ఎందుకీ పురస్కారాలు

ABN , First Publish Date - 2022-09-04T06:27:49+05:30 IST

కరోనా ఉధృతితో వరుసగా రెండేళ్ళ పాటు నిలిచిపోయిన గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల అందజేత కార్యక్రమాలకు ఈదఫా ఉపాధ్యాయ సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది.

ఎందుకీ పురస్కారాలు
గురు పూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ఏలూరు జిల్లా డీఈవోకు లేఖ అందజేస్తోన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

గురువుల ఆగ్రహం

వెంటాడి...వేధించి..మళ్లీ సత్కారాలా

గురుపూజోత్సవ అవార్డుల కార్యక్రమ బహిష్కరణకు నిర్ణయం


‘రాష్టంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయులపై నిర్బంధాలు..అడిగితే అరెస్టులు..వారిని దోషుల్లా చూస్తూ నోటీసులు ఇవ్వడం, బైండోవర్‌ కేసులు బనాయించడం వంటివి..టీచర్లను భయ భ్రాంతులకు గురిచేశాయి. ఉత్తమ ఉపాధ్యాయుల పేరిట ఒక శాలువా కప్పి టీచర్ల సంక్షేమం కోసం మేమున్నామనే ఆచరణ లేని ఈ గురు పూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం ’ 

– ఉపాధ్యాయ సంఘాల జిల్లా నేతలు డీఈవో గంగాభవానికి శనివారం అందజేసిన లేఖ వివరాలు ఇవి.


 ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 3 : కరోనా ఉధృతితో వరుసగా రెండేళ్ళ పాటు నిలిచిపోయిన గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల అందజేత కార్యక్రమాలకు ఈదఫా ఉపాధ్యాయ సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం టీచర్లపట్ల అనుసరిస్తోన్న వ్యతిరేక వైఖరే ఈ ఏడాది గురు పూజోత్సవాన్ని వేదికగా తీసుకుని ఉపాధ్యాయ సంఘాలు నిరసన బాట ఎంచుకున్నాయి. తొలుత యాప్‌ల పెనుభారంతో మొదలైన ఉపాధ్యాయుల నిరసన, ఆ తదుపరి నాడు–నేడు పనులతో ఒత్తిడి, తాజాగా ముఖగుర్తింపు హాజరు, సీపీఎస్‌ ఆందోళనలో టీచర్లందరికీ పోలీసులు/గ్రామ సచివాలయాల మహిళా పోలీసులు నోటీసులు జారీచేసి దాదాపు మూడు రోజుల పాటు వెంటపడటం వంటివి ఉపాధ్యాయుల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇక ఉపాధ్యాయ సంఘాల నాయకులనైతే ఇటు స్కూలులోను, అటు ఇళ్లవద్ద కాపుకాయడం, పలువురిని స్కూలు విధుల్లో ఉండగానే పోలీసులు వచ్చి తీసుకెళ్ళడం, గంటలకొద్దీ నిర్బంధించడం, మరికొందరిపై బైండోవర్‌ కేసులు నమోదుచేయడం, వార్నింగ్‌లకు దిగటం వంటి చర్యలు మండిపాటుకు గురిచేశాయి. అసలు తమకు సీపీఎస్‌తో గాని, మిలియన్‌ మార్చ్‌/సీఎం ఇంటిముట్టడికి పిలుపు నిచ్చిన సంఘాలతో గాని సంబంధం లేదని మొరపెట్టుకున్నా వినేది లేదంటూ ప్రభుత్వం టీచర్లపట్ల ఝులుం ప్రదర్శించడంతో గురువులకు చిర్రెత్తింది. ఈ క్రమంలోనే 5న నిర్వహించనున్న గురుపూజోత్సవాన్ని బహిష్కరించడం ద్వారా ఉపాధ్యాయులకు కలిగిన మానసిక క్షోభను తెలియజేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. కొన్నేళ్ళక్రితం అప్పటి కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ విద్యా విషయాలపై తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించగా, అదేసమయంలో వచ్చిన గురుపూజోత్సవాన్ని కూడా బహిష్కరించి తమ వ్యతిరేకతను తెలియజేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తోన్న వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించాయి. అయితే కొన్ని సంఘాలు మాత్రం బహిష్కరణకు తాము దూరమన్నట్టుగా ఉండటం గమనార్హం.


