ఉపాధ్యాయ గర్జన

ABN , First Publish Date - 2022-01-21T06:03:57+05:30 IST

‘మాకొద్దు, మాకొద్దు...మాయదారి పీఆర్‌సీ మాకొద్దు’, ‘రద్దు చేయాలి, రద్దు చేయాలి...చీకటి జీఓలు రద్దు చేయాలి’...అనే నినాదాలతో గురువారం కలెక్టరేట్‌ ప్రాంతం దద్దరిల్లిపోయింది.

ఉపాధ్యాయ గర్జన
కలెక్టరేట్‌ వద్ద గురువారం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులు

పీఆర్‌సీని వ్యతిరేకిస్తూ జిల్లా నలుమూలల నుంచి  కలెక్టరేట్‌కు తరలివచ్చిన వేలాది మంది టీచర్లు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ అధికంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌

ప్రస్తుతం ఇస్తున్న హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలి

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి

...కానీ తగ్గించడం ఇప్పుడే చూస్తున్నామంటూ మండిపాటు

పొరుగునున్న స్టాలిన్‌, మమతా బెనర్జీలను చూసైనా నేర్చుకోవాలని హితవు

కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం

ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు

వాటిని తోసుకుని మరీ ముందుకు కదిలిన ఉపాధ్యాయులు

ఆర్‌డీఓకి వినతిపత్రం ఇచ్చిన ఫ్యాప్టో ప్రతినిధులు


విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):


‘మాకొద్దు, మాకొద్దు...మాయదారి పీఆర్‌సీ మాకొద్దు’, ‘రద్దు చేయాలి, రద్దు చేయాలి...చీకటి జీఓలు రద్దు చేయాలి’...అనే నినాదాలతో గురువారం కలెక్టరేట్‌ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మెరుగైన పీఆర్‌సీని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ముట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఇచ్చిన పిలుపును అందుకొని జిల్లా నలుమూలల నుంచి  తరలివచ్చిన వేలాది మంది ఉపాధ్యాయులతో కలెక్టరేట్‌ జంక్షన్‌ కిక్కిరిసిపోయింది.


పీఆర్‌సీపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కీలకమైన సంఘ నాయకులనుహౌస్‌ అరెస్టు చేశారు. అలాగే పాడేరు, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, భీమిలి ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారిని దారిమళ్లించే ప్రయత్నం చేశారు. కలెక్టరేట్‌ జంక్షన్‌కు నలువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే ఉపాధ్యాయులు వాటిని తోసుకొని కలెక్టర్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆ జంక్షన్‌లో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ, మధ్యంతర భృతి కంటే ఫిట్‌మెంట్‌ ఎక్కువ ఇవ్వాలని, ప్రస్తుతం 27 శాతం ఐఆర్‌ ఇస్తున్నందున 23 శాతం ఫిట్‌మెంట్‌ను అంగీకరించబోమని స్పష్టంచేశారు. కనీసం 28 శాతమైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఇంటి అద్దె అలవెన్స్‌కు సంబంధించి ప్రస్తుతం వున్న మూడు శ్లాబులను కొనసాగించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, కానీ ప్రభుత్వం పీఆర్‌సీ ద్వారా తగ్గించడం ఇదే ప్రథమమని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది ఉద్యోగ వ్యతిరేక నిర్ణయమని, దీనిని తాము ఆమోదించడం లేదని ప్రకటించారు. 


మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలి

ఉన్నతాధికారులు సిఫారసు చేసిన పీఆర్‌సీని రద్దు చేసి, అశుతోష్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. పెన్షనర్లకు ప్రస్తుతం ఇస్తున్న క్వాంటమ్‌ పెన్షన్‌నే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో కనీస జీవన వయస్సు 72 సంవత్సరాలని నివేదికలు చెబుతుంటే, ప్రభుత్వం 80 ఏళ్లు దాటాక ప్రయోజనాలు ఇస్తామని చెప్పడం మోసం చేయడమేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సచివాలయ, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా అన్యాయం చేశారని, వారు కూడా త్వరలో తమతో పాటు ఆందోళనలో పాల్గొంటారని ఫ్యాప్టో నాయకులు వెల్లడించారు. అరవై ఏళ్ల రిటైర్‌మెంట్‌ వయసుకే ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, ఎవరు అడిగారని ఈ వయస్సును 62 ఏళ్లకు పెంచారో స్పష్టంచేయాలని కొందరు అన్నారు. కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టిన విషయం తెలుసుకోవాలన్నారు. అడగని వారికి, ఇంట్లో కూర్చున్న వారికి సంక్షేమ పథకాల పేరిట నిధులు పంచుతూ...పనిచేసే ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులని చెబుతారా అంటూ కొందరు ప్రశ్నించారు. కార్పొరేషన్‌ల పేరిట...పనిలేకున్నా పది మందికి తక్కువ లేకుండా డైరెక్టర్లను నియమించి, వారికి నెలకు రూ.12 వేల గౌరవ వేతనం ఎవరు ఇమ్మన్నారని, అలా చేస్తే ఆర్థిక సమస్యలు రావా?...అని ఇంకొంతమంది నిలదీశారు. సలహాదారులని చెప్పి లక్షలకు లక్షల రూపాయలు ఇస్తున్నారని అవన్నీ ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు. పక్కనున్న తమిళనాడులో స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌లో మహిళ అయిన మమతా బెనర్జీ చక్కగా పాలిస్తున్నారని, వారిని చూసైనా నేర్చుకోవాలని హితవు పలికారు. అనంతరం ఫ్యాప్టో చైర్మన్‌ ఎంవీ కృష్ణకుమార్‌, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్‌రెడ్డి, కోశాధికారి సుధాకర్‌, కో-చైర్మన్లు రామిరెడ్డి, దేవుడు బాబు, చిన్నబ్బాయి, అప్పారావు, సుధాకర్‌, రామకృష్ణ, కొటాన శ్రీనివాస్‌ తదితరులు ఆర్‌డీఓ పెంచల కిశోర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. 


అరెస్టులపై ఆచితూచి నిర్ణయం

ఆర్‌డీఓకు వినతిపత్రం 12 గంటలకు సమర్పించిన తరువాత ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళనను కొనసాగించారు. మరింత ఉధృతం చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు పలువురిని తీసుకువెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ విధుల్లో వున్న ఏసీపీ తదితరులు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశారు. అయితే అరెస్టులు వద్దని, పరిస్థితులు చేజారకుండా చూసుకోవాలని సూచనలు రావడంతో మైకులో సంయమనం పాటించాలని కోరారు. ఇలా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉపాధ్యాయులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. 


ప్రభుత్వం మోసం చేసింది

- ఎం.వి.కృష్ణకుమార్‌, ఫ్యాప్టో చైర్మన్‌

రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను, పెన్షనర్లను తీవ్రంగా మోసం చేసింది. ఈ పీఆర్‌సీ వల్ల లాభం వచ్చింది, జీతం పెరిగిందని ఏ ఒక్క ఉద్యోగి చెప్పినా బేషరతుగా ఇక్కడ నుంచి వెళ్లిపోతాం. మళ్లీ రోడ్డెక్కడంగానీ, పీఆర్‌సీ అడగడం గానీ చేయం. ఏ ఒక్క ఉద్యోగికీ లాభం లేదు. పెన్షనర్లకు ప్రయోజనం లేదు. సీపీఎస్‌ రద్దు ఊసే లేదు. మమ్మల్ని దారుణంగా వంచించారు. మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే అన్ని సంఘాలు మాకు మద్దతు ఇస్తున్నాయి. 

  

ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించింది

జేవీ పద్మ, ఉపాధ్యాయిని

ప్రభుత్వం మా ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. అన్నివర్గాల ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తూ, మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వడానికి బాధపడుతోంది. ఊరికే కూర్చున్న వారికి ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నారు. కష్టపడిన వారికి ఎందుకు ఇవ్వడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచకుండా తగ్గించారు. ఉద్యోగులకు ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తోంది.



Updated Date - 2022-01-21T06:03:57+05:30 IST