Abn logo
Sep 25 2021 @ 01:19AM

జి.మాడుగులలో ఫలించిన టీడీపీ వ్యూహం

కొర్రా పద్మ, ఎంపీపీ

పాడేరు(జి.మాడుగుల): జి.మాడుగుల మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నేతల వ్యూహం ఫలించింది. దీంతో ఎంపీపీ పదవి టీడీపీ మద్దతుతో స్వతంత్ర ఎంపీటీసీ సభ్యురాలు కొర్రా పద్మను వరించింది. మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీకి ఏడు, టీడీపీకి ఏడు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ఎలాగైనా ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీ, టీడీపీ తీవ్రంగా ప్రయత్నాలు సాగించాయి. అయితే టీడీపీలో ఐక్యతగా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతుండగా... వైసీపీలో అందుకు భిన్నంగా  ఎంపీటీసీ సభ్యులు కుడుముల సత్యనారాయణ, గబ్బాడ సన్యాసిదొర ఎంపీపీ స్థానానికి పోటీ పడ్డారు. దీంతో వైసీపీకి చెందిన ఏడుగురు సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఒక దశలో స్వతంత్ర ఎంపీటీసీ సభ్యురాలు కొర్రా పద్మ వైసీపీకే మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారు. అయినప్పటికీ ఎంపీపీ అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో వైసీపీ నేతలు ఒక కొలిక్కి రాకపోవడంతో స్వతంత్ర ఎంపీటీసీ సభ్యురాలు పద్మ, వైసీపీకి చెందిన వంజరి ఎంపీటీసీ సభ్యుడు కె.మధు సైతం వారికి దూరమయ్యారు. దీంతో వైసీపీలో మొత్తం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా ఎంపీపీ పీఠం వైసీపీకి దక్కకూడదనే పట్టుదలతో టీడీపీ నేతలు మత్స్యరాస వరహాలరాజు, సోమెలి చిట్టిబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. దీంతో టీడీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు, వైసీపీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడు కె.మధు మద్దతుతో స్వతంత్ర ఎంపీటీసీ సభ్యురాలు కొర్రా పద్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. అలాగే వైస్‌ఎంపీపీగా వంతాల ఎంపీటీసీ సభ్యురాలు వంతాల కల్యాణి (టీడీపీ), కోఆప్షన్‌ సభ్యుడిగా రహమాన్‌(టీడీపీ) ఎన్నికయ్యారు.