వాకాడు సీఐ, ఎస్‌ఐలపై చర్య తీసుకోవాలి: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-04-16T10:21:31+05:30 IST

సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజిలిలో టీడీపీ ముఖ్య నాయకులను అన్యాయంగా బెదిరిస్తున్న వాకాడు సీఐ నరసింహారావు,

వాకాడు సీఐ, ఎస్‌ఐలపై చర్య తీసుకోవాలి: అచ్చెన్న

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజిలిలో టీడీపీ ముఖ్య నాయకులను అన్యాయంగా బెదిరిస్తున్న వాకాడు సీఐ నరసింహారావు, ఎస్‌ఐ శేఖర్‌బాబులను తక్షణమే విధుల నుంచి తప్పించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున బూత్‌ ఏజెంట్లను పెట్టవద్దని, ఒక వేళ పెడితే మీ సంగతి చూస్తానని సీఐ, ఎస్‌ఐ బెదిరిస్తున్నారని గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. వారిద్దరూ పోలీ్‌సశాఖలో పని చేస్తున్నారో? వైసీపీలో పని చేస్తున్నారో అర్థంకావడం లేదని మండిపడ్డారు. ఎన్నికలయ్యాక వైసీపీ ప్రభుత్వం ఇంకా మూడేళ్లు ఉంటుందని, మీ పరిస్థితి ఏమిటో చూసుకోవాలంటున్నారని పేర్కొన్నారు.


పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూడేళ్ల తర్వాత వైసీపీ ఉండదని, తర్వాత కూడా పోలీసులు ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే, భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, మిగిలిన వారెవరైనా వారికి సేవకులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బెదిరింపులు, తప్పుడు కేసులతో తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-04-16T10:21:31+05:30 IST