వలసలతో టీడీపీకి నష్టమెంత?

ABN , First Publish Date - 2020-08-04T10:53:24+05:30 IST

‘మండలంలో అభివృద్ధి పనులన్నీ నీ ఆధ్వర్యంలోనే జరిగాయి కదా. వాటి కమీషన్లూ నీకే చేరేవి. నువ్వనుభవించని పదవులేవైనా..

వలసలతో టీడీపీకి  నష్టమెంత?

కుప్పం, ఆగస్టు 3: ‘మండలంలో అభివృద్ధి పనులన్నీ నీ ఆధ్వర్యంలోనే జరిగాయి కదా. వాటి కమీషన్లూ నీకే చేరేవి. నువ్వనుభవించని పదవులేవైనా ఉన్నాయా? ఎంతమందిలో ఉన్నా, చంద్రబాబు సారు నిన్ను పేరు పెట్టి పిలిచి పక్కన కూర్చోబెట్టుకునేవారా కాదా? మరిప్పుడు ఈ ఆరోపణలేమిటి? వైసీపీ మిత్రులారా ఇట్నించటు దూకిన ఈయప్పతో జాగ్రత్త..’ 


వైసీపీలోకి వలసెళ్లిపోయిన ఓ మండల ప్రధాన నాయకుడిని ఉద్దేశించి అదే మండలానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడొకరు వాట్సాప్‌ గ్రూపులో చేసిన వ్యాఖ్య ఇది.


అధికారంలో ఉన్న ఐదేళ్లూ సర్వాధికారాలూ, పదవులూ అనుభవించి ఇప్పుడు వైసీపీలోకి వరుస కడుతున్న కుప్పం నియోజకవర్గ టీడీపీ నాయకుల తీరుకు ఈ వ్యాఖ్యలు అద్దం పడతాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ ఇప్పుడు వలసల పర్వం నడుస్తోంది. కొంతమంది పేరుపడ్డ నాయకులతో పాటు పదులకొద్దీ కుటుంబాలకు కుటుంబాలు టీడీపీనుంచి వైసీపీలోకి వెళ్తుండడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఆ పార్టీకి గండి పడ్డట్టేనని సామాజిక మాధ్యమాల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యానాలు వచ్చిపడుతున్నాయి. ఇటీవల ఆ పార్టీలో చేరిన ఇద్దరు టీడీపీ నాయకుల విషయాన్ని పరిశీలిస్తే ఇందులో వాస్తవమెంతన్నది తేటతెల్లమవుతుంది. ఆదినుంచి తన గుండెకాయగా చంద్రబాబు చెప్పుకునే గుడుపల్లె మండలంనుంచి మాజీ ఎంపీపీ, ఏంఎంసీ మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌, శాంతిపురం మండలానికి చెందిన సీడీసీఎస్‌ మాజీ ఛైర్మన్‌ శ్యామరాజు ఇటీవల తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.


టీడీపీలో తమకు కనీస గుర్తింపు లేదని, జగన్‌ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మెచ్చి ఆ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. గుడుపల్లె టీడీపీలో చంద్రబాబు అగ్రప్రాధాన్యమిచ్చింది చంద్రశేఖర్‌కే అయితే, బాబు చలవతోనే శ్యామరాజు సీడీసీఎస్‌ ఛైర్మన్‌ కాగలిగారు. వారిద్దరితోనూ చెప్పుదోగ్గ నాయకులు, మరీ ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తలు ఎవరూ వెళ్లకపోవడం ఒక ఎత్తు. అన్ని పదవులూ అనుభవించిన తర్వాత నమ్మిన పార్టీని, అధినేతను కాలదన్ని స్వలాభంకోసం పార్టీ మారడం మరొక ఎత్తు. నిజానికి ఇటువంటి నాయకులు పార్టీని వీడి వెళ్లడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో అటు వైసీపీలో వారిని చేర్చుకున్న ఉత్సాహమేమన్నా కనిపిస్తున్నదా అంటే అదీ లేదు. ఈరోజు ఆ పార్టీని మోసం చేసినోళ్లు రేపు మనల్ని మోసం చేయబోరన్న గ్యారంటీ లేదని అధికార పార్టీ కార్యకర్తలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం పేరు‘గొప్ప’ నాయకులు వలసెళ్లిపోవడంవల్ల టీడీపీకి వచ్చే నష్టం కానీ, అటు వైసీపీకి కొత్తగా చేకూరే ప్రయోజనం కానీ లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే వారిని అటువైపెళ్లకుండా ఆపలేకపోవడం నియోజకవర్గం లోని నేతల వైఫల్యమేనని అదే విశ్లేషకులు చెప్పడమూ గమనార్హం. 

Updated Date - 2020-08-04T10:53:24+05:30 IST