వైసీపీ అరాచకాలకు ఉప ఎన్నికతో చరమగీతం

ABN , First Publish Date - 2020-11-25T04:25:03+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక చరమగీతం కానున్నదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌. గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

వైసీపీ అరాచకాలకు ఉప ఎన్నికతో చరమగీతం
విలేకర్లతో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్‌రెడ్డి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌. గోవర్ధన్‌రెడ్డి 

సూళ్లూరుపేట, నవంబరు 24 : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక చరమగీతం కానున్నదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌. గోవర్ధన్‌రెడ్డి అన్నారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు  అన్ని మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించడంతో సూళ్లూరుపేటకు వచ్చానని ఆయన చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో దొరవారిసత్రం మండల పార్టీ అధ్యక్షుడు వేనాటి సతీష్‌రెడ్డితో కలసి విలేఖరులతో మాట్లాడారు. ఈ నెల 30లోగా నియోజకవర్గంలోని అన్ని మండలాల, గ్రామాల కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు.


ఏం సాధించారని సంబరాలు :

రాష్ట్రంలో కొద్దిరోజులుగా వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటుండటం చూసి ప్రజలే నవ్వుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరాన్ని పాడుచేసినందుకు సంబరమా...? అమరావతి అభివృద్ధిని అడ్డుకున్నందుకు ఆనందమా..? ప్రత్యేక హోదా సాధనపై మడమ తిప్పేసినందుకు సంతోషమా...? అన్న క్యాంటీన్లు మూసివేసి పేద ప్రజల నోటికాడ అన్నాన్ని తీసేసినందుకు పైశాచిక ఆనందమా...? ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రజలు విస్తుపోతున్నారన్నారు. తమ మేనిఫెస్టోలో 90 శాతం అమలు చేసేశామంటూ సంకలు గుద్దుకుంటున్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధికి తట్టెడు మట్టివేసిందా...? అని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయి ఏడాదిన్నర అయినా అవ్వాతాతల పింఛన్‌ 2,250 వద్దే ఆగిపోయి ఉండటం ఆయన మడమతిప్పేశారనేందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు.  ఈ పార్టీ రాక్షసపాలనతో ప్రజలు విసిగిపోయారని తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో ఈ పార్టీకి తగిన బుద్ధి చెప్పనున్నారని అన్నారు. ఈ సమావేశంలో వేమసాని శ్రీనివాసులునాయుడు, పల్లంపర్తి మనోహర్‌, జక్కరయ్య, పురుషోత్తం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-25T04:25:03+05:30 IST