‘బెల్టు’లోనే బ్రాండ్లు!

ABN , First Publish Date - 2020-02-22T08:47:13+05:30 IST

నచ్చిన బ్రాండ్ల కోసం మందుబాబులు బెల్టుషాపుల బాట పట్టారు. అక్కడ తమకు కావాల్సిన రకం కొనుక్కొని తాగుతున్నారు. కాకపోతే క్వార్టర్‌పై అదనంగా

‘బెల్టు’లోనే బ్రాండ్లు!

ఏది కావాలన్నా అక్కడే లభ్యం

షాపుల నుంచి నేరుగా తరలింపు

క్వార్టర్‌ సీసాపై రూ.50 అదనం


అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): నచ్చిన బ్రాండ్ల కోసం మందుబాబులు బెల్టుషాపుల బాట పట్టారు. అక్కడ తమకు కావాల్సిన రకం కొనుక్కొని తాగుతున్నారు. కాకపోతే క్వార్టర్‌పై అదనంగా రూ.50 పెట్టాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ మద్యం షాపుల్లో అన్నీ అనామక బ్రాండ్లే అమ్ముతున్నారని చెబుతున్నారు. స్థానిక నేతలు, మద్యం షాపుల సిబ్బంది చేతివాటంతో షాపుల్లో దొరకని మద్యం బ్రాండ్లు బెల్టు దుకాణాల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. సీసాకు రూ.20- 30 చొప్పున అదనంగా తీసుకుని పాపులర్‌ బ్రాండ్ల కేసులను బెల్టులకు తరలిస్తున్నారు. 


ఇలా తరలిపోతోంది

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాపులర్‌ బ్రాండ్ల కొరత మొదలైంది. తమ బ్రాండ్లకు ఎక్సైజ్‌ ఆర్డర్లు ఇవ్వాలంటే 10శాతం కమీషన్‌ ఇవ్వాల్సి వస్తోందని, అది తమవల్ల కాదని కొన్ని కంపెనీలు చేతులెత్తేశాయి. ఇప్పటికే తమ బ్రాండ్‌కు మంచి పేరుందని, ఇప్పుడు కమీషన్లు ఇచ్చి కొత్తగా తాము సాధించేదేమీ లేదని మొత్తానికి వ్యాపారాన్నే ఆపేస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో పలు కంపెనీలు ఉత్పత్తిని ఆపేయగా, కొందరు ఉత్పత్తి చేసి ఇతర రాష్ర్టాలకు తరలించుకుంటున్నారు. ఎక్సైజ్‌శాఖ కోరిన స్వల్పస్థాయి సరుకును మాత్రమే షాపులకు సరఫరా అవుతోంది. ఆ శాఖ కూడా కమీషన్ల వ్యవహారంలో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయంపై కొన్ని కంపెనీలు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పినట్లు తెలిసింది. కాగా కంపెనీలకు ఒకేసారి మొత్తం ఆర్డర్లు ఆపేస్తే కావాలనే కొన్ని బ్రాండ్లు తీసేశారని ప్రచారం జరుగుతుందని భావించి, 10- 20శాతం వరకు ఆర్డర్లు కుదించారు. అంటే ఒక బ్రాండ్‌కు 100 కేసులు డిమాండ్‌ ఉంటే, దానిని 20 కేసులకు తగ్గించారు. దీంతో షాపులకు స్వల్పస్థాయిలో పాపులర్‌ బ్రాండ్లు వెళ్తున్నాయి. స్థానిక నాయకులు దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారం మొదలుపెట్టారు. సరుకు వచ్చీరాగానే అక్కడ అమ్మకుండా, బెల్టులకు పంపాలని షాపుల సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో సిబ్బంది కూడా మారుమాట్లాడటం లేదు. దీంతో షాపుల్లో అమ్మాల్సిన మద్యం కాస్తా బెల్టుల్లో వెలుస్తోంది. క్వార్టర్‌పై రూ.50 అదనంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. షాపుల్లో ఆ బ్రాండ్లు దొరక్కపోవడంతో మందుబాబులు వేరే దారిలేక వాటినే ఆశ్రయిస్తున్నారు. కిరాణా షాపులు, కిళ్లీ కొట్లు, ఇతరత్రా వ్యాపార కేంద్రాల మాటున గుట్టుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పుడు పాపులర్‌ బ్రాండ్లకు మరింత డిమాండ్‌ రావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాగూ సరకు భారీస్థాయిలో ఉండదు కాబట్టి పెద్దగా ప్రచారం లేకుండా, సమాచారం బయటకు వెళ్లనీయనివారికి మాత్రమే అమ్ముతున్నారు. పలుచోట్ల కావాల్సిన బ్రాండ్లు నేరుగా ఇళ్ల వద్దకే పంపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ యంత్రాంగం నిస్సహాయంగా మిగిలిపోతోంది. అన్నీ తెలిసినా అధికార పార్టీ నేతల అండ ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేక మౌనం వహిస్తున్నారు. నూతన మద్యం పాలసీతో ఇప్పటికే ఈశాఖ చాలావరకు నామమాత్రంగా మిగిలిపోయింది. ప్రభుత్వ మద్యం షాపులు రాకముందు ఎక్సైజ్‌ యంత్రాంగం కీలకంగా వ్యవహరించేది. ఇప్పుడు షాపులపై నియంత్రణ లేకపోవడంతో ఉల్లంఘనలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు అధికార పార్టీ ఒత్తిళ్లు వారిని అటువైపు చూడనీయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-02-22T08:47:13+05:30 IST