టీచర్లకు స్కూళ్ల కేటాయింపు

ABN , First Publish Date - 2021-01-16T04:54:13+05:30 IST

ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసింది. గురువారం నుంచి ఎవరెవరు ఏయే పాఠశాలలకు బదిలీ అయ్యారన్న వివరాలు వాళ్ల ఫోన్‌ నెంబర్లకు మెసేజ్‌ రూపంలో అందాయి.

టీచర్లకు స్కూళ్ల కేటాయింపు

మళ్లీ మొదటికి వచ్చిన హెచ్‌ఎంలు, పండిట్‌ బదిలీలు

వెల్లడి కాని ట్రాన్స్‌ఫర్‌ల లిస్టు

పారదర్శకతపై అనుమానాలు

వెంటనే విధుల్లో చేరాలంటూ ఆదేశం


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) జనవరి 15 : ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ  ముగిసింది. గురువారం నుంచి  ఎవరెవరు ఏయే పాఠశాలలకు బదిలీ అయ్యారన్న వివరాలు వాళ్ల ఫోన్‌ నెంబర్లకు మెసేజ్‌ రూపంలో అందాయి. అయితే పండిట్లుగా గతంలో ఉండి అప్‌ గ్రేడ్‌పై ఎస్‌ఏ తెలుగు, ఎస్‌ఏ హిందీలుగా మారిన వారు, గతంలో ఎస్‌ఏలుగానే ఉద్యోగాల్లో చేరిన బదిలీల ప్రక్రియలో ఖాళీలు చూపే విషయంలో జరిగిన వాదనలు కోర్టును ఆశ్రయించడం తో వారి బదిలీలు మాత్రం పూర్తిగా ఆగిపోయాయి. ఇక హెచ్‌ఎం బదిలీల ప్రక్రియ కూడా సాధారణ సంవత్సరం, అకడమిక్‌ సంవత్సరం ఈరెండు అంశాలపై ఆగిపోయింది. అంటే ఎస్‌ఏ తెలుగు, ఎస్‌ఏ హిందీ బదిలీల ప్రక్రియతోపాటు హెచ్‌ఎంల బదిలీల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయి మళ్లీ కొత్త షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఇక మిగిలిన వారందరికి  బదిలీలు జరిగాయి.


ఇది బదిలీల లెక్క


ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొన్ని నెలలుగా సాగుతూనే ఉంది. ఎప్పుడు లేని విధంగా బదిలీల ప్రక్రియలో పోస్టులను బ్లాక్‌ చేసే విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. దీంతో పాటు ఆన్‌లైన్‌ విఽఽధానంలో బదిలీల ప్రక్రియ నిర్వహించవద్దంటూ, బ్లాక్‌ చేసిన ఖాళీలను వ్యతిరేకిస్తూ ఉపాఽధ్యాయ సంఘాలు నిరసనలు తెలిపాయి.  అయితే రాష్ట్ర ప్రభుత్వం నిరసనలను ఏ మాత్రం పట్టించుకోకుండా బదిలీల ప్రక్రియను కొనసాగించింది. ఎట్టకేలకు బదిలీ అయిన పాఠశాల వివరాలు ఉపాధ్యాయు లకు తెలియజేస్తూ గురు, శుక్ర వారాలలో ఉపాధ్యాయులకు మెసేజ్‌ల ద్వారా తెలియజేశారు. జిల్లాలో మొత్తం 3683 ఖాళీలు ఉండగా, వాటిలో 1460 బ్లాక్‌ చేశారు. 2227 ఖాళీలను ఆన్‌లైన్‌లో ఉంచారు. 5 నుంచి ఎనిమిదేళ్లు పూర్తయిన టీచర్లు 1572 మంది ఉన్నారు. రిక్వెస్ట్‌ బదిలీలకు 3,412 మంది చేసుకున్నారు. అంటే వీరిలో ఎస్‌ఏ తెలుగు తప్పని సరి 22 మంది, రిక్వెస్ట్‌ బదిలీలు 137, హిందీ తప్పనిసరి బదిలీలు 47, రిక్వెస్ట్‌ 117, గ్రేడ్‌ 2 హెచెఎంలు తప్పనిసరి 30, రిక్వెస్ట్‌లు 104, పీఎస్‌హెచ్‌ఎంలు తప్పని సరి 28, రిక్వెస్ట్‌ లు 47 ఉన్నారు. ఇక గతంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఆఖరి ఘట్టానికి వచ్చినప్పుడు బదిలీ అయిన వారి తుది జాబితాను బహిర్గతం చేసేవారు. దాని ఆధారంగా తమకు అన్యాయం జరిగిందా లేదా అని ఉపాధ్యాయులు తెలుసుకునేవారు. అయితే ఈ సారి ఉపాధ్యాయుల ఫోన్లకే మెసేజ్‌లు రావడంతో ఎవరికి ఏ అన్యాయం జరిగిందా ? అన్న దానిపై స్పష్టత లేకుండా పోయిందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇక ఆన్‌లైన్‌ ద్వారా తాము పెట్టని ప్రాంతాల్లో పోస్టింగ్‌ లు వచ్చాయంటూ మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఫోన్లకు మెసేజ్‌లు వచ్చిన వెంటనే పాఠశాలలో చేరాలంటూ జీవోలో పొందుపరచడంతో పండుగ కూడా లేకుండా గురు, శుక్రవారాలలో పలువురు ఉపాధ్యాయులు పరుగులు పెడుతూ పాఠశాలలకు వెళ్లి జాయిన్‌ అయ్యారు. 

Updated Date - 2021-01-16T04:54:13+05:30 IST