగా అవకాశం లేదు. అయినా పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండవు. మళ్లీ గురుశిష్య సంబంధంతో ప్రత్యక్ష బోధన పరిస్థితులు రాకపోవు.


గురుముఖంగా నేర్చిన విద్యయే రాణిస్తుంది అన్న విషయాన్ని విస్మరించకూడదు. నేను చదువుతున్నరోజుల్లో నాలో ఏకాగ్రత, ధారణాశక్తి, అంకితభావాలను ప్రేరేపించి నన్నొక గురువుగా, ఉత్తమ ఉపాధ్యాయిని బహుమతి గ్రహీతగా, జీవిత సాఫల్య పురస్కార గ్రహీతగా మలిచిన నా గురువులకు సదా కృతజ్ఞురాలిగా ఉంటాను. అన్ని వృత్తుల వంటిది కాదు ఉపాధ్యాయ వృత్తి. అని, అందుకే మంచి ఉపాధ్యాయులను విద్యార్ధులు జీవితాంతం గుర్తుంచుకుంటారు. విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి స్వావలంభనకు నెలవు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఉత్తమ గురువులు ఉన్నత భావాలుగల శిష్యులనే కాదు, చుట్టూ ఉండే సమాజాన్ని ఉత్కృష్టంగా నిర్మించగలిగిన నాడే జాతి జీవనం మహోన్నతంగా సాగుతుంది. 


అందువల్ల సర్వేపల్లి రాధాకృష్ణ పాటించిన విలువలను అనుసరించడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి అవుతుంది.


పరిమి శ్యామలా దేవి

విశ్రాంత ప్రిన్సిపాల్

Updated Date - 2020-09-05T06:31:15+05:30 IST