ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-19T06:21:58+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని యూఎస్‌పీసీ నాయకులు డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ వైఖరిని నిరసిస్తూ బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 18 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని యూఎస్‌పీసీ నాయకులు డిమాండ్‌ చేశారు.  విద్యాశాఖ వైఖరిని నిరసిస్తూ బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.  అంతకుముందు రగుడు శివారులోని అంబ్కేర్‌ విగ్రహం నుంచి ఉపాధ్యాయులు ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల విషయంలో ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందన్నారు.  317 జీవో ద్వారా ఉపాధ్యాయుల విభజనకు చూపిన అత్యుత్సాహం బదిలీలు, పదోన్నతుల విషయంలో చూపడం లేదన్నారు.  ఏడేళ్లుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నారని,  సీఎం పలుమార్లు పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వేసవి సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు పూర్తి చేస్తామని ప్రకటించారని, వేసవి సెలవులు సగం వరకు ముగిసినా షెడ్యూల్‌ విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులకు స్కూల్‌ అసిస్టెంట్‌, ప్రధానోపాఽధ్యాయుల పదోన్నతులను ఇవ్వడానికి ఆటంకాలు ఏమీలేవని మంత్రి పలుమార్లు ప్రకటించిన షెడ్యూల్‌ను విడుదల చేయడంలో జ్యాపం  చేస్తున్నారని అన్నారు.  సీఎం కేసీఅర్‌  జోక్యం చేసుకోవాలని, లక్షణమే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జీవో 317పై ఉన్న అప్పీల్స్‌, భార్యభర్తల పరస్పర బదిలీల సమస్యలను పరిష్కారించండంతోపాటు ఉద్యోగుల వేతనాలను నెల మొదటి తేదీన విడుదల చేయాలని, సపిమెంటరీ బిల్లుల మంజూరులో జాప్యం నివారించాలన్నారు. నగదు రహిత వైద్యం అమలు కోసం వేతనాల్లో 2 శాతం కోతను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే మే 31వ తేదీన హైదరాబాద్‌లో మహాధర్నా చేస్తామన్నారు. యూఎస్‌పీసీ నాయకులు దోర్నాల భూపాల్‌రెడ్డి, జక్కని నవీన్‌, దొంతుల శ్రీహరి, వుత్తం విజయ్‌కుమార్‌, పిట్టల దేవరాజు, రాజలింగం, గొల్లపల్లిశ్రీనివాస్‌, ప్రశాంత్‌, పాతూరి మహేందర్‌రెడ్డి, జంగిటి రాజు, రాజేశ్వర్‌రావు, మల్లారపు పురుషోత్తం, మారుపాక రాజు, మోతుకుల నారాయణగౌడ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T06:21:58+05:30 IST