టార్గెట్‌ టీచర్‌

ABN , First Publish Date - 2022-09-07T06:02:27+05:30 IST

ప్రభుత్వం తమపై కత్తి కట్టిందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నట్టుగానే తాజాగా వారిపై మరో పిడుగు పడింది. సవరించిన చైల్డ్‌ ఇన్ఫో డేటా ప్రకారం టీచర్ల సర్‌ప్లస్‌, హేతుబద్దీకరణల అనంతరం పాఠశాలల వారీగా ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది.

టార్గెట్‌ టీచర్‌

హేతుబద్దీకరణతో హైస్కూలు ఉపాధ్యాయులపై పెనుభారం

ఒక్కొక్కరికి 42 పీరియడ్లు.. ఊపిరి సలపనంత పని 

ఉమ్మడి జిల్లాలో 1600లకు పైగా ఎస్జీటీ పోస్టుల భర్తీ ఇక లేనట్టే

సబ్జెక్టు కన్వర్షన్‌ పదోన్నతులకు సిద్ధంగా 218 ఖాళీలు  


ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 6 : ప్రభుత్వం తమపై కత్తి కట్టిందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నట్టుగానే తాజాగా వారిపై మరో పిడుగు పడింది. సవరించిన చైల్డ్‌ ఇన్ఫో డేటా ప్రకారం టీచర్ల సర్‌ప్లస్‌, హేతుబద్దీకరణల అనంతరం పాఠశాలల వారీగా ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. ఆ ప్రకారం ఉమ్మడి జిల్లాలో భారీగా టీచరు పోస్టులు (వర్కింగ్‌ వేకెన్సీలు కాకుండా) పోవడంతోపాటు, మిగులు టీచర్లను అవసరం వున్న పాఠశాలలకు సర్దుబాటు చేయడం, ఈ రెండు కారణాలతో ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పనిచేస్తోన్న ఉపాధ్యాయులు అదనపు పీరియడ్లు బోధించాల్సి రావడంతో పనిభారం పెరిగిపోవడం ఖాయంలా ఉంది. తాజా పరిణామాలతో ఉపాధ్యాయుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యా శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 1 : 20 చొప్పున ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిష్పత్తిన టీచరు పోస్టులను నిర్ధారిస్తారు. ఆ లెక్కన జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఈ ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచరు సెలవు పెడితే పాఠశాలను నిర్వహించేదెవరన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి మరీ దారుణమని చెప్పవచ్చు. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు వున్న యూపీ స్కూళ్ళలో 97లోపు విద్యార్థులు ఉంటే అక్కడి నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ ఉపాధ్యాయులను తీసివేసి కేవలం ఎస్జీటీ పోస్టులనే ఇస్తారు. ఇక్కడ 1 : 30 నిష్పత్తిన ముగ్గురు ఎస్జీటీలను మాత్రమే కేటాయిస్తారు. ఆ ప్రకారం 3–8 తరగతుల వరకు విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లపైనే బోధనా భారం పడుతుంది. హైస్కూళ్ళ విషయానికి వస్తే సబ్జెక్టుల వారీగా టీచర్ల సంఖ్యను సెక్షన్ల వారీగా నిర్ధారించారు. ఆ ప్రకారం ఒక్కో సెక్షన్‌లో విద్యార్థుల సంఖ్యను అమాంతం పెంచేసి ఒకరిద్దరు సబ్జెక్టు టీచర్లపైనే పనిభారాన్ని పెంచనున్నారు.


హైస్కూలు టీచర్లకు 42 పీరియడ్లు 

తాజా లెక్కలతో హైస్కూల్‌ ఉపాధ్యాయులపై పనిభారం ఇపుడున్న దానికంటే అధికం కానుంది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయుడు వారానికి 28 నుంచి 32 పీరియడ్ల చొప్పున బోధిస్తుండగా, ఇకపై గరిష్టంగా 42 పీరియడ్లకు పెరుగుతాయి. ఈ క్రమంలో సబ్జెక్టు పీరియడ్లు (వర్కింగ్‌) వారానికి 36తోపాటు, మరో సబ్జెక్టును ఎక్స్‌ట్రా కరికులంగా చేర్చి మరో 6 పీరియడ్లు బోధించేలా పనిభారాన్ని పెంచనున్నారు. సవరించిన జీవో 128 ప్రకారమే హైస్కూళ్ళలో సెక్షన్ల సంఖ్యను నిర్దారించి టీచరు పోస్టులను రేషనలైజేషన్‌ అనంతరం సర్‌ప్లస్‌ టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయడంతో మిగతా ఉపాధ్యాయులపై అదనపు పనిభారం పడటం ఖాయం.


