టీడీపీకి రెబెల్స్‌

ABN , First Publish Date - 2021-03-04T06:52:56+05:30 IST

జీవీఎంసీలోని కొన్ని వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగుబాటు అభ్యర్థులు (రెబెల్స్‌) ఉన్నారు.

టీడీపీకి రెబెల్స్‌

13, 47, 35, 36, 87, 91 వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులు

అసంతృప్తులకు నేతల బుజ్జగింపులు


విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీలోని కొన్ని వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగుబాటు అభ్యర్థులు (రెబెల్స్‌) ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు బుధవారంతో ముగియడంతో ఎక్కడెక్కడ పార్టీ తరపున బీఫారం అందని వ్యక్తులు బరిలో ఉన్నారో పార్టీ నేతలు గుర్తించారు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని నాల్గవ వార్డు అభ్యర్థిగా తొలుత గరికిన కింగ్‌ను ప్రకటించారు. అయితే పోటీ నుంచి తప్పుకోవాలని కింగ్‌ను కొందరు నేతలు బెదిరించారని తెలుగుదేశం నేతలకు సమాచారం వచ్చింది. దీంతో అప్పటికప్పుడు అప్రమత్తమై అదే వార్డు నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన పాతి నరసింగరావుకు బీఫారం అందజేశారు. అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ వార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన నల్లాన వరలక్ష్మి స్వతంత్ర అభ్యర్థినిగా బరిలో ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన లక్ష్మీపూజ బదులుగా యాగాటి ఆదిలక్ష్మికి బీఫారం ఇచ్చారు. దీంతో లక్ష్మీపూజ నామినేషన్‌ ఉపసంహరించకుండా బరిలో ఉండిపోయారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 31వ వార్డు నుంచి గతంలో బీఫారం తీసుకున్న దొడ్డి బాపూఆనంద్‌కు బదులుగా వానపల్లి రవికుమార్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. దీనికి నిరసనగా దొడ్డి బాపూఆనంద్‌ పార్టీకి రాజీనామా చేశారు. నామినేషన్‌ ఉపసంహరించుకున్న ఆయన అధికార పార్టీలో చేరనున్నట్టు చెబుతున్నారు. 35వ వార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన పిల్లి వెంకటరమణ కూడా పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఎన్నికల బరిలో వున్నట్టు ప్రకటించారు. 36వ వార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన ఇమంది సత్యవతి పోటీలో ఉన్నారు. ఇదే నియోజకవర్గంలోని 32వ వార్డు టిక్కెట్‌ ఆశించిన దుర్గారెడ్డికి పార్టీ నాయకులు నిమ్మల రామానాయుడు, ఎంవీ శ్రీభరత్‌, ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తదితరులు నచ్చజెప్పి వార్డు అధ్యక్ష పదవి ఇచ్చారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 91వ వార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన నమ్మి కృష్ణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుండనున్నట్టు ప్రకటించారు. అలాగే గాజువాక పరిధిలోని 87వ వార్డు టిక్కెట్‌ ఆశించిన గొర్లె వెంకునాయుడు కూడా పోటీలో ఉన్నారు. కాగా గాజువాక పరిధిలో 72వ వార్డు సీపీఐ (ఏజె స్టాలిన్‌)కి, 78వ వార్డు సీపీఎం (గంగారావు)కు కేటాయించారు. దీంతో ఈ రెండు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయితే నగర పరిధిలోని 19 వార్డుల్లో సీపీఎం అభ్యర్థులు పోటీలో ఉన్నారు.


వైసీపీకి ఆరు వార్డుల్లో...


24, 35, 39, 66, 76, 79 వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులు

తలలుపట్టుకుంటున్న నేతలు, అభ్యర్థులు


విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆరు వార్డుల్లో రెబెల్స్‌ ఉన్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 35వ వార్డులో అలుపన కనకరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడంతో విల్లూరి భాస్కరరావు, 39వ వార్డులో కొల్లి సింహాచలానికి టిక్కెట్‌ కేటాయించగా మహ్మద్‌ షాదిక్‌, గురజాపు సత్యవాణి రెబెల్స్‌గా పోటీలో నిలిచారు. 24వ వార్డు టిక్కెట్‌ సాది పద్మారెడ్డికి కేటాయించడంతో మజ్జి దుర్గ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకుండా ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. 66వ వార్డులో మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాదర్‌కు టిక్కెట్‌ ఇవ్వడంతో షౌకత్‌ అలీ ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. 76వ వార్డులో దొడ్డి రమణకు టిక్కెట్‌ ఇవ్వడంతో ఆర్‌.నారాయణమూర్తి, 79వ వార్డులో అప్పికొండ మహలక్ష్మినాయుడుకు టిక్కెట్‌ ఇవ్వడంతో పూర్ణానంద శర్మ పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 

Updated Date - 2021-03-04T06:52:56+05:30 IST