వైసీపీవి.. శవరాజకీయాలు

ABN , First Publish Date - 2022-08-05T05:49:55+05:30 IST

వైసీపీ నాయకులకు శవ రాజకీయాలు తగవని.. పోస్టులతో వైసీపీ సోషల్‌ మీడియా శునకానందం పొందుతుందని టీడీపీ నాయకులు మండిపడ్డారు.

వైసీపీవి.. శవరాజకీయాలు
ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టీడీపీ నేతలు

పోస్టులతో వైసీపీ సోషల్‌ మీడియా శునకానందం 

దేవేంద్రరెడ్డి, విజయసాయిరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు

వివిధ ప్రాంతాల్లో టీడీపీ నిరసనలు.. దిష్టిబొమ్మల దహనం 

గుంటూరు(సంగడిగుంట), ఆగస్టు 4: వైసీపీ నాయకులకు శవ రాజకీయాలు తగవని.. పోస్టులతో వైసీపీ సోషల్‌ మీడియా శునకానందం పొందుతుందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరిపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వైసీపీ సోషల్‌మీడియా కోఆర్డినేటర్‌ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లలో టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం తదితర కార్యక్రమాలు జరిగాయి. గుంటూరులో ఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర(నాని) మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద అవినీతి ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి తన స్థాయి మరచి సోషల్‌ మీడియాలో నీచంగా చేసే విషప్రచారాలు మానుకోవాలన్నారు. 16 నెలలు జైలు జీవితం గడిపిన విజయసాయిరెడ్డి మృగంలా మారిపోయారన్నారు. బాధలో ఉన్న కుటుంబంపై పిచ్చి పోస్టులు పెట్టి వైసీపీ శునకానందం పొందుతుందన్నారని తెలిపారు. విజయసాయిరెడ్డి, దేవేందర్‌రెడ్డిల చిత్రపటాలను చెప్పులతో కొట్టి తెలుగు మహిళలు నిరసనను తెలిపారు. తెనాలిలో పార్లమెంటరీ కమిటీ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు స్థానిక వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విజయసాయిరెడ్డి, దేవేందర్‌రెడ్డిలపై ఫిర్యాదు చేశారు. నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ సోషల్‌ మీడియాలో  చేస్తున్న విషప్రచారాన్ని ఖండిస్తూ తెలుగు యువత తాడికొండ నియోజకవర్గ అధ్యక్షుడు చిగురుపాటి అనూఫ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విజయసాయిరెడ్డి, దేవేందర్‌రెడ్డిల పోస్టర్లును తగలబెట్టారు. అనంతరం వారిపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఉమామహేశ్వరి మృతిని రాజకీయం చేస్తూ సోషల్‌ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు పెట్టడాన్ని నిరసిస్తూ బాపట్లలో టీడీపీ నాయకులు పట్టణ పోలీసుస్టేషన్‌ దగ్గర ఆందోళన చేశారు.  టీడీపీ అనుబంధ కమిటీల ఆధ్వర్యంలో వేమూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద బాపట్ల పార్లమెంట్‌ స్ధాయి పార్టీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తక్షణమే దేవేంద్రరెడ్డిని  అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కొల్లూరులో బస్టాండ్‌ సెంటర్‌లో టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్‌ కనగాల మధుసూదన ప్రసాద్‌ ఆధ్వర్యంలో  సీం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విజయసాయిరెడ్డి, దేవేందర్‌రెడ్డిలను అరెస్టు చేయాలని కోరుతూ ఫిర్యాదు అందజేశారు. తెలుగుయువత నరసరావుపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చింతా గంగయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు దేవేందర్‌రెడ్డిపై   వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అబద్దాలను పోగు చేసి ప్రజలను పక్క దారి పట్టించే విధంగా వైసీపీ నేతలు చేస్తున్నారంటూ పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో కూడా టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.  తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత నాయకులు నకరికల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-08-05T05:49:55+05:30 IST