 ఎస్జీటీ పోస్టుల భర్తీ ఇక లేనట్టే

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1600లకు పైగా సెకండరీ గ్రేడ్‌ టీచరు (ఎస్జీటీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా తాజాగా చేపట్టిన రేషనలైజేషన్‌ను వినియోగించుకోనున్నారు. వాస్తవంగా ఈ ఖాళీలను డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో భర్తీ చేయాలి. కాని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందంటూ చాలాకాలంగా ఈ పోస్టుల ఊసెత్తడం లేదు. ఇప్పుడు ఈ పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడినట్టేనని చెబుతున్నారు.


పదోన్నతులు, సర్‌ప్లస్‌ వేకెన్సీలు ఇలా

జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులు, రేషనలైజేషన్‌లపై జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. ప్రధా నోపాధ్యాయులు 22 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీ 72, వ్యాయామ విద్య (పీడీ) 124 పోస్టులు కలిపి మొత్తం 218 ఖాళీలు పదోన్నతులకు సిద్దంగా వున్నట్టు నిర్దారణకు వచ్చారు. ఈ పోస్టులన్నింటినీ సబ్జెక్టు కన్వర్షన్‌ ద్వారా మాత్రమే పదోన్నతులకు అప్‌గ్రేడేషన్‌ చేయాలి. హెచ్‌ఎం పోస్టులకు ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టులను అప్‌ గ్రేడేషన్‌ చేయడం మాత్రమే జిల్లాలో సాధ్యపడేలా ఉందని ఓ అంచనాకు వచ్చారు. మిగతా పోస్టుల ఉద్యోగోన్న తికి సంబంఽధిత కన్వర్షన్‌ సబ్జెక్టుల్లో అవసర మైన విద్యార్హతలు తప్పనిసరి అయి నందున సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం పదోన్నతి పోస్టుల్లో 70 శాతం పోస్టులను ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడంద్వారాను, మిగతా 30 శాతం పోస్టులను డీఎస్సీ నియామకాల ద్వారా భర్తీ చేయను న్నారు. అయితే సబ్జెక్టు కన్వర్షన్‌కు అవసరమైన సంఖ్యలో తగిన విద్యార్హతలు గల ఇన్‌సర్వీస్‌ టీచర్లు జిల్లాలో లేకపోతే ఆ పోస్టులను డీఎస్సీలో చేర్చి భర్తీ చేస్తారు. ఇక సర్‌ప్లస్‌ (మిగులు) ఉపాధ్యాయ ఖాళీలు జిల్లాలో 223 మాత్రమే ఉన్నట్టు ద్రువీకరించారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటి చైల్డ్‌ ఇన్ఫో డేటా ఆధారంగా పాఠశాలల వారీగా సబ్జెక్టు టీచర్ల సంఖ్యను నిర్దారించగా స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం 50, ఫిజికల్‌ సైన్సు 16, సోషల్‌ స్టడీస్‌ 71, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 86 సర్‌ ప్లస్‌ వెకెన్సీలుగా నిర్దారించారు. జిల్లాలో పదోన్నతులు, సర్‌ప్లస్‌ వేకెన్సీల సంఖ్య ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే టీచర్ల పదోన్నతులకు, బదిలీలకు షెడ్యూలు విడుదల చేయ డానికి పాఠశాల విద్యా శాఖ చర్యలను వేగవంతం చేసింది. జిల్లా విద్యా శాఖ విడుదల చేసిన జాబితాలపై ఎంఈవోలు, డీవైఈవోల తుది పరిశీలన అనంతరం ఈ గణాంకాల్లో కొద్దిపాటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. 



Updated Date - 2022-09-07T06:02:27+05:30 IST