Abn logo
Sep 26 2021 @ 00:41AM

జడ్పీ పీఠంపై టీచరమ్మ

జడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర


అనూహ్యంగా సుభద్ర రాజకీయ ప్రవేశం

సోదరుడి సూచన మేరకు ఎన్నికల్లో పోటీ


పాడేరు, సెప్టెంబరు 25: ఎంఏ, బీఈడీ చేసిన ఆమె ఒక ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అదే వృత్తిలో కొనసాగుతానని, కొనసాగాలని అనుకున్నారు. అయితే అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించి జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని అధిష్ఠించారు. ఇదీ శనివారం జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన జల్లిపల్లి సుభద్ర నేపథ్యం...

ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామానికి చెందిన గిరిజన రైతు అరబీరు గాసి, చంద్రకళ దంపతుల మూడో సంతానం సుభద్ర. తండ్రి వ్యవసాయం చేస్తుండగా, తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. అక్క అష్టమి, అన్న జగబంధు. సుభద్ర ఒకటి, రెండు తరగతులు స్వగ్రామం లబ్బూరు ప్రాథమిక పాఠశాలలో, మూడు నుంచి ఐదు తరగతుల వరకు బంగారుమెట్ట ఆశ్రమ పాఠశాలలోను, ఆరు నుంచి పదో తరగతి వరకు ముంచంగిపుట్టులోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్‌ పాడేరు గురుకుల కళాశాలలో, బీఏ, ఎంఏ ఏయూ దూరవిద్య ద్వారా పూర్తిచేశారు. ఆ తరువాత చోడవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎడ్‌ చేశారు. 2004లో ముంచంగిపుట్టుకు చెందిన జల్లిపల్లి వెంకటవరహా నరసింహమూర్తితో వివాహం జరిగింది. వారికొక కుమార్తె ఉంది. ఎంఏ, బీఎడ్‌ చేసిన సుభద్ర కొంతకాలంగా పాడేరులోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు.

అన్నయ్య మాటతో రాజకీయ ప్రవేశం

ముంచంగిపుట్టు మండలంలో 2014 నుంచి వైసీపీ నేతగా వున్న సుభద్ర సోదరుడు జగబంధుకు పార్టీ జడ్పీటీసీ టికెట్‌ కేటాయించాలనుకున్నది. అయితే జడ్పీటీసీ స్థానం మహిళకు రిజర్వు కావడం, ముగ్గురు పిల్లల నిబంధన కారణంగా ఆయన భార్య కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో చెల్లెలు సుభద్రను బరిలోకి దింపారు.  

అనూహ్యంగా అరుదైన అవకాశం..

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సుభద్ర గిరిజన తెగల్లో మరింత వెనుకబాటులో వున్న ఆదిమ జాతి గిరిజన తెగ (పోర్జా)కు చెందినవారు. గిరిజనుల్లో భగత, వాల్మీకి, కొండదొర వంటి తెగలకు చెందినవారు రాజకీయంగా కాస్త ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిమ జాతి గిరిజన మహిళను జడ్పీ పీఠంపై కూర్చోబెడితే రాజకీయంగా లాభిస్తుందని భావించిన వైసీపీ అధిష్ఠానం...సుభద్రకు అవకాశం కల్పించింది.