కేసులను ఎత్తివేస్తేనే...

పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా ఈనెల 1న సీపీఎస్‌ సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చి రద్దుచేసుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసులు పలు సెక్షన్లకింద ఉపాధ్యాయులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ డీఈవో గంగాభవానికి పలు ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు శనివారం సాయంత్రం లేఖను అందజేశారు. సీపీఎస్‌ ఆందోళన నేపథ్యంలో పోలీసులు టీచర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సంఘంలో ఉపాద్యాయ వృత్తికివున్న ఉన్నతిని దిగ జారుస్తూ నోటీసులు ఇచ్చి అరెస్టులు చేయడంతో టీచర్లు మానసికంగా భయబ్రాంతులకు గురయ్యారని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉపాధ్యాయులెవ్వరూ సంతోషంగా లేరని, గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొనేస్థితిలో లేరని వివరింరారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ దినోత్సవ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు డీఈవోకు తెలియజేశారు. కాగా ఆయా ఉపాధ్యాయ సంఘాల్లో చురుకుగా వ్యవహరిస్తోన్న టీచర్లలో అవార్డు గ్రహీతలుంటే వారుమాత్రం ఉత్తమ పురస్కారాలు స్వీకరించబోరని ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘనేత తెలిపారు. బహిష్కరణ లేఖను డీఈవోకు అందజేసిన ఉపాధ్యాయ సంఘాల నాయకుల్లో యూటీఎఫ్‌ నుంచి రవికుమార్‌, నరసింహారావు, పీఆర్టీయూ నుంచి ఆంజనేయులు, ఎస్టీయూ నుంచి నారాయణ, ఏపీటీఎఫ్‌–1938 నుంచి కృష్ణ, బీహెచ్‌పీ నుంచి సాయిరాజ్‌, ఆప్టా నుంచి రామారావు, ఏపీటీఎఫ్‌ నుంచి రంగావలీ, డీటీఎఫ్‌ , ఆర్‌యూపీపీ, ఏపీ పీఈటీ, అపస్‌, ఏపీటీయూ తదితర సంఘాల జిల్లా నాయకులు ఉన్నారు.



ఉత్తమ గురువులు వీరే


ముగ్గురికి రాష్ట్రస్థాయి, 12 మందికి జిల్లాస్థాయి పురస్కారాలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 3 : విధినిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరచిన ఉపాధ్యాయులకు విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబరు 5న నిర్వహించే గురుపూజోత్సవ వేడుకల సందర్భంగా అందజేసే రాష్ట్ర, జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాను శనివారం విడుదల చేశారు. రాష్ట్రస్థాయి పురస్కారాలు ఏలూరు జిల్లాలో ముగ్గురికి, జిల్లాస్థాయి పురస్కారాలు 12 మందికి లభించాయి. వీటితో పాటు పాఠశాలల్లో పరిశుభ్రతను పాటించడంలో మంచి పనితీరు కనబరచినందుకు కేంద్రం ప్రకటించే ‘స్వచ్ఛ విద్యాలయ’ పురస్కారాలకు ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో పోటీపడిన మూడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా 5న అవార్డులను అందజేయనున్నారు. 


