ఉచితంలోనూ మోసమేనా?

ABN , First Publish Date - 2022-08-02T05:37:56+05:30 IST

‘కేంద్ర ప్రభుత్వం ఆహారభద్రతా పథకం కింద ఇస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. పౌరసరఫరాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. రేషన్‌కార్డుదారులకు సక్రమంగా నిత్యావసర సరుకులు అందజేయడం లేదు’ అంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద సోమవారం నిరసనలు చేపట్టారు.

ఉచితంలోనూ మోసమేనా?
శ్రీకాకుళం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, టీడీపీ నేతలు, కార్యకర్తలు

బియ్యం పంపిణీలో జాప్యంపై టీడీపీ నిరసనలు
రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు
రేషన్‌ సరుకులు సక్రమంగా అందజేయాలని డిమాండ్‌
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 1 :
‘కేంద్ర ప్రభుత్వం ఆహారభద్రతా పథకం కింద ఇస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. పౌరసరఫరాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. రేషన్‌కార్డుదారులకు సక్రమంగా నిత్యావసర సరుకులు అందజేయడం లేదు’ అంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద సోమవారం నిరసనలు చేపట్టారు. ఉచిత బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్‌లు, రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఉచిత బియ్యం పథకంలోకూడా రాష్ట్ర ప్రభుత్వం మోసానికి పాల్పడడం దారుణమని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి అన్నారు. సోమవారం శ్రీకాకుళం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాలు ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నాలుగు నెలలుగా పథకాన్ని నిలిపి వేశారని విమర్శించారు. రకరకాల కారణాలతో రేషన్‌కార్డులను కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. రేషన్‌కార్డుదారులందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కోరుతూ తహసీల్దార్‌ వెంకటరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, జామి భీమశంకరరావు, సింతు సుధాకర్‌, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, బలగ చెంగలరావు పాల్గొన్నారు.

ఉద్యమం తప్పదు
కవిటి: ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీలో జాప్యంపై ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్‌ బెందాళం అశోక్‌ మండిపడ్డారు. రేషన్‌ సరుకులు సక్రమంగా పంపిణీ చేయకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సోమవారం కవిటి రెవెన్యూ కార్యాలయంలో అధికారులను నిలదీశారు. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించి ఉచిత బియ్యం పక్కదారి పట్టాయని ఆరోపించారు. ‘వలంటీర్ల ద్వారా రెండు నెలలకు సంబంధించి బియ్యం కూపన్లు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. రేషన్‌ సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదు. టీడీపీ హయాంలో 8 రకాల నిత్యావసర వస్తువులు అందించేవాళ్లం. ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. భూములు అధికంగా ఉన్నాయని, కరెంట్‌ బిల్లు ఎక్కువగా వచ్చిందని కుంటిసాకులు చెబుతూ రేషన్‌కార్డులు తొలగిస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నార’ని ఎమ్మెల్యే అశోక్‌ ఆరోపించారు. నాలుగు నెలల రేషన్‌ సరుకుల పంపిణీలో జాప్యంపై డీటీ రామచంద్రరావును ప్రశ్నించగా.. సరైన సమాధానం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకే స్పష్టత లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉచిత బియ్యం పంపిణీ పూర్తి చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు బి.రమేష్‌; పి.కృష్ణారావు, మాజీ ఏఎంసీ ఉపాధ్యక్షులు ఎస్‌.వెంకటరమణ, సదానంద రౌళో, సంతోష్‌ పట్నాయక్‌, బి.చినబాబు, ఎల్‌.శ్రీను, బి.తిరుమల, కె.వెంకటరావు పాల్గొన్నారు.

ఆహార భద్రతకు తిలోదకాలు
నరసన్నపేట: ఆహార భద్రత హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు. సోమవారం నరసన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ప్రజలకు ఆహారభద్రత కల్పించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉచిత బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని తహసీల్దార్‌కు వినతపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో శిమ్మ చంద్రశేఖర్‌, బెవర రాము, ఉణ్న వెంకటేశ్వరరావు, గొద్దు చిట్టిబాబు, బోయిన సతీష్‌, బైరి భాస్కరరావు, రోణంకి కృష్ణంనాయుడు, జల్లు చంద్రమౌళి, బలగ సుమతి, పోగోటి ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-02T05:37:56+05:30 IST