గాలి పార్టీ.. గాలికే పోతుంది!

ABN , First Publish Date - 2022-05-19T08:51:28+05:30 IST

‘వైసీపీ ఒక గాలి పార్టీ. గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది.. 160 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని టీడీపీ

గాలి పార్టీ.. గాలికే పోతుంది!

దొంగ లెక్కలు రాసేవారికి,తన కేసులు 

వాదించేవారికి రాజ్యసభ సీట్లా?

ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం రెడీ: అచ్చెన్న


ఒంగోలు, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ఒక గాలి పార్టీ. గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది.. 160 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరగనున్న మహానాడు ఏర్పాట్లకు సంబంధించి పలువురు ముఖ్యనేతలతో కలిసి ఆయన మండవవారిపాలెం గ్రామ పొలాల్లో బుధవారం ఉదయం 11.11 గంటలకు శాస్త్రోక్తంగా భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. వైసీపీ రాజ్యసభ టికెట్ల కేటాయింపు చూస్తేనే అది ఒక గాలి పార్టీ అని, రాజకీయ పార్టీ లక్షణాలే లేవని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. టీడీపీ నుంచి 2019లో పార్లమెంటుకు పోటీచేసిన ఒకరికి, తెలంగాణలో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన మరొకరితో పాటు తనకు దొంగలెక్కలు రాసే ఒకరికి, తన సీబీఐ కేసులు వాదించే మరొకరికి జగన్‌ రాజ్యసభ సీట్లు ఇచ్చారని, అలా ఏ పార్టీ అయినా చేస్తుందా అని ప్రశ్నించారు.


టీడీపీ ప్రభుత్వంలో తనలాంటి అనేక మంది బీసీ మంత్రులు స్వతంత్రంగా పాలన చేశారని.. అలాంటి పరిస్థితి జగన్‌ ప్రభుత్వంలో ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చేసి వారి కింద అందరినీ పనిచేయమంటున్నారని, బీసీలకు పదవులు ఇచ్చి వారి నోళ్లకు ప్లాస్టర్లు వేశారన్నారు. ‘వైసీపీ ఎన్ని నాటకాలు ఆడినా.. తలకిందులుగా తపస్సు చేసినా బీసీలను టీడీపీ నుంచి వేరుచేయలేరు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే అనూహ్య స్పందన వస్తోంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మాకు పోటీగా వైసీపీ గడప గడపకు కార్యక్రమం చేపట్టింది. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి వివిధ ప్రాంతాల్లో మంత్రులను, వైసీపీ ప్రజాప్రతినిధులను జనం నిలదీస్తున్న తీరే నిదర్శనం. ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్‌ దుర్మార్గపు పాలనను జనం భరించలేకపోతున్నారు. ఎన్నికలు ఎప్పడు వచ్చినా టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని అచ్చెన్న తెలిపారు. ఒంగోలులో మహానాడు కోసం మినీస్టేడియంను అడిగితే తొలుత ఇస్తామని చెప్పిన అదికారులు.. తర్వాత సీఎంవో ఒత్తిళ్లతో ఇవ్వలేదన్నారు. ఒత్తిళ్లను లెక్కచేయకుండా మండవవారిపాలెం రైతులు మహానాడు నిర్వహణకు భూములిచ్చారని, వారి సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర, బీద రవిచంద్ర, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T08:51:28+05:30 IST