దళితుల దీక్షలు.. భగ్నం

ABN , First Publish Date - 2022-08-19T05:58:55+05:30 IST

అంబేద్కర్‌ విదేశీవిద్యను మూడేళ్లుగా మరుగునపడేయడమే కాదు.. తాజాగా జగనన్న విదేశీవిద్యగా దాని పేరును మార్చడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను పోలీసులు భగ్నం చేశారు.

దళితుల దీక్షలు.. భగ్నం
దీక్ష చేస్తున్న దళితులను అంబులెన్స్‌లో తరలిస్తున్న పోలీసులు

అర్ధరాత్రి దీక్షా శిబిరంపై పోలీసుల దాడి

దీక్షాపరులను గుంటూరు ప్రభుత్వాస్పతికి తరలింపు

జీజీహెచ్‌లోనూ దీక్షను కొనసాగిస్తున్న టీడీపీ ఎస్సీ సెల్‌ నేతలు

పోలీసు చర్యలను ఖండించిన పలు ప్రజాసంఘాలు

మంగళగిరి, ఆగస్టు 18: అంబేద్కర్‌ విదేశీవిద్యను మూడేళ్లుగా మరుగునపడేయడమే కాదు.. తాజాగా జగనన్న విదేశీవిద్యగా దాని పేరును మార్చడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రారంభించిన దీక్షలు బుధవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. మొత్తం 11 మంది నాయకులు నిరవధిక దీక్ష చేపట్టారు. రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ పేరుమీదగా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి ముఖ్యమంత్రి జగన్‌ ఏకంగా తనపేరు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్షకు వివిధ పక్షాల నుంచి మద్దతు లభిస్తుంది.  ఈ క్రమంలో రెండు రోజుకు చేరుకున్న దీక్షలను భగ్నం చేయాలని పోలీసు అధికారులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. దీంతో బుధవారం రాత్రి ఏడు గంటల నుంచే ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పోలీసుబలగాలను మంగళగిరికి రప్పించారు. రాత్రి పది గంటల సమయంలో పోలీసులు వైద్యసిబ్బందితో శిబిరం వద్దకు చేరుకుని  దీక్షాపరులకు వైద్య పరీక్షలను జరిపించారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఒక్కసారిగావందల సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు దీక్షా శిబిరంపై దాడిచేశారు. దీక్షలను భగ్నం చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను పలువురు నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాల్లో పడవేశారు. అనంతరం దీక్షాపరులను ఎత్తి అంబులెన్స్‌లో కుక్కి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీక్షాపరులకు ఆస్పపత్రిలో సెలైన్‌ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించగా వారంతా నిరాకరించారు. ఆస్పత్రిలోనే టీడీపీ ఎస్సీసెల్‌ జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు వేమూరి మైనర్‌బాబు, కనికళ్ల చిరంజీవి, తెలుగుయువత అధ్యక్షుడు పడవల మహేష్‌, తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష, నాయకులు కొప్పుల మధు, మాణిక్యమ్మ, అనూష, బేతపూడి సుధాకర్‌, ఎర్రగుంట్ల భాగ్యారావు తదితరులు దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్షలను పోలీసులు బలవంతంగా భగ్నం చేసిన తీరును పలు ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. అంబేద్కర్‌ పేరుతో ప్రవేశపెట్టిన పథకాన్ని మూడేళ్లపాటు అటకెక్కించింది చాలక ఇపుడు జగన్‌ పేరిట డబ్బాలు కొట్టుకోవడం ఏమంత సమంజసంగా లేదని నాయకులు విమర్శించారు.  


Updated Date - 2022-08-19T05:58:55+05:30 IST