టీడీపీ సోషల్‌ మీడియా వెధవా

ABN , First Publish Date - 2022-07-03T08:52:39+05:30 IST

టీడీపీ సోషల్‌ మీడియా వెధవా

టీడీపీ సోషల్‌ మీడియా వెధవా

మాకు వ్యతిరేకంగా పోస్టులు పెడతావా?

సీఐ... ఇతన్ని వెంటనే అరెస్టు చేయండి

‘గడప గడప’కులో విప్‌ కాపు ఫైర్‌

వలంటీర్‌ ఫిర్యాదుతో ఐటీడీపీ నేత అరెస్టు


రాయదుర్గం, జూలై 2: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి వీరంగమేశారు. ప్రభుత్వ కరపత్రంతో ఫొటో దిగడానికి నిరాకరించిన టీడీపీ కార్యకర్తను అరెస్టు చేయించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం 8వ వార్డులో శనివారం గడప గడపకు... కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐటీడీపీ నేత మారుతి ఇంటి వద్దకు స్థానిక ఎమ్మెల్యే, విప్‌ కాపు రామచంద్రారెడ్డి వెళ్లారు. ‘అమ్మ ఒడి కింద నీకు డబ్బులు పడ్డాయా..?’ అని మారుతిని ప్రశ్నించారు. రెండేళ్లపాటు వచ్చాయని, ఈ ఏడాది రాలేదని మారుతి ఎమ్మెల్యేకి తెలిపారు. దీంతో పక్కనే ఉన్న వార్డు వలంటీరును ఆయన కారణం అడిగారు. విద్యుత్‌ బిల్లు ఎక్కువ వచ్చిందని వలంటీరు ఎమ్మెల్యేకి తెలిపారు. ‘ఈ చిన్నపాటి గుడిసెకు అంత బిల్లు వచ్చిందా?’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘కాదు.. ఇతనికి ప్లాస్టిక్‌ బిందెల తయారీ కర్మాగారముంది’ అని వలంటీరు తెలిపారు. ఆ క్రమంలో మారుతి జోక్యం చేసుకుని... ‘టీడీపీ వాడినని మీరు ఆ ఫ్యాక్టరీని సీజ్‌ చేయించారు కదా?’ అని ఎమ్మెల్యేకి గుర్తు చేశాడు. అంతే, ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘ఓహో..! నువ్వేనా టీడీపీ సోషల్‌ మీడియా వెధవ్వి? సోషల్‌ మీడియాలో టీడీపీని పొగుడుతూ పోస్టులు పెడతావా?’’ అంటూ చిందులు వేశారు. ప్రభుత్వ కరపత్రం తీసుకుంటూ తనతో ఫొటోదిగాలని ఒత్తిడి చేశారు. అందుకు తిరస్కరించిన మారుతి, ‘‘మీ ప్రభుత్వం గురించి చెప్పుకోండి సార్‌. నేను ఫొటో దిగను’’ అని అన్నాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. వెంటనే మారుతిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే పోలీసులు ఆ ఆదేశాలను పాటించారు. విధులకు ఆటంకం కలిగించారని వలంటీర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతిపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-07-03T08:52:39+05:30 IST