నామక‘రణం’

ABN , First Publish Date - 2022-09-23T05:45:29+05:30 IST

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై టీడీపీ నిరసనలు మిన్నంటాయి.

నామక‘రణం’
మంగళగిరిలో తాలూకా సెంటరులో సీఎం గడ్డిబొమ్మ దహనం

ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుపై ఆగ్రహం

రెండో రోజూ కొనసాగిన టీడీపీ నిరసనలు

ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్‌

రేపల్లెలో జీవోలను దహనం చేసిన నాయకులు


న్యూస్‌నెట్‌వర్క్‌ - ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 22: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై టీడీపీ నిరసనలు మిన్నంటాయి. రెండో రోజు గురువారం కూడా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, దీక్షలు, దిష్టిబొమ్మల దహనాలు, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు, జీవో ప్రతుల దహనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు వివిధ వర్గాల ప్రజలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వర్సిటీకి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ పేరు మార్చడం దుర్మార్గమన్నారు. వెంటనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని, లేకుంటే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పునకు సంబంధించిన జీవోలను రేపల్లెలో టీడీపీ నాయకులు దహనం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కర్లపాలెం, పిట్టలవానిపాలెంలోని టీడీపీ కార్యాలయాల్లో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు.

పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించి  బ్రహ్మనాయుడు సెంటర్‌ వద్ద రోడ్డుపై టైర్లను తగలబెట్టారు.  హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌పేరునే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ భవన్‌లో 24 గంటల నిర్బంధ దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి వైవీ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బస్టాండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన జరిగింది. పేరు మార్పు జీవో ప్రతులను దహనం చేశారు.  

వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడంపై మంగళగిరిలో తెలుగు యువత భగ్గుమంది. పార్టీ కార్యాలయం నుంచి బస్టాండు సెంటరు వరకు ప్రదర్శన నిర్వహించి ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్‌ గడ్డిబొమ్మను దహనం చేసేందుకు తెలుగు యువత కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, తెలుగు యువతకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. కార్యకర్తలు  గౌతమబుద్ధ రోడ్డుపై జగన్‌ గడ్డిబొమ్మను దహనం చేశారు. దీంతో నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పెదవడ్లపూడిలో కన్నెడొంక సెంటరు నుంచి శివాలయం సెంటరు వరకు ప్రదర్శన నిర్వహించి అక్కడ నాయకులు ధర్నా చేశారు.  ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడాన్ని నిరసిస్తూ తాడేపల్లిలో టీడీపీ శ్రేణులు  పార్టీ కార్యాలయం నుంచి స్థానిక గణేష్‌ కళామందిరం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. దుగ్గిరాలలోని టీడీపీ కార్యాలయం నుంచి శివాలయం వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్‌, అంబేద్కర్‌, బాబూజగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలను అందజేశారు. రైలుపేటలోని పురవేదిక వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. పెదకాకానికి చెందిన టీడీపీ నాయకులు జాతీయ రహదారిపై ధర్నా చేసి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ధర్నా చేశారు. జీవో ప్రతులను దహనం చేశారు.  


Updated Date - 2022-09-23T05:45:29+05:30 IST