17 నుంచి టీచర్లు కొత్త పోస్టింగుల్లో!

ABN , First Publish Date - 2022-01-05T08:57:38+05:30 IST

సంక్రాంతి పండుగ తర్వాత ఉపాధ్యాయులు కొత్త పోస్టింగ్‌లో పనిచేసేలా ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలపై అధికారుల కసరత్తు ఇప్పటికే తుది దశకు చేరింది.

17 నుంచి టీచర్లు కొత్త పోస్టింగుల్లో!

  • సంక్రాంతి సెలవుల ముందు ఆర్డర్లు?.. 
  • 8న రిపోర్ట్‌ చేయాలని ఆదేశం..?


హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ తర్వాత ఉపాధ్యాయులు కొత్త పోస్టింగ్‌లో పనిచేసేలా ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలపై అధికారుల కసరత్తు ఇప్పటికే తుది దశకు చేరింది. అయితే స్పౌజ్‌ విషయంలో కొన్ని సాంకేతిక అడ్డంకులను గుర్తించారు. వాటిని ఎలా అధిగమించాలనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒకటి రెండు రోజుల్లో ఈ వ్యవహారం కొలిక్కి రానుంది. దీంతో ఉపాఽధ్యాయులకు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చే ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 7 లేదా 8న ఉపాధ్యాయులకు కొత్త పోస్టింగ్‌ను కేటాయిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 7నకొత్త పోస్టింగ్‌ ఆర్డర్లను జారీ చేసి, 8న రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తర్వాత ఉపాధ్యాయులు సంక్రాంతి సెలవులకు వెళ్లి, 17 నుంచి కొత్త పోస్టింగ్‌లో కొనసాగేలా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


 దీనివల్ల కొత్త పోస్టింగ్‌లో చేరడానికి ఉపాధ్యాయులకు వారం రోజులకు పైగా గడువు ఉంటుందని, వారు మానసికంగా సిద్ధమవడానికీ వీలుంటుందని భావిస్తున్నారు. సెలవులు కూడా ఉండడంతో కొత్త పోస్టింగ్‌లపై అసంతృప్తుల ఆందోళనలను నివారించడానికీ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా టీచర్ల కేటాయింపు ప్రక్రియలో సుమారు 20 వేల మందికి స్థానచలనం కలిగే అవకాశం ఉంది. ఇందులో 60 శాతం పైగా టీచర్లకు వారు కోరుకున్న ప్రాంతాల్లోనే పోస్టింగ్‌లు వస్తాయని భావిస్తున్నారు. మిగిలిన 40 శాతం మంది మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పౌస్‌, పీహెచ్‌సీ కోటా, సీనియర్లు వంటి వారికి మొదట కోరుకున్న పోస్టింగ్‌లను ఇస్తుండడంతో మిగిలిన వారికి మాత్రం కొంత అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది. పైగా ఆయా జిల్లాల్లోని అర్బన్‌ ప్రాంతాల పోస్టింగ్‌లను చూపకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టింగ్‌లను పరిగణనలోకి తీసుకొని కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించడం జూనియర్‌ ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


ఉద్యమాన్ని ఆపేందుకే సెలవులు: టీపీటీఎఫ్‌

ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్యమాన్ని ఆపడానికే ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఉపయోగించుకుంటోందని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) ఆరోపించింది. పారదర్శకత లేకుండా, స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా చేస్తున్న జిల్లాల కేటాయింపు ప్రక్రియను రద్దు చేసి, సరైన మార్గదర్శకాలతో తిరిగి చేపట్టాలని ఫెడరేషన్‌ అధ్యక్షుడు రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు మంగళవారం డిమాండ్‌ చేశారు. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన మొదలైన నాటి నుంచి కేవలం 135 రోజుల పని దినాలే పూర్తయ్యాయని, అందులోనూ బోధనా గంటలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సెలవులను కుదించాల్సింది పోయి పొడిగించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని అన్నారు.  

Updated Date - 2022-01-05T08:57:38+05:30 IST