కోడింగ్‌, రోబోటిక్స్‌ బాగా నేర్పండి!

ABN , First Publish Date - 2021-07-09T06:17:04+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని అగ్రశ్రేణి మార్గం వైపు నడిపించడానికి అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ దూరదృష్టితో వ్యవహరిస్తూ కిందిస్థాయి నుంచే విద్యారంగాన్ని..

కోడింగ్‌, రోబోటిక్స్‌ బాగా నేర్పండి!

తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని అగ్రశ్రేణి మార్గం వైపు నడిపించడానికి అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ దూరదృష్టితో వ్యవహరిస్తూ కిందిస్థాయి నుంచే విద్యారంగాన్ని పటిష్ఠం చేయడం కోసం గురుకులాలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేశారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపి) విద్యారంగంలో నెలకొల్పాల్సిన ప్రమాణాల గురించి నిర్దేశించి, లక్ష్యాలు, ఫలితాల పట్ల పట్టింపును చూపించినప్పటికీ, వాటి సాధనకు ఏయే పంథాలను అవలంభించాలనేది రాష్ట్రాలకే వదిలేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియను చేపట్టింది. ఎన్‌ఈపి ప్రకారం ప్రస్తుత జిడిపిలో మూడు శాతం ఉన్న విద్యారంగం కేటాయింపులను ఆరు శాతానికి పెంచుతారు. పెరిగిన నిధులను రాష్ట్రాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా జాతీయ అంతర్జాతీయ సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి వీలుగా సద్వినియోగపరచుకోవాలి. 


విద్యాలయాలు అగ్రశ్రేణి సంస్థలుగా ఎదగడానికి నిధులు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్‌పై ఆధారపడకుండా నిధుల సమీకరణపై అవి దృష్టి నిలపాలి. సరికొత్త సవాళ్ళను ఎదుర్కొనడానికి తగిన అభివృద్ధి, పరిశోధన ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం కోసం ఆచార్యులను వేగిరపరచవలసి ఉన్నది. యూనివర్శిటీ-–ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌ ద్వారా కన్సల్టెన్సీ నిధులను సమీకరించవచ్చు. డిమాండ్‌ ఉన్న ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించి, విషయ పరిజ్ఞానం కలిగిన నిపుణులతో బోధన కొనసాగించాలి. విద్యలో నాణ్యత పెరగాలంటే ప్రతి అధ్యాపకుడిని జవాబుదారీగా చేయడం తక్షణ కర్తవ్యం. ప్రతి అధ్యాపకుడు విధిగా పబ్లిక్‌ డొమేన్‌లో తాను నిర్వర్తించిన బోధనా బాధ్యతలను, ఆవిష్కరణలను పొందుపరచాలి. నిర్వహించిన పరిశోధనల వివరాలను, ఈ స్వీయ ప్రకటననే వారి పదోన్నతిలో పరిగణనలోకి తీసుకోవాలి. 


పాఠ్యప్రణాళికలను రూపొందించి విద్యా షెడ్యూలును ప్రకటించి, విద్యార్థులను, బోధన సిబ్బందిని పరుగులు తీయించాలి. ఆవర్తన అంచనా పరీక్షలను నిర్వహించాలి. ప్రాజెక్ట్‌ కార్యక్రమాన్ని పాఠ్యాంశాలలో విధిగా పొందుపరిస్తే ఆచరణాత్మక జ్ఞానం ద్విగుణీకృతమవుతుంది. సరికొత్త దృక్కోణంతో ఆలోచించే సృజనాత్మకత, సహకారం, కుతూహలం, కమ్యూనికేషన్‌లు 21వ శతాబ్దానికి కీలకమైన నైపుణ్యాలు. విద్యార్థులు ఆరంభం నుంచే కోడింగ్‌, ఇంటర్‌నెట్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా సైన్స్‌, రోబోటిక్స్‌ గురించి కూడ క్షుణ్ణంగా తెలుసుకోవలసి ఉంటుంది.


జాతీయ విద్యావిధానంలో డిగ్రీస్థాయి విద్యను నాలుగు సంవత్సరాలకు పొడిగించారు. విద్యార్థులు ఏ స్థాయిలో అయినా నిష్క్రమించే అవకాశం ఉన్నది కనుక దానికి అనుగుణంగా పాఠ్యప్రణాళికలను రూపొందించడం అనివార్యం. ఇప్పుడు ఉన్నట్టుగా కాక, అభిరుచిని బట్టి సబ్జెక్ట్‌ ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థులకు కల్పించే ‘చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌’ రాబోతున్నది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని కోర్సులను రూపొందించాల్సి ఉంది. కిందిస్థాయి నుంచే విద్యార్థులలో పరిశోధనపై మక్కువ ఏర్పరిస్తే, వినూత్న ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. సమర్థమైన బోధనా పద్ధతుల ద్వారా ఉత్తేజపరిచే అభ్యాస అనుభవాలు అందించడం, విద్యార్థులందరికీ సామాజిక అనుబంధం కోసం అర్థవంతమైన అవకాశాలు కల్పించడం ఎన్‌ఈపిలో భాగం. అందువల్ల ఈ అంశంపై దృష్టి సారించాలి. విద్యార్థులు విద్యాపరమైన అంశాలపై మాత్రమే కాకుండా విస్తృత సామర్థ్యాలపై కూడ దృష్టి నిలిపేలా చూడాలి.


శక్తిమంతమైన, కార్యదక్షత కలిగిన సమర్థ అధ్యాపకుల ఎంపిక విద్యాసంస్థల విజయానికి కీలకం. అధ్యాపకులకున్న జ్ఞానం, నిబద్ధతే విజయానికి ఆయువుపట్టు. కామన్‌ టెస్ట్‌ ద్వారా నిపుణుల ఆధ్వర్యంలో వీరి ఎంపిక ప్రక్రియను చేపట్టాలి. అధ్యాపక నియామకం, అభివృద్ధి, భవిష్యత్‌ పురోగతి, నిధుల సేకరణ, వేతనాల నిర్వహణ ప్రతి విద్యాసంస్థ సంస్థాగత ప్రణాళికలో భాగం కాబట్టి అధికారులు ఈ విషయాలపై దృష్టి సారిస్తే రాష్ట్రం విద్యారంగంలో అగ్రగామిగా నిలుస్తుందనడం నిస్సందేహం.

డా. పార్థసారథి తీగుళ్ల

రసాయనశాస్త్ర ఆచార్యులు (విశ్రాంత)

Updated Date - 2021-07-09T06:17:04+05:30 IST