Advertisement
Advertisement
Abn logo
Advertisement

పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ!

  • తెలుగుదేశం పార్టీ యోచన
  • నేడు పొలిట్‌బ్యూరో అత్యవసర భేటీ.. ఆ తర్వాత నిర్ణయం!
  • మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వకపోవడంపై టీడీపీ నిరసన

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. దీనిపై శుక్రవారం  ఆ పార్టీ అత్యవసరంగా పొలిట్‌బ్యూరో, రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశాలను ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగే ఈ భేటీల తర్వాత దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గత ఏడాది మార్చి నెలలో జరిగిన ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నందువల్ల వాటిని రద్దు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శుక్రవారం నిర్వహించే పార్టీల సమావేశంలో కూడా ఈ డిమాండ్‌ను బలంగా వినిపించాలని టీడీపీ భావించింది. అయితే ఆ సమావేశం జరపకుండానే కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ కొంత ప్రయత్నం చేసినా వైసీపీ దౌర్జన్యాలను, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయారని..  కొత్త కమిషనర్‌ ఆ మాత్రం ప్రయత్నం కూడా చేసే పరిస్థితి లేనప్పుడు ఇక ఈ ఎన్నికల్లో పాల్గొనడం వల్ల ప్రయోజనం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇందులో పాల్గొంటే.. అధికార పక్షం చేసిన సకల పాపాలకు ఆమోద ముద్ర వేయడమేనని ఒక సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఏంచేస్తే బాగుంటుందన్న దానిపై జిల్లా నేతల అభిప్రాయాలను పార్టీ కేంద్ర కార్యాలయం సేకరిస్తోంది.


Advertisement
Advertisement