రేపు టీడీపీ నిరసన దీక్ష

ABN , First Publish Date - 2021-10-26T06:56:41+05:30 IST

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ మూకల దాడులు, పట్టాభి ఇంటిపై దాడిని గర్హిస్తూ ఈ నెల 27న కందుకూరులో టీడీపీ నిరసన దీక్ష చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తెలిపారు.

రేపు టీడీపీ నిరసన దీక్ష
మాట్లాడుతున్న దివి శివరాం

కందుకూరు, అక్టోబరు 25 : టీడీపీ కార్యాలయాలపై వైసీపీ మూకల దాడులు, పట్టాభి ఇంటిపై దాడిని గర్హిస్తూ ఈ నెల 27న కందుకూరులో టీడీపీ నిరసన దీక్ష చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తెలిపారు. సోమవారం ఆయన కందుకూరులో విలేకర్లతో మాట్లాడారు. వైసీపీ దాడులు చేసి మళ్లీ నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్‌డీవో కార్యాలయం వద్ద జరిగే ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఎప్పుడో జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ మాట్లాడటం కన్నా ప్రస్తుతం జరిగిన దాష్టీకాలను ఖండించి ఉంటే తాను ఆయన కార్యాలయానికి వెళ్లి అభినందించేవాడినన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రుల తీరును మహీధర రెడ్డిలాంటి వాళ్లు ఖండించాల్సిన అవసరం ఉందని శివరాం పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు.  ఇది రాజకీయ నాయకులు ఆపగలిగేది కాదని, ఆయా శాఖల అధికారులు బాధ్యతతో పనిచేసి అరికట్టాలని ఆయన కోరారు. కందుకూరు నియోజకవర్గానికి ప్రస్తుతానికి పోతుల రామారావే టీడీపీ ఇన్‌ఛార్జ్‌ అని, తాను ఇన్‌చార్జ్‌ను కానన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ ఆశించడం లేదని పునరుద్ఘాటించారు. కేవలం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని ఇప్పటికే తమ అధినేత చంద్రబాబునాయుడు వద్దే స్పష్టంగా చెప్పానన్నారు. నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ని నియమించే విషయంలో పార్టీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు దామా మల్లేశ్వరరావు, ఎన్‌వీ.సుబ్బారావు, చిలకపాటి మధు, జి.మోషే పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T06:56:41+05:30 IST