రైతు పోరు సక్సెస్‌

ABN , First Publish Date - 2022-07-03T06:58:18+05:30 IST

జగ్గంపేటలో శనివారం సాయంత్రం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పోరు సభ విజయవంతమైంది.

రైతు పోరు సక్సెస్‌

జగ్గంపేట, జూలై 2: జగ్గంపేటలో శనివారం సాయంత్రం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పోరు సభ విజయవంతమైంది. సభకు 5 జిల్లాల నుంచి పలువురు టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జాతీయ రహదారి దగ్గర చైతన్య స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాది మంది రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రైతు పడుతున్న కష్టాలను నేతలు వివరించారు. జగన్మోహన్‌రెడ్డి పాలనలో విద్యుత్‌ మీటర్లు అమర్చడం వల్ల రైతులకు అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. ధాన్యం కొనుగోలు చేసి సొమ్ములు చెల్లించకపోవడం, ఖరీఫ్‌లో అప్పుచేసి వ్యవసాయం చేసే పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ధూళిపాళి నరేంద్ర, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ పాల ఉత్పత్తి డెయిరీలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదేనన్నారు. గుజరాత్‌కు చెందిన అమూల్య పాలును ప్రోత్సహించి,  మిగిలిన డెయిరీలకు నష్టాలు వాటిల్లేలా చేశారన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో  పూర్తిస్థాయిలో నీరు, విత్తనాలు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జ్యోతుల నెహ్రూ, నవీన్‌కుమార్‌ చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయాన్ని అభివృద్ధి బాట పట్టిస్తే  జగన్‌ ప్రభుత్వంలో రైతు కన్నీటి బాట పట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతంలోని చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వంలో పురుషోత్తపట్నం ఫేజ్‌ 1,2లను నిర్మించి సాగునీరు అందించారన్నారు.  వైసీపీ పాలన వచ్చిన తర్వాత రెండు ప్రాజెక్టులను నిలిపివేయడంతో ఏలేరుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందక  ఈ ప్రాంత వాసులు రెండు పంటలు పండించడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీ మరమ్మతులకు నిధులు కేటాయించి వాటిని సరి చేయని పరిస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఆక్వా రంగానికి కూడా పూర్తిస్థాయి మద్దతు ఇవ్వకపోవడంతో పంటలు పండించే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.  అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో క్రాప్‌ హాలిడే ప్రకటించినట్లు, తాజాగా భీమవరంలో ఆక్వాను కూడా నిలిపివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీని గెలిపిస్తేనే రైతులకు, పాడిపంటలకు మేలు జరిగే పరిస్థితి ఉందన్నారు. తుగ్లక్‌ పరిపాలన చేస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని దింపి చంద్రబాబు పాలన కోసం రైతులు ముందుకు రావాలని రైతు పోరుబాట సందర్భంగా పిలుపునిచ్చారు. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన ఎస్‌వీఎస్‌ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కోర్పు సాయితేజ్‌, చదరం చంటి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T06:58:18+05:30 IST