ఎట్టకేలకు టీచర్ల బదిలీ ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-01-14T06:08:15+05:30 IST

ఉపాధ్యాయులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. బదిలీ ఉత్తర్వులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

ఎట్టకేలకు టీచర్ల బదిలీ ఉత్తర్వులు



తొలివిడత ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు

రేపోమాపో మిగతావి కూడా

గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, తెలుగు, హిందీ

టీచర్ల ఉత్తర్వులు కాస్త జాప్యం 

ఒంగోలు విద్య, జనవరి 13:  ఉపాధ్యాయులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. బదిలీ ఉత్తర్వులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదలయ్యాయి. మిగతా టీచర్లకు సంబంధించినవి కూడా ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు తెలుగు, హిందీ స్కూలు అసిస్టెంట్ల బదిలీ ఉత్తర్వుల విడుదల కాస్త జాప్యం కానుంది. వీరి బదిలీలకు సంబంధించి ప్రకటించిన తాజా షెడ్యూలు ప్రకారం ఈనెల 16 వరకు ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. 17, 18 తేదీల్లో సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. 20 తర్వాత బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. 

111మంది హెచ్‌ఎంలకు బదిలీ ఉత్తర్వులు 

బదిలీల కోసం జిల్లాలో మొత్తం 5,624 మంది ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు దరఖాస్తు చేశారు. వారిలో 111మంది ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల బదిలీ ఉత్తర్వులు బుధవారం విడుదలయ్యాయి.  ప్రాధాన్యతా క్రమంలో వెబ్‌కౌన్సెలింగ్‌లో వారికి స్థానాలు కేటాయించారు.   హెచ్‌ఎంలు ఎవరికి వారు బదిలీ ఉత్తర్వులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని డీఈవో  సుబ్బారావు కోరారు. బుధవారమే డౌన్‌లోడ్‌ చేసుకొని అదేరోజు సంబంధిత ఎంఈవోలను కలిసి వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటునుంచి రిలీవ్‌ అయి 14న కొత్తపాఠశాలలో చేరాలని ఆదేశించారు. కొత్త పాఠశాలల్లో చేరుతున్న హెచ్‌ఎంలు ఆ పాఠశాలలో తప్పనిసరి కాకపోతే అవసరమున్న ఇతరచోట్ల వీరి సేవలు వినియోగించుకుంటామని బదిలీ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరం ఉంటే కొత్తపాఠశాలలో చేరిన పదిహేను రోజులలోపు సంబంధిత అధికారికి అప్పీల్‌ చేసుకోవచ్చు. 

నేడు ఎస్‌ఏలకు... 

స్కూలు అసిస్టెంటు గణితం, ఫిజికల్‌ సైన్సు, బయోలాజికల్‌ సైన్సు, సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లీషు ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు గురువారం విడుదల కానున్నాయి. ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు ఈనెల 16న విడుదల చేసేందుకు పాఠశాల విద్య డైరెక్టర్‌ కార్యాలయం ఐటీసెల్‌ సన్నాహాలు చేస్తోంది. 

Updated Date - 2021-01-14T06:08:15+05:30 IST