ఇసుక విధానంపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2020-12-03T08:45:50+05:30 IST

వరుసగా మూడో రోజూ అసెంబ్లీ వద్ద టీడీపీ ప్రజాప్రతినిధుల ఆందోళన కొనసాగించారు. రాష్ట్రంలో ఇసుక కొరత, నూతన ఇసుక విధానాల పై నిరసన

ఇసుక విధానంపై టీడీపీ నిరసన

చంద్రబాబు నేతృత్వంలో అసెంబ్లీ వరకూ ర్యాలీ


అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): వరుసగా మూడో రోజూ అసెంబ్లీ వద్ద టీడీపీ ప్రజాప్రతినిధుల ఆందోళన కొనసాగించారు. రాష్ట్రంలో ఇసుక కొరత, నూతన ఇసుక విధానాల పై నిరసన వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. తాపీలు, బొచ్చెలు, పలుగు, పార, ఇసుక, బంగారం కొలిచే త్రాసును ప్రదర్శిస్తూ అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో నూతన ఇసుక విధానాన్ని విమర్శిస్తూ నినాదా లు చేశారు. ఇసుక ధరల పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.


నేతలు మాట్లాడుతూ.. ‘‘ఇసుక సమస్య వల్ల రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. పనుల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భవన నిర్మాణ కూలీలవన్నీ ప్రభుత్వ హత్యలే. 18 నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జే ట్యాక్స్‌కి వెళ్లింది’’ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించి, నాసిరకం ఇసుకను రాష్ట్రంలో అధిక ధరల కు అమ్ముతున్నారు’’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ఇసుకను బంగారంతో కాటా వేసి చూపించారు.

Updated Date - 2020-12-03T08:45:50+05:30 IST