ఇదుగో సీటు..అదుగో జాబు..

ABN , First Publish Date - 2020-05-23T10:32:55+05:30 IST

ఓ టీచర్‌ సినిమా స్టయిల్‌లో నిరుద్యోగుకు టోకరా వేశాడు. మామూలుగా కాదు, అరచేతిలో వైకుంఠం

ఇదుగో సీటు..అదుగో జాబు..

నిరుద్యోగులకు ఓ టీచర్‌ టోకరా

ఉద్యోగాలిప్పిస్తానని రూ.లక్షలు వసూలు

జడ్పీ కార్యాలయం వద్ద బాధితుల గగ్గోలు

మునుపటి కలెక్టర్‌ పేరుతో ఆర్డర్‌ కాపీలు


అనంతపురం విద్య, మే 22: ఓ టీచర్‌ సినిమా స్టయిల్‌లో నిరుద్యోగుకు టోకరా వేశాడు. మామూలుగా కాదు, అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఉద్యోగాలిప్పిస్తానని నమ్మబలికి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశాడు. స్వతహాగా వారికి పరీక్షలు కూడా పెట్టాడు. మెడికల్‌ సర్టిఫికెట్లు కావాలంటూ అదనంగా డబ్బు గుంజాడు. ఇంకేముంది, మీరు సెలెక్ట్‌ అయిపోయారు. ఉద్యోగాలు వచ్చేసినట్లేనన్నాడు. ఇక్కడే కూర్చుని పని చేస్తారంటూ సీట్లను కూడా చూపాడు. మునుపటి కలెక్టర్‌ పేరుతో ఉత్తర్వులను కూడా సృష్టించాడు. పే స్లిప్పులు ఇస్తాను రమ్మన్నాడు. తీరా వస్తే.. ఆ టీచర్‌ కనిపించలేదు. దీంతో వారు గగ్గోలు పెడుతున్నారు.


అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని కక్కలపల్లి తదితర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు రికార్డు అసిస్టెంట్‌, స్వీపర్‌, వాచ్‌మన్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు ఓ టీచర్‌. శుక్రవారం పే స్లిప్పులు ఇస్తాననీ, జడ్పీ వద్దకు రావాలని నమ్మబలికాడు. దీంతో అక్కడికొచ్చిన బాధితులు ఆయన రాకపోవటంతో మోసపోయినట్లు  తెలుసుకుని, గగ్గోలు పెట్టారు. బాధితులు నారాయణస్వామి, తులసమ్మ మరికొందరు మాట్లాడుతూ ఇల్లూరు దగ్గర ఎంపీయూపీ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్‌ మల్లికార్జున తమకు ఉద్యో గాలిప్పిస్తానని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ వసూలు చేశాడన్నారు. కొవ్వూరునగర్‌లోని చైతన్య స్కూల్‌లో పరీక్షలు కూడా పెట్టాడన్నారు.


కొందరితో డాక్టర్‌ సర్టిఫికెట్ల కోసమని మరిన్ని డబ్బు వసూలు చేశాడన్నారు. ఉద్యోగాల పేరుతో పేరుతో మోసం చేసిన మల్లికార్జున నుంచి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. నారాయణస్వామి వద్ద రూ.2 లక్షలు, శివ నుంచి రూ.2.5 లక్షలు, లక్ష్మీనారాయణ నుంచి రూ.2.3 లక్షలు, తులసమ్మ నుంచి రూ.56 వేలు, వేణుగోపాల్‌ నుంచి రూ.45 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పైగా మునుపటి కలెక్టర్‌ సత్యనారాయణ పేరుపై కలెక్టరేట్‌ పాలనాధికారి సంతకాలతో కూడిన ఉత్తర్వులను బాధితులకు ఇచ్చాడు. గతంలోనూ ఇలా జడ్పీలో ఉద్యోగాల పేరుతో ఫేక్‌ ఉత్తర్వులు జారీ అయిన ఉదంతం వెలుగుచూసింది. జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్న తాధికారుల ఫోర్జరీ సంతకాలతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-05-23T10:32:55+05:30 IST