Abn logo
Sep 19 2021 @ 00:51AM

వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టం

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేశ్‌, అనుయాయుల దాడిని ఖండిస్తూ నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేస్తున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర తదితరులు

 సీఎం సహకారంతోనే చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేశ్‌ దాడి

మంత్రి పదవి కావాలంటే సీఎం కాళ్లు పట్టుకునో..మరో విధంగానో ప్రయత్నించు

టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద నిరసనలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

విద్యాధరపురం,సెప్టెంబరు 18: ‘వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంలా మారింది. సీఎం జగన్మోహనరెడ్డి సహకారంతోనే చంద్రబాబునాయుడు ఇంటిపైకి జోగి రమేశ్‌ దాడికి దిగారు. మంత్రి పదవి కోసం కుట్రపూరిత పనికి పాల్పడ్డారు. తనకు మంత్రి పదవి కావాలంటే సీఎం కాళ్లు పట్టుకునో, మరో విధంగానో ప్రయత్నించవచ్చు.’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హితవు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటి వద్ద శుక్రవారం జరిగిన ఘటనకు నిరసనగా శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులపై కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పరిపాలనాదక్షుడు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మాజీ సీఎం ఇంటిపైకే దాడికి దిగారంటే ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు పిలుపు ఇస్తే దుర్మార్గపు వైసీపీ నాయకులను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని రవీంద్ర హెచ్చరించారు. సీఎం జగన్‌, ఎమ్మెల్యే జోగి రమేశ్‌ చిత్రపటాలను నాయకులతో కలిసి ఆయన దగ్ధం చేశారు. వీరంకి వెంకట గురుమూర్తి, సింహాద్రి కనకాచారి, గన్నే వెంకటనారాయణ ప్రసాద్‌, ఎస్‌.ఫిరోజ్‌, దొంతు చిన్నా, లింగమనేని శివరామప్రసాద్‌, జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి ఉషారాణి పాల్గొన్నారు.