రాష్ట్ల్రస్థాయి అవార్డులు వీరికే

 ఏలూరు జిల్లానుంచి బుటాయగూడెం జడ్పీ హైస్కూలులో ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న పి.శ్రీనివాసరావు, లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం ఎంపీయూపీ స్కూలులో ఎస్జీటీగా పనిచేస్తోన్న ఎన్‌.తిరుపతి, పెదపాడులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉన్నారు. స్వచ్ఛ విద్యాలయ రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికైనందుకుగాను ఉమ్మడి జిల్లానుంచి ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి ఎంపీయూపీ స్కూలు, ఇరగవరం మండలం కె.ఇల్లిందపర్రు జడ్పీ హైస్కూలు, గోపాలపురం మండలం కొవ్వూరుపాడు జడ్పీ హైస్కూలు ప్రఽధానోపాధ్యాయులకు అవార్డులు అందజేస్తారు. రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు ఈనెల 4న ఉదయం 11 గంటలకు విజయవాడ లబ్బీపేట ఇందిరాగాందీ మున్సిపల్‌ స్టేడియం వద్దవున్న బిషప్‌ హజరయ్య బాలికోన్నత పాఠశాలలో రిపోర్టు చేయాలని డీఈవో గంగాభవాని సూచించారు. స్కూలు ఐడీ కార్డు, ఇతర ధ్రువపత్రాలను కూడా తీసుకుని హాజరుకావాలన్నారు. అవార్డుల అందజేత కార్యక్రమం 5న ఉదయం 10.30 గంటలకు విజయవాడ మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ కాలనీలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతుందన్నారు.


12 మందికి జిల్లాస్థాయి పురస్కారాలు

జిల్లాలో మొత్తం 15 మంది ఉపాధ్యాయుల నుంచి జిల్లాస్థాయి పురస్కారాలకు ప్రతి పాదనలు అందగా నిర్దేశిత 20 అంశాల్లో కనబరచిన పనితీరు, ప్రతిభ ఆధారంగా నిపుణుల కమిటీ పరిశీలనలు,వడపోత తర్వాత 12 మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు. జిల్లా అవార్డులకు ఎంపికైనవారిలో స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీ నుంచి ఏలూరు శనివారపుపేట జడ్పీ హైస్కూలు హిందీ టీచరు జి.శారద, కామవరపుకోట జడ్పీ హైస్కూలు హిందీటీచరు పి.నాగరాజు, కైకలూరు మండలం భుజబలపట్నం జడ్పీ హైస్కూలు తెలుగు టీచరు వి.వెంకట రాజారావు, టి.నరసాపురం మండలం బండివారిగూడెం ఎంపీ యూపీ స్కూలు సోషల్‌స్టడీస్‌ టీచరు కె.శ్రీనివాసరావు, లింగపాలెం మండలం రంగాపురం జడ్పీ హైస్కూలు గణితం టీచరు షేక్‌ ఉస్మాన్‌ పాషా ఉన్నారు.ఎస్జీటీ కేటగిరీ నుంచి ముసునూరు మండలం సిల్క్‌నగర్‌ ఎంపీపీ స్కూలు టీచరు కె.బాబూరావు, అగిరిపల్లి మండలం ఈదర మెయిన్‌  ఎంపీపీ స్కూలు టీచరు ఎం.వేణుగోపాలరావు, ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు ఎంపీపీ స్కూలు టీచరు ఏ.శ్రీనివాసరావు, లింగపాలెం మండలం కలరాయనగూడెం ఎంపీపీ స్కూలు టీచరు కె.కుటుంబరావు, కొయ్యలగూడెం మండలం సీతమ్మపేట ఎంపీపీ స్కూలు టీచరు కె.సుబ్బారావు, ఏలూరురూరల్‌ మండలం శ్రీరామ్‌నగర్‌ ఎంపీపీ స్కూలు టీచరు ఆర్‌.నాగేంద్రసింగ్‌, పెదపాడు మండలం ఎస్కే.పల్లి ఎంపీపీ స్కూలు టీచరు వి.ఉదయ లక్ష్మి ఉన్నారు. జిల్లాస్థాయి పురస్కారాలను ఈనెల 5న మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు జిల్లాపరిషత్‌ మీటింగ్‌హాలులో నిర్వహించే గురుపూజోత్సవం సందర్భంగా అందజేస్తామని డీఈవో ఆర్‌.ఎస్‌.గంగాభవాని ఓ ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2022-09-04T06:27:49+05:30 IST